
హైదరాబాద్: తెలంగాణలో ఉపాధ్యాయ ఎన్నికల రాజకీయం ఊపందుకుంది. తెలంగాణ సర్కారు భాషా పండిట్ పోస్టులు, పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్ చేయటం, మహిళా టీచర్లకు 3 నెలల చైల్డ్ కేర్ లీవ్ మంజూరుకు ఇటీవల కేబినెట్‌లో ఆమోద ముద్ర వేయటం.. ఉపాధ్యాయ ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కేందుకు కారణమైంది. దీర్ఘకాలం పెండింగ్‌లో ఉన్న వాటిలో రెండు ప్రధాన సమస్యల పరిష్కారానికి సర్కారు ముందడుగు వేయటంతో.. ఆ ఘనత తమదేనంటూ ఉపాధ్యాయ సంఘాలు వేటికవి ప్రచారం చేసుకుంటున్నాయి. ఒకడుగు ముందుకేసి పీఆర్‌టీయూటీఎస్ సంఘ ఎమ్మెల్సీలు, ప్రస్తుత టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు కె.జనార్దనరెడ్డి, పూల రవీందర్ ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. పాత హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 2017 మార్చి 29తో ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దనరెడ్డి పదవీ కాలం పూర్తి కానుండటంతో ఎన్నికల కమిషన్ ఫిబ్రవరిలో నోటిఫికేషన జారీ చేయనుంది. అందుకు ఎన్నికల సంఘం ఉపాధ్యాయ ఓటర్ల నమోదుకు నవంబర్ 5 వరకు అవకాశం కల్పించింది. దాంతో ఉపాధ్యాయ సంఘాలు ఓటర్ల నమోదులో తలమునకలయ్యాయి.
అయితే ఇప్పటికే చాలా సంఘాలు తమ సంఘ అభ్యర్థులకు మాండేట్ ఇచ్చి రంగంలోకి దింపాయి. పీఆర్‌టీయూటీఎస్ ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్సీ జనార్దనరెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించింది. 2011లో పాతూరి సుధాకర్‌రెడ్డిపై విజయం సాధించిన జనార్దనరెడ్డితో పాటు మరో పీఆర్‌టీయూ ఎమ్మెల్సీ పూల రవీందర్ టీఆర్‌ఎ్‌సలో చేరారు. అయితే ప్రస్తుతం పీఆర్టీటీయూ అఽభ్యర్థిగా ప్రకటించిన జనార్దనరెడ్డికే టీఆర్‌ఎస్ మద్దతు ప్రకటిస్తుందా, ఇతర అభ్యర్థిని రంగంలోకి దింపుతుందా? అనే అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. కాగా ఉద్యమ సమయంలో పాతూరి సుఽధాకర్‌రెడ్డి, హర్షవర్థనరెడ్డి పీఆర్‌టీయూ నుంచి బయటకు వచ్చి టీ.పీఆర్‌టీయూను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత క్రమంలో టీఆర్‌ఎ్‌సకు అనుబంధంగా ఉన్న టీటీయూ, టీ పీఆర్‌టీయూల్లో ఏ ఒక్క సంఘాన్నీ అనుబంధంగా ప్రకటించలేదు. ప్రస్తుతం టీ పీఆర్‌టీయూ అభ్యర్థిగా హర్షవర్థనరెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు. దాంతో టీఆర్‌ఎస్ ఎవరికి మద్దతు ఇస్తుందనే అంశంపై చర్చ జరుగుతోంది. కాగా యూటీఎ్‌ఫటీఎస్ ఇప్పటికే పి.మాణిక్‌రెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించి ఎనరోల్‌మెంట్‌లో బిజీగా ఉంది.
2011 ఎన్నికల్లో వీరు పాతూరి సుధాకర్‌రెడ్డికి మద్దతు పలికారు. ఉమ్మడి యూటీఎఫ్ నుంచి విడిపోయిన టీయూటీఎఫ్ కూడా ప్రభాకర్‌రెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించింది. మరోవైపు బీజేపీ అనుబంధ ఉపాధ్యాయ సంఘం టిపస్.. తమ అభ్యర్థిగా భూపతిరెడ్డిని ప్రకటించింది. 2011 ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన జనార్దనరెడ్డికి 6238 ఓట్లు రాగా, ఆపస్ నుంచి బరిలో నిలిచిన శ్రీవర్థనరెడ్డి 3037 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. అయితే ఈ సారి టిపస్ ప్రకటించిన అభ్యర్థిపై ఆ సంఘంలో కీలక స్థానాల్లో పని చేస్తున్న వారే అతని అభ్యర్థిత్యంపై పెదవి విరుస్తున్నారు. మరో ప్రధాన సంఘం ఎస్టీయూ.. ఈ నెల 26న కొన్ని తెలంగాణ ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలను కలుపుకొని ఉమ్మడి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏవీఎన రెడ్డిని ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసింది. ఆయన పదహారేళ్ల పాటు జూనియర్ లెక్చరర్‌గా పనిచేసి వీఆర్‌ఎస్ తీసుకున్నారు. 2015లో మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ టికెట్ ఆశించారు. కానీ ఆ పార్టీ దేవీప్రసాద్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించటంతో ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఈ సారి తెలంగాణ ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలను కలుపుకొని ఎన్నికల బరిలో నిలిచేందుకు రంగం సిద్ధమైంది.
ఏ సంఘం నుంచి ఎవరు?
పీఆర్‌టీయూటీఎస్ కే.జనార్దన్‌రెడ్డి
టీ పీఆర్‌టీయూ హర్షవర్ధన్‌రెడ్డి
యూటీఎ్‌ఫటీఎస్ పి.మాణిక్‌రెడ్డి
టీయూటీఎఫ్ ప్రభాకర్‌రెడ్డి
టిపస్ భూపతిరెడ్డి
ఎస్టీయూ ఏవీఎన్ రెడ్డి