తెలంగాణలో వాల్ మార్ట్ పెట్టుబడులు

ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో హోల్సేల్, రిటేల్ వ్యాపారం చేసే వాల్ మార్ట్ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు తరలివచ్చింది.. సచివాలయంలో బుధవారం వాల్మార్ట్ ఇంటర్నేషనల్ సిఇఒ డేవిడ్ చీస్ రైట్, ఇండియా శాఖ సిఇఒ క్రిష్ అయ్యర్, వైస్ ప్రెసిడెంట్ రజనీష్ కుమార్ తదితరులు ముఖ్యమంత్రితో సమావేశం అయ్యారు. హైదరాబాద్లో నాలుగైదు శాఖలు, తెలంగాణలోని ఇతర జిల్లాల్లో కూడా శాఖలు ప్రారంభించాలనే ఆలోచన తమకు ఉందని వాల్మార్ట్ ప్రతినిధులు చెప్పారు.

ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వాల్మార్ట్ లాంటి సంస్థలు తెలంగాణలో తమ మాల్స్ ను పెంచడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి చేస్తున్న ప్రయత్నాలు బాగున్నాయన్నారు. అయితే ఇలాంటి సంస్థలు స్థానిక ఉత్పత్తులను పెంచే విషయంలో, స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో ఎక్కువ శ్రద్ద చూపాలని చెప్పారు. హైదరాబాద్ చుట్టు ప్రక్కల ఉన్న రైతులు మేలైన కూరగాయలు, పండ్లు, పసుపు, అల్లం, కరివేపాకు తదితర అంతర్జాతీయ డిమాండ్ ఉన్న పంటలు పండిస్తున్నారని చెప్పారు. వీటిని ఎక్కువగా మార్కెటింగ్ చేయడానికి ప్రయత్నించాలని అన్నారు. దీనివల్ల మాల్స్ నిర్వహకులకు కూడా మేలు జరుగుతుందని, స్థానిక వ్యవసాయ దారులకు కూడా లాభం ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు.

ఐకియా, లూలు లాంటి సంస్థలు కూడా తమ వ్యాపారాన్ని తెలంగాణలో విస్తరించడానికి ముందుకు వచ్చాయని చెప్పారు. 478 బిలియన్ డాలర్ల టర్నోవర్ కలిగిన తమ కంపెనీ 95 శాతం వరకు స్థానిక ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడానికే ప్రయత్నిస్తుందని వాల్మార్ట్ ప్రతినిధులు చెప్పారు. ఈ కామర్స్ విధానం కూడా ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. తమ సంస్థకు కావలిసిన అనుమతులు, లైసెన్స్లు ఇచ్చే విషయంలో తెలంగాణ ప్రభుత్వం వేగంగా స్పందిస్తుందనే హామీ పట్ల హర్షం వ్యక్తం చేశారు.

తెలంగాణలో అన్ని షాపులు, మాల్స్ 365 రోజులు పనిచేసే విధంగా విధానపర మార్పులు తెస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇందులో పనిచేసే ఉద్యోగులకు వారానికి ఒక రోజు ఖచ్చితంగా సెలవు ఇవ్వాలనే నిబంధన కూడా విధిస్తామని చెప్పారు. ఆదివారాలు కూడా షాపులు తెరవడం వల్ల 20 శాతం ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని ముఖ్యమంత్రి అన్నారు.
ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, టిఎస్ఐఐసి ఎండి జయేశ్ రంజన్, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావ్ తదితరుల పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *