తెలంగాణ ఉద్య‌మంలో జ‌ర్న‌లిస్టుల పాత్ర మ‌ర‌వ‌లేనిది: డిప్యూటీ సీఎం మ‌హ‌మూద్ అలీ

తెలంగాణ ఉద్య‌మంలో జ‌ర్న‌లిస్టుల పాత్ర మ‌ర‌వ‌లేనిది: డిప్యూటీ సీఎం మ‌హ‌మూద్ అలీ

కోట్లాది మంది ప్ర‌జ‌ల తెలంగాణ ప్ర‌త్యేక‌ రాష్ట్ర ఆకాంక్ష‌ను నెర‌వేర్చే దిశ‌లో జ‌రిగిన మ‌హోత్త‌ర‌మైన పోరాటంలో జ‌ర్న‌లిస్టుల పాత్ర‌ను తెలంగాణ స‌మాజం మ‌ర్చిపోదు… లాఠీలు, తూటాల‌ను కూడా లెక్క‌చేయ‌కుండా ప్రాణాల‌ను సైతం ప‌ణంగా పెట్టి విరోచితంగా పోరాడిన సాహ‌స‌ చ‌రిత్ర తెలంగాణ జ‌ర్న‌లిస్టుల‌కు ఉంద‌ని రాష్ట్ర  ఉప ముఖ్య‌మంత్రి మ‌హ‌మూద్ అలీ కొనియాడారు. బ‌షీర్ బాగ్ లోని దేశోద్ధార‌క భ‌వ‌న్ లో బుధ‌వారం నాడు హైద‌రాబాద్ యూనియ‌న్ ఆఫ్ జ‌ర్న‌లిస్ట్స్ (హెచ్ యూ జే ) రూపొందించిన  మీడియా డైరీని ఆయ‌న ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన స‌మావేశంలో మ‌హ‌మూద్ అలీ మాట్లాడుతూ, నేటి స‌మాజంలో వెట్టిచాకిరి జాబితాలో జ‌ర్న‌లిస్టులు ఉంటార‌ని అన్నారు. అన్ని వృత్తుల‌కు ఇన్ని గంట‌లు ప‌నిచేయాల‌న్న నియ‌మ‌నిబంధ‌న‌లు ఉండ‌గా, జ‌ర్నలిస్టుల‌కు మాత్రం అలాంటిదేమీ లేద‌న్నారు. విధి నిర్వ‌హ‌ణ‌లో 24 గంట‌లు శ్ర‌మించాల్సిన ప‌రిస్థితి జ‌ర్న‌లిస్టుల‌కు ఉంటుంద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వార్త‌లు సేక‌రించాల‌న్న త‌ప‌న‌తో వివిధ సంఘ‌ట‌న‌ల్లో ప‌లువురు జ‌ర్న‌లిస్టులు ప్రాణాలు కోల్సోతున్నార‌ని ఆయ‌న విచారం వ్య‌క్తం చేశారు. జ‌ర్న‌లిజానికి ఎంత గౌర‌వం ఉందో… జ‌ర్న‌లిస్టుల జీవితాల‌ వెన‌క అంతే  విషాదం దాగి ఉంద‌న్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ నేతృత్వంలో త‌మ ప్రభుత్వం జ‌ర్న‌లిస్టుల సంక్షేమం కోసం ఎన‌లేని కృషిచేస్తుంద‌న్నారు. ఇందులో భాగంగానే గూడు, విద్య‌, వైద్యం, త‌దిత‌ర క‌నీస అవ‌స‌రాల‌ను జ‌ర్న‌లిస్టుల‌కు అందించేందుకు త‌మ ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధితో ఉంద‌న్నారు. ముఖ్యంగా హైద‌రాబాద్ న‌గ‌రంలో ప‌నిచేస్తున్న స్థానిక రిపోర్ట‌ర్ల సంక్షేమం కోసం ఒక రాజ‌కీయనేత‌గా కాకుండా ఒక కుటుంబ‌స‌భ్యుడిగా ఎల్ల‌వేళ‌లా చేయూతనిస్తాన‌ని మ‌హ‌మూద్ అలీ చెప్పారు. ప్ర‌ధానంగా ఉద్యోగ భ‌ద్ర‌త క‌ర‌వై జీత‌భ‌త్యాలు లేకుండా ప‌నిచేస్తున్న స్థానిక విలేక‌రులు ప‌డే క‌ష్టాలపై త‌న‌కు స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న ఉంద‌న్నారు. ఇందుకు గాను హైద‌రాబాద్ న‌గ‌రంలో ప్ర‌భుత్వం నిర్మించనున్న డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపులో నిరుపేధ‌లు, వికలాంగులకు ఇచ్చే మాదిరి ప్రాధాన్య‌త‌ను జ‌ర్న‌లిస్టులకు కూడా ఇచ్చేందుకు ముఖ్య‌మంత్రి దృష్టి తీసుకెళ్లేందుకు కృషిచేస్తాన‌ని ఆయ‌న హామీ ఇచ్చారు. మూత్రపిండాల వ్యాధితో బాధ‌ప‌డుతూ ఆర్థికంగా ఇబ్బందులు అనుభ‌విస్తున్న‌ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ఖైస‌ర్ కు ప్ర‌భుత్వ ప‌రంగా, వ్య‌క్తిగ‌తంగా సంపూర్ణ సాయం అందిస్తామ‌ని డిప్యూటీ సీఎం మ‌హ‌మూద్ అలీ చెప్పారు.  టీయూడ‌బ్ల్యూజే స‌ల‌హాదారు కె.శ్రీ‌నివాస్ రెడ్డి మాట్లాడుతూ జ‌ర్న‌లిస్టుల‌కే కాకుండా అధికారుల‌కు, ప్ర‌జాప్ర‌తినిధుల‌కు, మీడియా సంస్థ‌ల‌కు ఉప‌యోగప‌డే స‌మ‌గ్ర స‌మాచారంతో డైరీని రూపొందించిన హెచ్ యూ జేను అభినందించారు. టీయూడ‌బ్ల్యూజే రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె.విరాహ‌త్ అలీ మాట్లాడుతూ, దుర్భ‌ర జీవితాల‌ను అనుభ‌విస్తూ వృత్తిలో కొన‌సాగుతున్న లోక‌ల్ రిపోర్ట‌ర్ల సంక్షేమంపై ప్ర‌భుత్వం ప్ర‌త్యేక దృష్టి సారించాల‌ని కోరారు. హెచ్ యూ జే అధ్య‌క్షుడు రియాజ్ అహ్మ‌ద్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఈ స‌మావేశంలో కార్య‌ద‌ర్శి శంక‌ర్ గౌడ్ స్వాగ‌తోప‌న్యాసం చేయ‌గా, ఐజేయూ నాయ‌కులు వై.న‌రేంద‌ర్ రెడ్డి, ఎంఏ మాజిద్, కె.అమ‌ర్నాథ్, స‌త్య‌నారాయ‌ణ‌, హెచ్ యూ జే సీనియ‌ర్ నాయ‌కులు కిర‌ణ్ కుమార్, కోటిరెడ్డి, యాద‌గిరి, నూగూరి రాంచంద‌ర్, ఎల‌క్ట్రానిక్ మీడియా విభాగం అధ్య‌క్ష కార్య‌ద‌ర్శులు పాక బాల‌కృష్ణ‌, ఎన్.మ‌ధు, ఆన్ లైన్ మీడియా అధ్య‌క్షులు ఐలు ర‌మేశ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

tuwj     tuwj 1     tuwj 2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *