
ఢిల్లీ , ప్రతినిధి : తాలీబాన్ అగ్రనేత ఫజులుల్లా పాకిస్తాన్ వైమానిక దాడిలో మృత్యువాత పడినట్టు సమాచారం. పాకిస్తాన్ మీడియా దీన్ని ద్రువీకరిస్తూ కథనాలు ప్రసారం చేశాయి. పెషావర్ లోని సైనిక స్కూల్ పై దాడి చేసి సుమారు 150 మంది అమాయక చిన్నారులను పొట్టన పెట్టుకున్న ఘటనలో ప్రధాన సూత్రధారి తెహ్రీక్-ఏ-తాలిబాన్ అధినేత ఫజులుల్లా. శనివారం తెల్లవారుజామున కైబర్ లో ఉన్న తాలిబాన్ స్థావరాలపై పాక్ సైన్యం జరిపిన దాడిలో ఆయన మరణించినట్టు పాకిస్తాన్ మీడియా పేర్కొంది. కాగా ఈ విషయమై పాక్ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.
సైనిక పాఠశాలపై దాడి 150మంది చిన్నారుల మృతితో పాక్ ప్రధాని భీషన ప్రతిజ్ఞ చేశారు. ఉగ్రవాదాన్ని అరికడతానంటూ హూంకరించారు. సైన్యాన్ని ఆప్ఘనిస్తాన్ బార్డర్ కు పంపించి తాలిబాద్ ఏరివేతకు శ్రీకారం చుట్టారు. పాక్ సైన్యం, వైమానిక దళం సహాయంతో తాలీబాన్ స్థావరాలపై దాడులకు దిగుతోంది. ఈ దాడుల్లోనే ఫజులుల్లా హతమయ్యారని తెలుస్తోంది.