
హైదరాబాద్, ప్రతినిధి : నాటి ఇందిర నుంచి నేటి సోనియా వరకూ.. కాంగ్రెస్‌లో కాకలు తీరిన రాజకీయ దురంధరుడు కన్నుమూశారు! తెలుగు రాష్ట్రాల్లో దళితుల రాజకీయ రంగ ప్రవేశానికి బాటలు పరచిన రెండో తరం అంబేద్కర్ గా పేరుగాంచిన పెద్దపల్లి మాజీ ఎంపీ, కాంగ్రెస్ నాయకులు వెంకటస్వామి ఇక లేరు! ‘తెలంగాణ వచ్చిన తర్వాతే మరణిస్తాను’ అంటూ పలు సందర్భాల్లో చెప్పిన ‘కాకా’ వెంకటస్వామి (85) తన స్వప్నం సాకారం అయిన తర్వాతే తనువు చాలించారు.
కాంగ్రెస్‌లో తొలి తరం నేత, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సమకాలికుడు గడ్డం వెంకటస్వామి మరణించారు. బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వెంకటస్వామి సోమవారం రాత్రి 8.45 గంటల సమయంలో మృతి చెందినట్లు వైద్య వర్గాలు తెలిపాయి. ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వెంకటస్వామి భార్య కళావతి 2006లోనే మరణించారు. వెంకటస్వామి గత ఐదు నెలలుగా అస్వస్థతతో బాధ పడుతున్నారు. ఈ ఏడాది జూలై 30న ఆయనను కేర్ ఆస్పత్రిలో చే ర్పించి అప్పటి నుంచీ చికిత్సలు అందిస్తున్నారు. అప్పుడప్పుడు ఇంటికి వెళ్లి వస్తున్నా ఎక్కువ కాలం ఆస్పత్రిలోనే గడిపారు. సోమవారం ఉదయం ఆరోగ్యం విషమించడం, బీపీలో హెచ్చుతగ్గులు ఏర్పడడంతో ఆయనను వెంటిలేటర్‌పై ఉంచారు. వెంకటస్వామి గుండె, కిడ్నీ, లంగ్స్ తదితర మల్టిఫుల్ ఆర్గాన్స్ సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. చివరకు పరిస్థితి విషమించి నిన్న కన్నుమూశారు.మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు పంజాగుట్ట శ్మశాన వాటికలో అధికార లాంఛనాలతో కాకా అంత్యక్రియలు జరుగుతాయి.
కాకా వెంకటస్వామి ప్రస్థానం..
హైదరాబాద్ నుంచి కోల్‌బెల్ట్‌కు..
కాకా అన్న నారాయణస్వామి.. రామగుండం జెన్‌కో కాంట్రాక్టర్‌గా పని చేసేవారు. ఆయన పనులను చూసుకునేందుకు 1952లో రామగుండం వచ్చిన వెంకటస్వామి.. తర్వాత ఇక్కడి వాడిగానే గుర్తింపు పొందారు. ఆయన రాజకీయమూ పెద్దపెల్లి పార్లమెంటు స్థానం చుట్టే తిరిగింది. సిద్ధిపేట నుంచి మూడు సార్లు, పెద్దపల్లి నుంచి నాలుగుసార్లు ఎంపీగా పార్లమెంటులో అడుగుపెట్టారు. ఓడిపోయిన రెండు దఫాలూ ఆడవారి చేతిలోనే కావడం యాదృచ్ఛికమే అయినా, అదో శకునంగా భావించేవారు. 1960 దశకం చివరలో మెదక్ జిల్లా గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన కాకా.. ఈశ్వరీభాయిపై ఓడిపోవడం, 1998, 1999 ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంటు స్థానం నుంచి సుగుణకుమారిపై ఓటమి పాలవడం ఆయన రాజకీయ జీవితంలో చిన్న మరకలుగా ఫీలయ్యేవారు.
సత్యాగ్రహం నుంచి..
-1946లో సత్యగ్రహ ఉద్యమంలో పాల్గొ న్నారు
-2004ఎన్నికలలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌కు పొత్తు కుదర్చడంలో కీలక పాత్ర
-2009లో రాష్ట్రపతి పదవి కోసం ప్రయత్నించారు
-రాజకీయ వేదిక ఆసరాగా పారిశ్రామిక వేత్తగా ఎదిగారు
-విశాఖ ఆస్‌బెస్టాస్ కంపెనీని ఏర్పాటు చేశారు
-విశాఖ సిమెంట్ పరిశ్రమ ప్రారంభించే ప్రయత్నం చేశారు
-హైదరాబాద్ చిక్కడపల్లి ప్రాంతంలో 72వేల మంది స్థలాలు ఆపి గుడిసెలు వేయించడంతో గుడిసెల వెంకటస్వామిగా పేరు పొందారు.