
ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ , శ్రీశైలం రహదారిలో కొత్త పర్యాటక ప్రదేశం ఆక్టోపస్ లా మెలికలు తిరిగే కృష్ణా నదికి, అందమైన అడవినీ ఒకేసారి వీక్షించేలా వ్యూ పాయింట్ ప్రారంభం ఎకో టూరిజం విస్తరణలో భాగంగా ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో కొత్త పర్యాటక ప్రదేశం అందుబాటులోకి వచ్చింది. అటవీశాఖ అధికారుల చొరవతో నల్లమల్ల అటవీ అందాలు, కృష్ణా తీర సొగసులు, లోయల అందాలను తిలకించేందుకు వీలుగా ఆక్టోపస్ వ్యూ పాయింట్ ఏర్పాటైంది. ఇక్కడి నుంచి చూస్తే కృష్ణా నది ఆక్టోపస్ లా మెలికలు తిరిగి కనిపిస్తున్నందున ఆ పేరు పెట్టినట్లు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ – శ్రీశైలం హైవే మార్గంలో మన్ననూర్ నుంచి 42 కిలోమీటర్ల దూరంలో దోమలపెంటకు ఐదు కిలోమీటర్ల ముందు
ఈ వ్యూ పాయింట్ ను ఏర్పాటు చేశారు. ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ ఎం.సి. పర్గెయిన్ దీన్ని ప్రారంభించారు. అటవీ, కృష్ణా అందాలు ఒకేసారి చూసేలా వ్యూహాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ పాయింట్… మరింత మంది పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులను ఆకర్శిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సందర్శకులు సేదతీరేందుకు వీలుగా బెంచీలు, గుడిసె, పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పర్యాటకులకు మరింత ఆహ్లాదాన్ని అందించడం కోసం ఒక వాచ్ టవర్ , ఫారెస్ట్ ట్రయల్ అభివృద్ధి చేస్తున్నట్లు పర్గెయన్ తెలిపారు. వ్యూ పాయింట్ సందర్శనకు వచ్చే పర్యాటకులు పరిశుభ్రత, అటవీ ప్రాంత ప్రశాంతతను కాపాడాలని అటవీశాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు. అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ కవర్లు, వస్తువులు వాడటం, విసిరేయటం చేయొద్దని సూచించారు.