విజయవాడ, ప్రతినిధి: తుంగభద్ర ఆధునీకరణ వల్ల ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో తుంగభద్ర జలాలపై చంద్రబాబు చర్చించారని తెలిపారు. ఆ భేటీలో కర్ణాటక ప్రభుత్వం తుంగభద్ర హైలెవల్, లోలెవల్ కాల్వలను ఆధునీకరిస్తామని తెలిపారని అన్నారు. తాము కూడా తుంగభద్ర బోర్డుకు ఈవిషయంలో సహకరిస్తూ క్లియరెన్స్ ఇస్తున్నట్లు తెలిపారు. దీంతో పనులు వేగవంతమవుతాయని పేర్కొన్నారు. దీంతో రాయలసీమ కరువు తొలగించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు.
నేడు జన్మభూమి కార్యక్రమం ఆఖరి రోజని, ప్రజలు ఈ రోజు కూడా ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లను ఆదరిస్తున్నారని తెలిపారు. జన్మభూమి కార్యక్రమంలో స్థానిక సమస్యలపై వినతి పత్రాలు వస్తున్నాయన్నారు. వీటిని ఆన్ లైన్ లో పెట్టి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పంచాయితీ వరకు అందుబాటులో ఉంచుతామన్నారు. దీని ద్వారా పనులు వేగవంతం అవుతాయన్నారు.