
హైదరాబాద్ , ప్రతినిధి : బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్న టీఎస్.ప్రభుత్వం…దూకుడుగా తీసుకునే నిర్ణయాలు జనాలను తికమకపెడుతున్నాయి. సమగ్ర సర్వే తర్వాత రకరకాల సర్వే పేర్లతో ప్రజలను ఉరుకులు పరుగులు తీయించింది. ప్రజావ్యతిరేకతను ఎదుర్కొవడం…తిరిగి పునఃసమీక్షించుకోవడం పరిపాటిగా మారింది. ఈసారి సీఎం రిలీఫ్ ఫండ్‌కు తెల్లరేషన్ కార్డు లింకు పెట్టడం… పేదవాడికి ఆ పథకం దూరమవుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవున్నాయి.
సీఎం రిలీఫ్ ఫండ్ విడుదల చేయడం లేదని విమర్శలు
సీఎం కేసీఆర్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఫండ్ విడుదల చేయడం లేదని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. కొంత సీలింగ్ పెట్టి ఎంతో కొంత సహాయ నిధి నుంచి సహాయం అందించాలని నిర్ణయించుకుంది. కానీ దీనికి అర్హత పొందాలంటే తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డు ఉండాల్సిందేనని నిబంధన పెట్టింది. అంతేకాదు ఎవరో ఒకరు ప్రజా ప్రతినిధి సిపారసు లేఖ తప్పనిసరి అని పేర్కొంది. అయితే అసలు సమస్య ఇక్కడే మొదలవుతోంది. తెలంగాణలో రేషన్ కార్డులు తొలగించి… వాటి స్థానంలో ఆహార భద్రత కార్డులు జారీ చేయనుంది. దీంతో ఈ కార్డులు రేషన్ సరుకులు తీసుకోవడానికి తప్పా మరే ఏ పథకానికి ఉపయోగపడవు.
పాత కార్డులు రద్దుకు సిద్ధమైన ప్రభుత్వం
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం పాత కార్డులు రద్దు చేస్తామని చెబుతున్నారు. దీంతో కొత్తగా తెల్లకార్డులు రావని తెలుస్తోంది. అంటే ఉన్న కార్డులు పోయి.. కొత్తవి రాక.. పేదోడికి పెద్దజబ్బొస్తే పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరి తెలంగాణ సర్కార్ పొరపాటును సరిదిద్దుకుంటుందో లేక దూకుడుగా ముందుకెళ్తుందో చూడాలి.