
హైదరాబాద్ , ప్రతినిధి : ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి మృతి పట్ల పలువురు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రముఖులు అపోలో ఆసుపత్రికి తరలివచ్చారు. ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మీడియాతో మాట్లాడారు.
తెలంగాణకు తీరని లోటు – అల్లం నారాయణ..
సంగీత దర్శకుడు చక్రి మృతి చెందడం తెలంగాణకు తీరని లోటని తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు. ‘జై బోలో తెలంగాణ’ చిత్రంకు మంచి మ్యూజిక్ ఇచ్చారని గుర్తు చేశారు. వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ లోని ఒక చిన్న గ్రామం నుండి వచ్చి ఎంతో ఎత్తుకు ఎదిగారని పేర్కొన్నారు. చక్రిని గుర్తు పెట్టుకొనే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో సినీ రంగాన్ని అభివృద్ధి చేస్తున్న తరుణంలో చక్రి మృతి చెందడం బాధాకరమని ఆయన మృతికి ప్రెస్ అకాడమీ తరపున నివాళులర్పిస్తున్నామని అల్లం నారాయణ పేర్కొన్నారు.
అల్లం నారాయణతో పాటు మరికొంతమంది సినీ రంగ ప్రముఖులు మీడియాతో మాట్లాడారు. చక్రి ఎంతో స్నేహభావంతో మెలిగే వారని, అతని పుట్టిన రోజున సేవా కార్యక్రమాలు చేసేవారని తెలిపారు.