
ఢిల్లీ, ప్రతినిధి : ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీని దెబ్బకొట్టేందుకు కిరణ్ బేడీని రంగంలోకి దించిన బీజేపీ ఢిల్లీ పీఠంపై కన్నేసింది. ఈ విషయాన్ని ముందే గమనించిన కేజ్రీవాల్ ఇన్నాళ్లు కాంగ్రెస్, బీజేపీ అధినాయకులపై విమర్శలు గుప్పించారు. కానీ ఇక తన పార్టీల్లోంచి బీజేపీలో చేరి మేకులా మారిన కిరణ్ బేడీని టార్గెట్ చేసి ఢిల్లీ ఎన్నికల్లో ప్రచార వ్యూహాన్ని మార్చారు.
కిరణ్ బేడీ లక్ష్యంగా ఆమెకు సవాల్ విసిరారు. ఢిల్లీ నగరం ఎదుర్కొంటున్న సమస్యలపై బహిరంగ చర్చకు రావాలంటూ అరవింద్ కేజ్రీవాల్ కిరణ్ బేడికి సవాల్ చేశారు. కానీ చర్చ బయట కాదు.. అసెంబ్లీలో అంటూ కిరణ్ బేడి సైడ్ అయిపోయారు. బీజేపీ వ్యూహాలను చిత్తు చేసేందుకు ఇక కేజ్రీ అనుకున్న ఏ అవకాశాన్ని వదలడం లేదు. ఈ సారి ఢిల్లీ ఎన్నికల్లో పోటీ ఆప్, బీజేపీల మధ్య ఉండనుంది. బీజేపీకి అధికారం దక్కడం కనిపిస్తున్నా.. క్షేత్రస్థాయిలో వినూత్నమైన ప్రచార వ్యూహంతో కేజ్రీవాల్ దూసుకెళ్తూ ప్రత్యర్థి బీజేపీకి చెమటలు పట్టిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో నన్న ఉత్కంఠ ప్రస్తుతానికి ఉంది.