
తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబరాలకు ఢిల్లీలోని తెలంగాణ భవన్ అందంగా ముస్తాబైంది. తెలంగాణ రాష్ట్రానికే సొంతమైన పూల పండుగ విశిష్ఠత, బతుకమ్మ పండుగ ఔనత్యాన్ని తెలిపేలా దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తోంది. ఢిల్లీలోని తెలుగు ప్రాంత ప్రజలను బతుకమ్మ సంబరాల్లో మమేకం చేయడంతో పాటు, దేశ నలుమూలల బతుకమ్మ ప్రాశిస్యాన్ని తెలిపేలా తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే బతుకమ్మ ఉత్సవాలకు ఏ మాత్రం తీసిపోకుండా, ఢిల్లీ తెలంగాణ భవన్ లో సైతం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఇప్పటికే తెలంగాణ భవన్ ను రంగు రంగుల విద్యుత్ కాంతులతో ముస్తాబు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోన్న బతుకమ్మ సంబరాల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డా. వేణుగోపాల చారి పిలుపు నిచ్చారు. శనివారం సాయంత్రం 5 గంటలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంస్కృతి, సాంప్రదాయలను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డా.వేణు గోపాల చారి ఆయన చేతుల మీదుగా ప్రారంభిస్తారు. అనంతరం బతుకమ్మ సంబరాలు ప్రారంభం కానున్న తెలంగాణ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమీషనర్ అరవింద్ కుమార్ తెలిపారు. మొదట తెలంగాణ కే సొంతమైన జానపద కళలు, సంస్కృతి, సాంప్రదాయాలను చాటేలా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శన, అనంతరం బతుకమ్మ ఉత్సవాలను ప్రారంభించనున్నట్లు ప్రిన్సిపల్ రెసిడెంట్ కమీషనర్ వెల్లడించారు. ఇక బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనే వారికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వంటకాల రుచి చూపించనుందని, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికే సొంతమైన పచ్చిపులుసు, ఉల్లికారం, జొన్న రొట్టే, హైదరాబాద్ ధమ్ బిర్యాని, ఇరానీ చాయ్ లను బతుకమ్మ సంబరాల్లోపాల్గొనే వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమీషనర్ అరవింద్ కుమార్ తెలిపారు.
ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఘనంగా జరగనున్న తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ ప్రముఖులు, పలు దేశాల ప్రతినిధులను ఆహ్వానించింది. లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్ర మహిళ మంత్రులు సుష్మా స్వరాజ్, స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్, పలు దేశాల రాయబారులు, ప్రతినిధులు బతుకమ్మ సంబరాల్లో పాల్గొననున్నారు.