డీఆర్డీఓలు, కేంద్ర బృందంతో మంత్రి జూప‌ల్లి కృష్ణారావు స‌మీక్ష‌

డీఆర్డీఓలు, కేంద్ర బృందంతో మంత్రి జూప‌ల్లి కృష్ణారావు స‌మీక్ష‌

తెలంగాణాలో ఉపాధి అమ‌లు బాగుంది

రాష్ట్రంలో ప‌ర్య‌టించిన కేంద్రం బృందం ప్ర‌శంస‌

హైద‌రాబాద్‌-రాష్ట్రంలో ఉపాధి హామీ అమ‌లు ప్ర‌శంస‌నీయంగా ఉంద‌ని,హ‌రిత‌హారం, వైకుంఠ‌దామాల నిర్మాణాల్లో ఇత‌ర రాష్ట్రాల‌కు ఆద‌ర్శంగా తెలంగాణా నిలుస్తుంద‌ని కేంద్ర అధికారుల బృందం ప్ర‌శంసించింది. వికారాబాద్‌, సిద్దిపేట‌, కామారెడ్డి జిల్లాల్లో జ‌రుగుతున్న ఉపాధి ప‌నుల‌ను బుధ‌, గురువారాల్లో ప‌రిశీలించిన కేంద్ర బృందం… క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న ప‌నుల‌పై సంతృప్తి వ్య‌క్తం చేసింది. టీ సిపార్డులో డీఆర్డీఓలు, కేంద్ర బృందం స‌భ్యుల‌తో ఉపాధి హామీ ప‌థ‌కం అమ‌లుపై శుక్ర‌వారం పంచాయ‌తీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు స‌మీక్ష‌ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో ఉపాధి హామీని పెద్ద ఎత్తున అమ‌లు చేస్తున్నామ‌ని… ఉపాధి కోరిన ప్ర‌తి కూలీకి ప‌ని క‌ల్పిస్తున్నామ‌ని మంత్రి జూప‌ల్లి కృష్ణారావు తెలిపారు. ఉపాధి నిధుల‌తో పాటు, రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా డ‌బ్బును వెచ్చిస్తూ హ‌రిత‌హారం కార్య‌క్ర‌మాన్ని గ‌త మూడేళ్లుగా విజ‌య‌వంతంగా ముందుకు తీసుకుపోతుంద‌న్నారు. ఇందుకోసం ప్ర‌తి గ్రామంలోనూ మ‌హిళా సంఘాల ఆధ్వ‌ర్యంలో న‌ర్స‌రీల ఏర్పాటుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌న్నారు. గ్రామాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించ‌డంతో పాటు…అంద‌రినీ అభివృద్ధిలో భాగ‌స్వామ్యం చేసే ల‌క్ష్యంతో కొత్త‌గా పంచాయ‌తీరాజ్ చ‌ట్టానికి

రూప‌క‌ల్పన చేస్తున్నామ‌న్నారు.

ఉపాధి హామీ కేంద్ర ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శి అప‌రాజిత సారంగి మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లాలోని మూడు మండ‌లాలతో పాటు వికారాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లోనూ రెండు రోజుల పాటు తొమ్మిది మంది స‌భ్యుల కేంద్ర బృందం ఉపాధి హామీ ప‌నుల‌ను ప‌రిశీలించ‌డం జ‌రిగింద‌న్నారు. ప్ర‌ధానంగా వైకుంఠ‌దామాలు, క్యాటిల్ షెడ్‌ల నిర్మాణంలో రాష్ట్రం ప‌నితీరు ఆద‌ర్శంగా ఉంద‌ని ప్ర‌శంసించారు.  హ‌రిత‌హారం ద్వారా మొక్క‌లు నాట‌డంతో పాటు…వాటి సంర‌క్ష‌ణ‌కోసం కూడా ప్ర‌త్యేకంగా నిధులు కేటాయిస్తూ చ‌ర్య‌లు తీసుకోవ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. అలాగే ఉపాధి ప‌నులు జ‌రుగుతున్న ప్రాంతాల్లో వ‌ర్క్ బోర్డుల ఏర్పాటు, జాబ్ కార్డుల న‌మోదు లాంటి నిర్వ‌హ‌ణ ప‌ట్ల సంతృప్తి వ్య‌క్తం చేశారు. రానున్న రోజుల్లో ఉపాధి హామీని మ‌రింత పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోవాల‌ని కోరారు. స‌మావేశంలో పంచాయ‌తీరాజ్ మ‌రియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి వికాస్‌రాజ్‌, డీఆర్డీఓలు పాల్గొన్నారు.  మంత్రిని క‌లిసిన రాష్ట్ర ఫైనాన్స్ క‌మిష‌న్ చైర్మ‌న్‌ మంత్రి జూప‌ల్లి కృష్ణారావును రాష్ట్ర ఫైనాన్స్ క‌మిష‌న్ చైర్మ‌న్ రాజేశం గౌడ్‌, స‌భ్యుడు చెన్న‌య్య‌లు స‌చివాల‌యంలో క‌లిశారు. ఈ నెల 11న ర‌వీంద్ర‌భార‌తిలో జ‌రుగ‌నున్న ఫైనాన్స్ క‌మిష‌న్ ప‌రిచ‌య, స‌న్మాన కార్య‌క్ర‌మానికి మంత్రిని ఆహ్వానించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *