తెలంగాణ‌కు వెంట‌నే ఎయిమ్స్‌ ఇవ్వాల‌ని ఢిల్లీలో మంత్రి జెపి న‌డ్డాను కోరిన వైద్య మంత్రి ల‌క్ష్మారెడ్డి- కేంద్ర ఆర్థిక మంత్రి జెట్లీ

తెలంగాణ‌కు వెంట‌నే ఎయిమ్స్‌ ఇవ్వాల‌ని ఢిల్లీలో మంత్రి జెపి న‌డ్డాను కోరిన వైద్య మంత్రి ల‌క్ష్మారెడ్డి- కేంద్ర ఆర్థిక మంత్రి జెట్లీ

తెలంగాణ‌కు ఎయిమ్స్‌, బ‌డ్జెట్‌లో కెసిఆర్ కిట్ల‌కు, పిఎంఎంవైపికి మ‌రిన్ని నిధులు ఇవ్వాలి మెడిక‌ల్ కాలేజీల‌కు స‌త్వ‌ర అనుమ‌తులు, అద‌నంగా మ‌రిన్ని సీట్లు దేశంలోనే మొద‌టి ప్ర‌భుత్వ ఫ‌ర్టిలిటీ కేంద్రానికి త‌గిన నిధులు రెండో ఎఎన్ఎంలకు క‌నీస‌ వేత‌నాలు

ఆశా వ‌ర్క‌ర్ల‌కు ప్రోత్సాహ‌కాలు

చ‌ట్టాల ప‌టిష్టానికి ప్ర‌తిపాద‌న‌లు

క‌ల్తీ నివార‌ణ‌కు మ‌రిన్ని వాహ‌నాలు

ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి జెట్లీ, వైద్య మంత్రి జెపి న‌డ్డాను క‌లిసి కోరిన తెలంగాణ వైద్య మంత్రి ల‌క్ష్మారెడ్డి

ఢిల్లీ/హైద‌రాబాద్: తెలంగాణ‌కు వెంట‌నే ఎయిమ్స్‌ నివ్వాల‌ని, బ‌డ్జెట్‌లో ఎయిమ్స్ స‌హా, కెసిఆర్ కిట్ల‌కు, పిఎంఎంవైపికి మ‌రిన్ని నిధులు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జెట్లీ, కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ‌, కుటుంబ సంక్షేమ‌శాఖ మంత్రి జ‌గ‌త్ ప్ర‌కాశ్ న‌డ్డాల‌ను ఢిల్లీలో క‌లిసి కోరారు తెలంగాణ వైద్య ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి. శుక్ర‌వారం పార్ల‌మెంట్ హౌజ్‌లో ప్ర‌త్యేకంగా ఆ ఇద్ద‌రు కేంద్ర మంత్రుల‌ను లోక‌స‌భ‌లో టిఆర్ఎస్ పార్టీ పార్ల‌మెంట‌రీ నేత జితేంద‌ర్‌రెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌తినిధి డాక్ట‌ర్ వేణుగోపాల చారి, ఎంపీలు న‌గేశ్‌, సీతారాంనాయ‌క్‌, కొండా విశ్వేశ్వ‌రరెడ్డి త‌దిత‌రులతో వేర్వేరుగా క‌లిశారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ల‌క్ష్మారెడ్డి ముందుగా అరుణ్ జెట్లీని క‌లిశారు. విభ‌జ‌నకు ముందు నుంచీ తెలంగాణ‌, ఎపీల‌కు ఎయిమ్స్‌ ని ఇస్తామ‌ని చెప్పార‌ని, అయితే తెలంగాణ‌కు ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ నిధుల కేటాయింపు జ‌ర‌గ‌లేద‌న్నారు. అధికారికంగా ఎలాంటి ఆదేశాలు రాలేద‌న్నారు. తెలంగాణ రాష్ట్రం, ప్ర‌త్యేకించి హైద‌రాబాద్ హెల్త్ హ‌బ్‌గా మారింద‌ని, ఇలాంటి త‌రుణంలో ఎయిమ్స్ వ‌స్తే మ‌రింత బాగుంటుంద‌ని మంత్రి చెప్పారు. అలాగే బీబీ న‌గ‌ర్ నిమ్స్ స‌మీపంలోనే ఎయిమ్స్ కోసం స్థ‌లం ఇవ్వ‌డానికి కూడా సిద్ధం చేశామ‌ని వివ‌రించారు. అవ‌స‌ర‌మైన మౌలిక స‌దుపాయాలు క‌ల్పించ‌డానికి తెలంగాణ ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌న్నారు. సీఎం కెసిఆర్ ఆదేశాల మేర‌కు తాను ప్ర‌త్యేకంగా జెట్లీని క‌ల‌వ‌డానికి వ‌చ్చిన‌ట్లు మంత్రి అన్నారు. వెంట‌నే బ‌డ్జెట్‌లో తెలంగాణ‌కు ఎయిమ్స్ ప్ర‌క‌టించాల‌ని, ప్రాసెస్ ప్రారంభించాల‌ని విన్న‌వించారు. అలాగే తెలంగాణ లో రాష్ట్ర పథ‌కాల‌తోపాటు కేంద్ర ప‌థ‌కాల‌ను కూడా విజ‌య‌వంతంగా అమ‌లు చేస్తున్నామ‌ని, అనేక అవార్డులు కేంద్రంఇవ్వ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌న‌మంటూ, త‌ద‌నుగుణంగా నిధులు కూడా బ‌డ్జెట్‌లో కేటాయింపులు జ‌రిగే విధంగా చూడాల‌ని కేంద్ర మంత్రి జెట్లీకి మంత్రి ల‌క్ష్మారెడ్డి వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు ఓ విన‌తి ప‌త్రం స‌మ‌ర్పించారు.

త‌ద‌నంత‌రం ఢిల్లీలోని పార్ల‌మెంట్ హౌజ్‌లో కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ‌శాఖ మంత్రి జ‌గ‌త్ ప్ర‌కాశ్ న‌డ్డాని తెలంగాణ వైద్య ఆరోగ్య కుటంబ సంక్షేమ‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు ఓ విన‌తి ప‌త్రం స‌మ‌ర్పించారు. రాష్ట్రంలో కొత్త‌గా మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో విజ‌య‌వంతంగా మెడిక‌ల్ కాలేజీని న‌డిపిస్తున్నామ‌న్నారు. అలాగే సిద్దిపేట‌లో మెడిక‌ల్ కాలేజీకి ఏర్పాట్లు సిద్ధ‌మ‌య్యాయ‌ని చెప్పారు. కొత్త‌గా సూర్యాపేట‌, న‌ల్ల‌గొండ‌ల్లోనూ మెడిక‌ల్ కాలేజీలు పెట్టాల‌ని తెలంగాణ సీఎం కెసిఆర్ నిర్ణ‌యించార‌ని, వాటికి అవ‌స‌ర‌మైన అనుమ‌తులు త్వ‌ర‌గా అందేలా చూడాల‌ని చెప్పారు. అలాగే ప్ర‌స్తుతం న‌డుస్తున్న, కొత్త కాలేజీల‌కు అద‌నంగా మ‌రిన్ని సీట్లు ఇవ్వాల‌న్నారు. దేశంలోనే మొద‌టి సారిగా ప్ర‌భుత్వ రంగంలో ఫ‌ర్టిలిటీ కేంద్రాన్ని గాంధీ ద‌వాఖానాలో ప్రారంభించామ‌ని, దానికి త‌గిన నిధులు ఇవ్వాల‌ని కోరారు.

ఇక మొద‌టి ఎఎన్ఎంల‌కు స‌మానంగా ప‌ని చేస్తున్న రెండో ఎఎన్ఎంలకు క‌నీస‌ వేత‌నాలు ఇవ్వాల‌ని, ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌భుత్వం ఆశా వ‌ర్క‌ర్ల‌కు ప్రోత్సాహ‌కాలు అందిస్తున్న‌ద‌ని, వాళ్ళ‌కు కూడా త‌గిన నిధులు ఇవ్వాల‌ని సూచించారు. ఫ‌ర్టిలిటీ, క‌ల్తీ నిరోధానికి చ‌ట్టాల ప‌టిష్టానికి ప్ర‌తిపాద‌న‌లు కొన్ని కేంద్ర మంత్రికి తెలిపారు రాష్ట్ర మంత్రి ల‌క్ష్మారెడ్డి. క‌ల్తీ నివార‌ణ‌కు తెలంగాణ‌కు ఇచ్చిన ఒక వాహ‌నాన్ని ప్రారంభించామ‌ని, జిల్లాకో వాహ‌నం అందే విధంగా చేస్తే, క‌ల్తీ నిరోధం సులువు అవుతుంద‌ని మంత్రి ల‌క్ష్మారెడ్డి చెప్పారు. క్లీనిక‌ల్ ట్ర‌య‌ల్స్‌కి జాతీయ స్థాయిలో ఒకే నిబంధ‌న‌లుండేలా చూడాల‌ని, క్లీనిక‌ల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ కింద జాతీయ స్థాయిలో దేశ వ్యాప్తంగా ఒకే రేట్లు, హాస్పిట‌ల్స్ గ్రేడింగ్స్‌, క్లీనిక‌ల్ కేర్ స్థాయిల‌ను నిర్ణ‌యిస్తే బాగుంటుంద‌ని కూడా మంత్రి చెప్పారు.

కెసిఆర్ కిట్ల ప‌థ‌కానికి కేంద్ర స్థాయిలో అమ‌లు అవుతున్న ప్ర‌ధాన మంత్రి మాతృత్వ యోజ‌న ప‌థ‌కం కింద నిధులు అందిస్తే ఆ ప‌థ‌కాన్ని మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లు చేయ‌డానికి వీల‌వుతుంద‌ని మంత్రి ల‌క్ష్మారెడ్డి కేంద్ర మంత్రి న‌డ్డాకు ప్ర‌తిపాదించారు. అలాగే వెల్ నెస్ సెంట‌ర్ల‌కు ఆయుష్ సేవ‌లు కూడా అందే విధంగా కేంద్రం చొర‌వ తీసుకోవాల‌ని మంత్రి కోరారు. ఈమ‌ధ్యే హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలోని ప్ర‌జ‌ల‌కు స‌ర్కార్ వైద్య సేవ‌లు అందుబాటులోకి తేవ‌డానికి చేప‌ట్టిన బ‌స్తీ ద‌వాఖానాల‌కు వెన్నుద‌న్నుగా నిల‌వాల‌ని,  నిజామాబాద్‌, క‌రీంన‌గ‌ర్ ల‌కు పిఎం స్వాస్త్య స‌మృద్ధి యోజ‌న ప‌థ‌కం కింద మ‌రింత సాయం అందించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఈ మ‌ధ్యే న‌వ‌జాత శిశు సంర‌క్ష‌ణ‌లో దేశంలోనే తెలంగాణ‌కు ఉత్త‌మ అవార్డు ద‌క్క‌డాన్ని గుర్తు చేస్తూ, కొత్తగా మ‌రికొన్ని న‌వ‌జాత శిశు, ఐసియు, డ‌యాల‌సిస్, క్యాన్స‌ర్‌, వ్యాధి నిర్ధార‌ణ కేంద్రాలకు అవ‌స‌ర‌మైన నిధుల విష‌యం ప‌రిశీలించాల‌న్నారు. వైద్య మంత్రి ల‌క్ష్మారెడ్డి కోరిన ఆయా అంశాల‌కు కేంద్ర మంత్రులిద్ద‌రూ సానుకూలంగా స్పందించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *