తెలంగాణకు మణిహారంగా హరితహారం: మంత్రి జూపల్లి కృష్ణారావు

 

* తెలంగాణకు మణిహారంగా హరితహారం కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

* తెలంగాణలో 24 శాతం ఉన్న పచ్చదనాన్ని 33 శాతానికి తీసుకుపోయేందుకు హరితహారం కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా శ్రీకారం చుట్టారు

* ఈ ఏడాది 42 కోట్ల మొక్కలను నాటే లక్ష్యంతో ఈ నెల 12న హరితహారానికి శ్రీకారం చుడుతున్నం. ఇప్పటికే దీనికి సంబంధించి 2925 నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉన్నాయి.

* గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా గత ఏడాది 9 కోట్ల మొక్కలు నాటగా, ఈసారి 12 కోట్ల మొక్కలను నాటే లక్ష్యంతో ముందుకుపోతున్నాం.

* గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 776 నర్సరీలు ఏర్పాటు చేశాం. వీటిల్లో 7 కోట్ల 52 లక్షల మొక్కలను సిద్ధంగా ఉంచాం.

* ఈ ఏడాది ఉపాధిహామీ పనులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. 3 నెలల్లోనే 1106 కోట్ల వేతన వ్యయంతో ఉపాధిపనులు చేపట్టడం ద్వారా దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటికే 8.32 కోట్ల పనిదినాలు కూడా వినియోగించుకోలిగాం.

* లక్ష్యానికి అణుగుణంగా పనిచేసిన వారికి గుర్తింపుతోపాటు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు

* ఉపాధిహామీ, హరితహారం విజయవంతం కోసం ప్రత్యేక గ్రామసభలు, మండల, జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలు ఏర్పాటుచేసుకోవాలి. 

హైదరాబాద్:  తెలంగాణకు మణిహారంగా హరితహారం కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని..  దీనిని విజయవంతం చేసేందుకు అందరూ భాగస్వాములు కావాలని పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. ఉపాధిహామీ, హరితహారంపై సచివాలయంనుండి కలెక్టర్లు, డీఆర్డీఓలు, డీపీఓలతో శుక్రవారం మంత్రి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్ తో కలిసి మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణలో 24 శాతం ఉన్న పచ్చదనాన్ని 33 శాతానికి తీసుకుపోయేందుకు హరితహారం కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా శ్రీకారం చుట్టారన్నారు. మూడేళ్లలో 230 కోట్ల మొక్కలను హరితహారంలో భాగంగా నాటేందుకు చర్యలు తీసుకుంటున్నామని.. ఇందులో 120 కోట్ల మొక్కలను నాన్ ఫారెస్ట్ ఏరియాలోనూ, 100 కోట్ల మొక్కలను అడవుల్లోనూ, మరో 10 కోట్ల మొక్కలను హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ పరిధిలో నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రతి గ్రామంలో 40 వేల మొక్కలను, ప్రతి నియోజకవర్గంలో 40 లక్షల మొక్కలను మూడేళ్లతో నాటే దిశగా ప్రణాళికబద్దంగా ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు.

