తెలంగాణలో తొలి వినాయక క్షేత్రం… రేజింతల్

తెలంగాణ రాష్ట్రంలోని తొలి ‘సిద్ధివినాయక’ ఆలయంగా ప్రసిద్ధికెక్కిన ఈ క్షేత్రం జహీరాబాద్ బీదర్ ప్రధాన రహదారికి పక్కన ఉన్న ‘రేజింతల్’ గ్రామంలో ఉంది. ఈ స్వామిని దర్శించుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రల నుంచి ఎందరో భక్తులు వస్తూంటారు. గర్భాలయంలో ఉండే ఈ స్వామి దక్షిణాభిముఖుడై దర్శనమిస్తాడు. ఈ సిద్ధివినాయకుని రూసం చిన్న కొండలాంటి రాతిమీద అస్పష్టంగా ఉంటుంది. ఈ స్వామికి  సిందూరవర్ణం పులమడంవల్ల చూడగానే ముందు మనకు ఆంజనేయస్వామి గుర్తుకు వస్తాడు. దాదాపు 208 సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఈ ఆలయంలోను సిద్ధివినాయకునికి పైన ఉండే ఛత్రం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. వెనుకన సువర్ణ మకరతోరణం, దిగువన రజిత మకరతోరణంతో పాటు సూక్ష్మగణపతి విగ్రహం కూడా ఉంటుంది. స్థల విశేషాలు ఒకప్పుడు దట్టమైన కీకారణ్యంగా ఉండే ఈ ప్రాంతానికి ‘శివరాం పంతులు’ అనే యాత్రికుడు కాలినడకన అనేక క్షేత్రాలు దర్శిస్తూ, ఈ రేజింతల్ ప్రాంతానికి రాగానే ఎంతో మానసిక ప్రశాంతత కలిగిందట. అందుకే ఆయన చాలాకాలం అక్కడ తపోదీక్షలో ఉన్నాడు. ఆ సమయంలో  సిద్ధివినాయకుడు ఆయనకు తన ఉనికిని తెలియజేసి, పూజాదికాలు నిర్వహించమని ఆదేశించాడు. శివరాం పంతులు ఆ ప్రాంతం అంతా అన్వేషించి స్వయంభువుడుగా వెలసిన సిద్ధివినాయకుని’ ప్రతిమను దర్శించి  బాహ్య  ప్రపంచానికి తెలియజేసాడు. అప్పటి నుంచీ రేజింతల్ ‘సిద్ధివినాయకుడు’ మహావైభవంతో కళకళలాడుతూ భక్తకోటిని అనుగ్రహిస్తూనే ఉన్నాడు. ఈ సిద్ధివినాయకుడు ఏటేటా పెరుగుతూంటాడని భక్తుల నమ్మకం. ముందు రెండున్నర అడుగుల ఎత్తు, మూడడుగుల  వెడల్పు ఉన్న స్వామివారి విగ్రహం ఇప్పుడు ఐదున్నర అడుగుల ఎత్తూ, ఆరడుగుల వెడల్పు అయ్యిందని భక్తులు అంటారు. సకల విఘ్నాలను తొలగించి, భక్తకోటికి సర్వశుభాలు చేకూర్చే స్వామిగా ఈ సిద్ధివినాయకునికి ఎంతో పేరున్న కారణంగా  శ్రీ కంచి కామకోటి   పీఠం ఆధ్వర్యంలో ఈ క్షేత్రంలో సంకట చతుర్థి వేడుకల్ని ఎంతో ఘనంగా నిర్వహస్తారు. సంకటహర చతుర్దశి, మంగళవారం కలిసి వస్తే ఇంకా విశేషంగా వేడుకలు జరుగుతాయి. పుష్య శుద్ధ పాడ్యమి నుంచి… పుష్య శుద్ధ చతుర్దశి వరకూ శ్రీ సిద్ధివినాయక స్వామివారి జన్మదినోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ వేడుకలు సహస్ర మోదకాలతో 451 గణేశ హవనాలూ, శతచండీ హవనం, సపాద లక్ష గణేశ గాయత్రీ హవనాలతో నిర్వహిస్తారు. ఏడాదికి ఒకటి లేదా రెండుసార్లు ఆది మంగళ వారాలలో వచ్చే అంగారక చతుర్థి పర్వదినం భక్తులకు ఎంతో పవిత్రమైనది. ఆ రోజు వేల సంఖ్యలో భక్తులు పాదయాత్రగా తరలివచ్చి శ్రీ స్వామివారిని  దర్శిచుకోవడం ఈ క్షేత్రం ప్రత్యేకత.ఏ శుభకార్యం తలపెట్టినా ఎందరో భక్తులు తొలిపూజ చెయ్యడానికి ఈ స్వామి దగ్గరకు రావడం ఈ క్షేత్రం గొప్పతనం. అందుకే ఈ సిందూరవర్ణ గణపతి భక్తజన పూజీయుడూ, ప్రేమపాత్రుడు అయ్యాడు. –

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.