
1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలుగు భాష తప్పనిసరి సబ్జెక్టు
తెలంగాణలో చదివే ప్రతి విద్యార్థికి తెలుగు సబ్జెక్టు చదువుకునేలా చర్యలు
తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా అన్ని విద్యాసంస్థల్లో అమలు చేయడం కోసం చట్టంలో మార్పులు
చట్టంలో మార్పులకు ప్రతిపాదనలు సూచించడానికి కమిటీ ఏర్పాటు
తెలుగు ప్రపంచ మహాసభల్లో తెలుగు భాష తప్పనిసరి సబ్జెక్టుపై సిఎం కేసిఆర్ విధానపర ప్రకటన చేసే విధంగా పాలసీ రూపకల్పన
వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా తెలంగాణ విద్యాలయాల్లో అమలు
అన్ని మీడియంలలో తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా అమలు ..అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే వారు కూడా తెలుగు భాష సబ్జెక్టు చదువుకునేలా చర్యలు
‘‘తెలుగు భాష తప్పనిసరి సబ్జెక్టు’’ అంశంపై సమావేశంలో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి
హైదరాబాద్, అక్టోబర్ 27 : తెలుగు భాషను ఒకటో తరగతి నుంచి 12వ తరగతి(ఇంటర్మీడియట్) వరకు తప్పనిసరి సబ్జెక్టుగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలో అమలు చేసే కార్యచరణ ప్రణాళిక రూపొందించడంపై ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో సచివాలయంలో నేడు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, రాష్ట్ర సాంస్కృతిక, మీడియా సలహాదారు రమణాచారి, అధికార భాషా సంఘం చైర్మన్ దేవులపల్లి ప్రభాకర్ రావు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి, సిఎం స్పెషల్ ఆఫీసర్ దేశపతి శ్రీనివాస్, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, పాఠశాల సంచాలకులు కిషన్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీ వీసీ సత్యానారాయణ, ఎస్.సి.ఈ.ఆర్.టి డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి, ఇతర విద్యాశాఖ అధికారులు హాజరయ్యారు.
తెలంగాణలో చదివే విద్యార్థులు 1వ తరగతి నుంచి 12వ తరగతిలోపు కచ్చితంగా తెలుగు భాషను ఒక సబ్జెక్టుగా చదవాలని సిఎం కేసిఆర్ ఇటీవల నిర్ణయించిన నేపథ్యంలో, 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలుగు భాష అమలు ప్రస్తుతం ఎలా ఉంది, సిఎం ఆదేశాల మేరకు దీనిని అమలు చేయడంపై కార్యాచరణ ఏవిధంగా సిద్ధం చేయాలనే దానిపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.
డిసెంబర్ 15వ తేదీ నుంచి తెలుగు ప్రపంచ మహాసభలు ఉన్న నేపథ్యంలో… ఆలోపు తెలుగు అధికార భాషగా 1 నుంచి 12వ తరగతి వరకు ప్రతి ఒక్కరు దీనిని ఒక సబ్జెక్టుగా చదివేలా ఒక విధానాన్ని రూపొందించాలని, ఈ విధానాన్ని ప్రపంచ సభల్లో సిఎం కేసిఆర్ ప్రకటించే విధంగా తయారు చేయాలని సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. ఈ విధాన రూపకల్పన కోసం తెలుగు అకాడమీ వీసి సత్యనారాయణ, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి, సిఎం స్పెషల్ ఆఫీసర్ దేశపతి శ్రీనివాస్, ఎస్.సి.ఈ.ఆర్.టి డైరెక్టర్ సత్యానారాయణ రెడ్డి, విద్యాశాఖ అధికారి వినాయక్ లతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నవంబర్ 15వ తేదీలోపు తెలుగు భాషను కచ్చితమైన సబ్జెక్టుగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అమలయ్యేలా విధానాన్ని రూపొందించి, చట్టంలో కావల్సిన మార్పులు చేసేందుకు ప్రతిపాదనలు సూచించాలన్నారు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలుగు భాష కచ్చితమైన సబ్జెక్టుగా అందరూ చదివేందుకు వీలుగా చట్టంలో తగిన మార్పులు చేసి జూన్ 2019 నుంచి అమలు చేస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. స్టేట్ సిలబస్, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఇంగ్లీష్ మీడియం, ఇతర భాషల మీడియాల్లో తెలంగాణలో చదివే విద్యార్థులందరికీ తెలుగు భాష సబ్జెక్టుగా చదివే విధంగా చట్టంలో మార్పులు చేసేందుకు ఈ కమిటీ పాలసీ రూపొందించాలన్నారు. తెలంగాణలో చదివే విద్యార్థులందరికీ తెలుగు రావాలన్న సిఎం కేసిఆర్ ఆకాంక్ష మేరకు తెలుగు భాషను కచ్చితమైన సబ్జెక్టుగా బోధించే విధంగా పాలసీ రూపకల్పన ఉండాలన్నారు. తెలుగును సులభంగా నేర్చుకునేలా పుస్తకాలు ముద్రించాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకునే వారు కూడా సులభంగా తెలుగు నేర్చుకునే విధంగా ఈ పుస్తకాలుండాలన్నారు.