ఈ ఏడాది 42 కోట్ల మొక్కలను నాటే లక్ష్యంతో ఈ నెల 12న హరితహారానికి కరీంనగర్ లో సీఎం కేసీఆర్ శ్రీకారం చుడుతున్నారన్నారు. ఇందుకోసం 2925 నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉంచామన్నారు.  గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోనే 776 నర్సరీల్లో 7 కోట్ల 52 లక్షల మొక్కలను సిద్ధంగా ఉంచినట్లు మంత్రి వెల్లడించారు. గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా గత ఏడాది 9 కోట్ల మొక్కలు నాటగా, ఈసారి 12 కోట్ల మొక్కలను నాటే లక్ష్యంతో ముందుకుపోతున్నట్లు మంత్రి తెలిపారు. మొక్కల సంరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, మొక్క నాటేందుకు గుంత తవ్వడం దగ్గరనుండి నీళ్లు పోసి కాపాడే వరకు ప్రత్యేక మొత్తాన్ని కూడా చెల్లిస్తున్నామన్నారు. గుంతలు తీసేందుకు 30 సెంటిమీటర్లకు రూ.7.., 45 సెంటిమీటర్లకు రూ.15…, 60 సెంటి మీటర్లకు రూ. 44.50 ఇస్తున్నామన్నారు. మొక్క నాటేందుకు రూ. 7, పెన్సింగ్ కోసం రూ. 139 చొప్పున చెల్లిస్తున్నామని తెలిపారు. మొక్కల సంరక్షణ కోసం ప్రత్యేకంగా ఒక్కో మొక్కకు రోజుకు 5 చొప్పున చెల్లిస్తున్నామని,  అవెన్యూ ప్లాంటేషన్ లో అయితే 400 మొక్కలకు 500 రూపాయలు ఇస్తున్నామన్నారు. వచ్చే సంవత్సరం కోసం ప్రతి గ్రామంలోను వీఓఏల ద్వారా నర్సరీలు ఏర్పాటు చేసేందుకు కార్యచరణ సిద్ధం చేశామన్నారు. 5 కోట్ల ఈత మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 50 లక్షల మొక్కలను నాటామన్నారు. ఈ ఏడాదే 2.5 కోట్ల మొక్కలను నాటనున్నట్లు తెలిపారు.

వార్డు సభ్యుడు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ లు, ఎమ్మెల్యేలు, మహిళసంఘాలు, యువజన సంఘాలు, ఉద్యోగులు, ఉపాద్యాయులు, విద్యార్థులు, రైతు సంఘాలతో పాటు జర్నలిస్ట్ లు కూడా ఉద్యమంలా చేపడుతున్న హరితహారంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. హరితహారం విజయవంతం చేసే బాధ్యతను క్షేత్ర స్థాయిలో సర్పంచ్ లు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్ లు, వీఓఏ లు తీసుకోవాలన్నారు.

ఉపాధిహామీలో ఆదర్శంగా నిలుద్దాం:

తెలంగాణలో ఈ ఏడాది ఉపాధిహామీ పనులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని… 3 నెలల్లోనే 1106 కోట్ల వేతన వ్యయంతో ఉపాధిపనులు చేపట్టడం ద్వారా దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందన్నారు. జాబ్ కార్డు కలిగి ఉన్న కూలీల్లో కనీసం 60 శాతం మందికి 100 రోజుల పనిదినాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకుపోతున్నామన్నారు. ఫాం పాండ్స్, ఇంకుడుగుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, మండల కేంద్రాల్లో పబ్లిక్ టాయిలెట్స్, బస్ స్టాప్స్ ను కూడా పెద్ద ఎత్తున చేపడుతున్నామన్నారు. గత సంవత్సరం దాదాపు 9 వందల కోట్లతో గ్రామ, గ్రామాన సీసీ రోడ్లు నిర్మించామని, ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతామన్నారు. ఈ సంవత్సరం కొత్తగా 1315 గ్రామపంచాయతీ భవనాలు, 5 లక్షల ఇంకుడు గుంతలు, 60 వేల కంపోస్ట్ పిట్స్, 5 లక్షల ఫాం పాండ్స్ నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. అలాగే 2359 వైకుంఠధామాలు, 3063 స్కూల్ టాయిలెట్స్, 7274 కిచెన్ షెడ్స్ కూడా ఈ ఏడాది నిర్మించనున్నామని తెలిపారు. లక్ష్యానికి అణుగుణంగా పనిచేసే ఉద్యోగులకు గుర్తింపుతోపాటు, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులందరూ ఎవరికి వారు కింది స్థాయి సిబ్బందితో పనిచేయించాలని ఆదేశించారు. ఉపాధిహామీ, హరితహారం విజయవంతం కోసం ప్రత్యేక గ్రామసభలు, మండల, జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలు ఏర్పాటుచేసుకోని ముందుకుపోవాలన్నారు.

 

 

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *