తెలంగాణ .. ఒక సంవత్సరం

తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే అన్నీ సామాజిక వర్గాలకు అన్న పానాదులకు ఆసరా ఉంటుందన్న ఆశతో సబ్బండ వర్ణాల ప్రజలు ఎంతటి వ్యయ ప్రయాసలకైనా ఓర్చుకొని అది మిలియన్ మార్చ్ గానీ, అది సకల జనుల సమ్మె గానీ, అది సాగర హారం గానీ , రాస్తా రోకో గానే రైల్ రోకో గానీ అందరికందరు పాల్గొన్నారు.
పోలీస్ కిస్టయ్య ఆత్మార్పణ నుండి సమైక్యాంధ్ర ఉద్యోగుల సభలో ” జై తెలంగాణ ” అని నినదించిన కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్ దాకా గౌడ సామాజిక వర్గాల బిడ్డలెందరో తెలంగాణ ఉద్యమం లో పాల్గొన్నారు .
తెలంగాణ వచ్చింది . ఏడాది గడిచింది. హైద్రాబాద్ లో కల్లు కాంపౌండులు ఖులాయించిండ్రు.సిటీ లో ఉన్న కొద్ది మంది బడా సేట్ల నసీబ్ ఖులాయించింది. రెవెన్యూ పెంచుకోవాలన్న యావలో బడ్డ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాలను గానీ గీతా కార్మికుల బ్రతుకు దెరువు గురించిగానీ పట్టించుకోకుండా గ్రామ గ్రామాన బెల్టు షాపుల పేరుతో ప్రబుత్వమే చట్ట వ్యతిరేకంగా ఆల్కహాలిక్ డ్రింకుల అమ్మకాలకు పాల్పడింది. దీనితో కల్లు అమ్మకాలు పూర్తిగా మందగింప జెసి ప్రభుత్వమే గీత కార్మికుల మెడలు విరిచింది. ఔషధీయుక్తమై , విటమిన్స్, మినరల్స్ సమ పాళ్ళలో ఉండే కల్లు,నీర స్తానమ్ లో చీప్ లిక్కర్లు తాగి ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు. ఈ చర్య వారి ఆరోగ్యాలను బొంద బెట్టింది.
ఇది చాలదన్నట్లుగా ! ఇపుడు కొత్తగా గుడుంబాను అరికట్టే పేరుతో ప్రభుత్వమే తానే సర్కారు సారానో, లేక రూ|| 30/ కి 180 యామ్. ఎల్ . చీప్ లిక్కర్ తో ప్రజల వాకిల్ల ముందర అంగళ్ళు తెరవడానికి ముందుకు వస్తున్నది. ప్రస్తుతం ఉన్న 2216 లైసెన్సుడ్ షాపులు, వేలాది బెల్ట్ షాపులకు తోడు గా మరో 900 లైసెన్సుడ్ షాపులు తెరుస్తుందట. 11 వేల జనాభాకు ఒక లైసెన్సుడ్ షాప్. ఆన్ లైసెన్సుడ్ కు లెక్కే లేదు. ఇపుడు సాలీన 20 వేల కోట్ల రూపాయల ఆదాయపు టార్గెట్ కు తోడు మరో 12 వేల కోట్ల ఆదాయం పొందడానికి ప్రభుత్వం పథకం రచిస్తున్నది. మరో పక్షం రోజుల్లో ఇది అమలు లోకి వచ్చే అవకాశం ఉంది.
అంటే ఈ 32 వేల కోట్ల ప్రభుత్వ ఆదాయానికి తోడు బ్రేవరీస్ కంపనీలకు, వైన్ షాప్ ల సేట్లకు , రాజకీయ నాయకులకు, అధికార్లకు మామూల్లు. ఇవన్నీ సమకూరాలంటే ఓ లక్ష కోట్ల రూపాయల అమ్మకాలు జరుగాలి. .తాగుడుకు అలవాటైన వాళ్ళు, తాగుడు ప్యాషన్ అనుకొనే వాళ్ళు విలువైన తమ ఆరోగ్యాలను ఫణంగా పెట్టి ప్రభుత్వ రెవెన్యూ పెంచే కృషి చేస్తున్నరు.
ఇది జరుగుతే , 5 లస్ఖల మంది గీత కార్మికులు ఉత్పత్తి జేసిన కల్లు కు మార్కెటింగ్ లేక వాళ్ళు రోడ్డున పడుతారు. బడా పెట్టు బడి దారులైన బ్రేవరీస్ కంపనీలకు , మొలాసిస్ ఉత్పత్తి దారులకు , రెక్టిఫైడ్ స్పిరిట్ ఉత్పత్తి దారులకు మొత్తంగా మార్కెట్ ను ధారా దత్తం జేస్తూ శ్రమ జేసుకొని బతికే గీత కార్మికులకు చేతి లో పని లేకుండా జెసి బడా బాబులకు బంగారు తెలంగాణ సిద్ధింప జేసె కృషిలో ప్రభుత్వం కృతకుత్యమ్ అవుతుంది.
ఆ కృషి లో భాగంగానే జూన్ 10 నాడు ఉద్యమాల పితా మహుడైన మన ముఖ్య మంత్రి గారు గీత కార్మికులకు 5 లక్షల రూ|| ప్రమాద భీమా ప్రకటించిండు. ఈ ప్రమాద భీమ గీత కార్మికులకు కొత్తదేమీ గాదు . రాజశేకర్ రెడ్డి ముఖ్య మంత్రి గా ఉన్న కాలం లో గీత కార్మిక కుటుంబ నేపథ్యం కలిగిన అనేక మంది అయితే ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు కాకుంటే పార్లమెంటరీ రాజకీయాల వైపు మును ముందుకు వస్తున్నందున తమ రాజకీయాధికారానికి ఎక్కడ ఎసరు వస్తుందో అని భయ పడి వారి ఆర్థిక మూలాలు దెబ్బ దీయడానికి నూతన ఎక్సైజ్ పాలసీ తెచ్చిండు. అందులో భాగంగానే చెట్టు పై నుండి పడి చని పోతే అప్పటి దాకా ఇస్తున్న 50 వేల రూ|| ఎక్స్ గ్రేషియా స్తానమ్ లో 2 లక్షల రూ|| ఇన్సూరెన్స్ పథకం తెచ్చిండు. ఇదేదో గొప్ప పనే అనుకోని సంబుర పడ్డారు.కానీ ఆ వచ్చే 50 వేలూ రాక ఇచ్చే డబ్బులు ఇవ్వకుండా ఇన్సూరెన్స్ వాళ్ళు కొర్రీలు వేసి నస్ట పరిహారం ఇవ్వక పోగా ప్రభుత్వం నుండి లక్షలాది రూ|| ల ప్ర్రెమియమ్ ను పొందినారు. గీత కార్మికుల నోళ్ళు కొట్టి ఇన్సూరెన్స్ వాల్ల జేబులు నింపే పనే ఈ ఇన్సూరెన్స్ అని గీత కార్మికులు గ్రహించి ఉద్యమాల ద్వారా తిరిగి ఎక్స్ గ్రేషియా 2 లక్షలు సాధించుకున్నరు.
గీత వృత్తిని పాతాళానికి తోక్కే కొత్త ఎక్సజ్ పాలసీ రేపటి నెల నుండి రానున్నందున దాన్నుండి గీత కార్మికుల దృష్టి మరల్చే కొరకు ఈ రూ|| 5 లక్షల. ప్రమాద బీమా పథకం ప్రకటన అని గీత కార్మికులు గమనించాలి. 5 లక్షల ప్రమాద బీమా కావాలనుకుంటే మోదీ సర్కార్ ప్రవేశ పెట్టిన బీమా యోజన లో సాలీన రూ|| 342. కడితే ఎవరికైనా రూ|| 5 లక్షల ప్రమాద కవరేజి వర్తిస్తుంది.
ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రం లో 2 లక్షల మంది గీత కార్మికులు ఉన్నారు. ఇందులో రిజిస్టర్డ్ సొసైటీ లో సభ్యులైన వారికే ఈ సౌకర్యం వర్తిస్తుందట. అంటే అట్టి వారు ఓ లక్ష మంది కంటే మించక పోవచ్చు. ప్రతి సభ్యునికి సాలీన 342 రూ|| ల చొప్పున 3 కోట్ల 42 లక్షల ఇన్సూరెన్స్ కంపనీలకు అప్పనంగా అప్పజెపితే ఇక రేపటి నుండి చనిపోయిన , లేదా అంగవికలురైన గీత కార్మిక కుటుంబ సభ్యులు చెట్టు పై నుండి పడి దవాఖానలో శరీఖ్ అయ్యింది మొదలు ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చే దాకా ఇన్సూరెన్స్ కంపనీల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూ ఇన్సూరెన్స్ డబ్బులు పొంద లేక ఇప్పుడు వచ్చే రూ|| 2 లక్షలు, 50 వేలు, 25 వేలు, సైతం రాక బికార్ల వలె బిచ్చం ఎత్తుకొనే దరిద్రపు పరిస్తితిని కల్పించ బోతున్న ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ ఈ వృత్తి వద్దూ ఈ పడుడు వద్దూ ఈ చచ్చుడు వద్దూ కాళ్ళు చేతులు , నడుమూ వెన్నుపూస విరుగ గొట్టుకొని చచ్చే దాకా జీవ చ్ఛవం వలె మంచం లో పడి ఉండుడు వద్దూ , ఈ మోకు వద్దూ, ఏ ముత్తాదు వద్దూ మొత్తంగా ఈ వృత్తే వద్దని ఏ ఆటో రిక్షా డ్రైవర్ గానో , అడ్డ కూలీగానో మారే దురవస్త వైపు ప్రభుత్వ విధానాలు నెట్టి వేస్తున్నాయి.
ఈ విధానాలే కొనసాగితే ఎవరికి లాభమో ? ఎవరికి నస్టమో ? ఆలోచిస్తే ! ఆల్కహాలిక్ డ్రింకులు తయారు జేసె బ్రేవరీస్ కంపనీలకు, డిస్ట్రిబూటర్లకు, వైన్ షాప్ ల యజమానులకు ,కూల్ డ్రింక్స్ తయారు జేస్తున్న మల్టీ నేషనల్ కంపనీలకు, అమ్మకం దారులకు, వీటి నుండి ఆదాయం, మామూల్లు పొందే రాజకీయ నాయకులకు, వీటన్నింటినీ కంట్రోల్ జేసె ప్రభుత్వ ఉద్యోగులకు లాభం. వీరెవ్వరు గూడా రెక్కలు దప్ప మరే ఆస్తి పాస్తులు లేని వారు గారు. వీరెవ్వరు గూడ దినం శ్రమను నమ్ము కొని జీవించే వారు గాదు.
ఆరోగ్యకరమైన , ప్రకృతి సహజ సిద్దమైన , అన్ని సందర్భాలలో నిరభ్యంతరంగా, నిరపాయకరంగా, కుటుంబ సభ్యులంతా సేవించ దగ్గ మినరల్స్, విటమిన్స్, సమ పాళ్ళలో ఉన్న నీర మరియు కల్లు కాను మరుగైతే సామాన్య ప్రజల ఆరోగ్యాలకు నస్టమ్ . గీత వృత్తి పోవడం తో ఆ వృత్తి దారులు ఇతర వృత్తుల వైపు వెళ్ళడం వలన శ్రమ జీవుల నిరుద్యోగ రిజర్వ్ ఫోర్స్ పెరిగి శ్రామికుల నిజ వేతనాలు పడిపోతాయి. కనుక శ్రామిక వర్గాలకు ఎనలేని నస్టమ్ జరుగుతుంది.
ఇంతెందుకు గొప్ప గొప్ప ఆదర్శాలు వల్లిస్తున్న ఈ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాలను, గీత కార్మికుల ఉపాధి అవకాశాలను దృష్టిలో పెట్టుకొని గుజరాత్ ప్రభుత్వం వలె నీర ను మినహాయించి సంపూర్ణ మద్య పాన నిషేదం ఎందుకు విధించరని ప్రజలు నిలదీయాల్సిన అవసరం ఉంది.
రాష్ట్రం లో హరిత హారం మరియు మిషన్ కాకతీయ లో భాగంగా 48 లక్షల ఈత మొక్కలు నాట బోతున్నట్లు గొప్పగా చెబుతున్నారు. కనుక ఆ చెట్ల నుండి వచ్చే పానీయానికి కాంబోడియా దేశం లో వలె ఒక పరిశ్రమ స్తాయికి తీసుకొని వస్తే లక్షలాది మందికి చక్కని ఉపాధి లభిస్తుంది. ప్రజలకు పురుగుమందు కలిసిన కూల్ డ్రింక్స్ త్రాగే బెడద తప్పుతుంది.వారికి ఆరోగ్యం చేకూరుతుంది. అంటే గాకుండా సమాజానికి ఉపయోగపడే ఆరోగ్యకరమైన పానీయాన్ని తమ ప్రాణాలు ఫణమొడ్డి చెట్టుపై నుండి దించి తెస్తున్న గీత కార్మికులు ప్రామాదాల బారిన పడినపుడు వారి కుటుంబాలను ఆడుకోవాల్సిన బాధ్యత మొత్తం సమాజానికి బాధ్యత వహిస్తున్న ప్రభుత్వాలదే. కనుక చెట్టు పై నుండి పది చని పోతే 10 లక్షలు, అంగ వికలురు అయితే 5 లక్షల ఎక్స్ గ్రేషియా తక్షణమే చెల్లించే ఏర్పాటు ఉండాలి. కల్తీకి తావు లేని విధంగా చెట్టు వద్దనే అది నీరా ఐనా కల్లు అయినా సేకరించి ప్రాసెసింగ్, చిల్లింగ్ , మార్కెటింగ్ కై విధాన రూప కల్పన జరుగాలి. దేనిపై శాష్ట్రీయ పరిశోధన నిరంతరం జరిగి ప్రజల ఉపాధి, ప్రజల ఆరోగ్యాల పరిరక్షణ ధ్యేయంగా ప్రభుత్వ పథకాలు కొనసాగాలి . అంతే గాని ప్రజల ఆరోగ్యాలకు ఉపాధి అవకాశాలకు విఘాతం కలిగించే చర్యలను సామాన్య ప్రజలెప్పుడు స్వాగతించరు.

– వీరగొని పెంటయ్య గౌడ్,
అధ్యక్షులు,
సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *