టీవీ చానాళ్లు.. వాటి చరిత్ర

ఆరు బయట మంచాలేసుకుని కబుర్లు చెప్పుకునే కాలం పోయింది. స్నేహితులను కలవడానికి, బంధువులతో మాట్లాడటానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు ఈ కాలం మనుషులు. ఏ కాస్త సమయందొరికినా టీవీల ముందు అతుక్కు పోవడం అలవాటుగా మారింది. లేకపోతే సెల్ ఫోన్లో తాజా సమాచారం తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు నేటి తరం.
1959 సెప్టెంబర్ కు ముందు టెలివిజన్ ప్రసారాలు లేవు. ఢిల్లీ కేంద్రం ద్వారా ప్రసారాల కోసం దూరదర్శన్ ప్రారంభమైంది. అప్పటికి 14 ఏళ్ళ తర్వాత 1973లో ముంబైలో రెండో కేంద్రాన్ని మొదలు పెట్టింది . ప్రజల అవసరాల రీత్యా తర్వాత శ్రీనగర్, అమృతసర్, పూణె, కోల్ కత్తా, చెన్నై, లక్నో నగరాలకు దూరదర్శన్ ప్రసారాలు విస్తరించాయి.
తెలుగు వారి కోసం ప్రత్యేకంగా చిత్రల హరి కార్యక్రమం ప్రసారం చేసేది మొదట్లో దూరదర్శన్. ప్రతి శుక్రవారం వచ్చే ఆ అరగంట కార్యక్రమం కోసం ఆసక్తిగా ఎదురుచూసే వారు జనం. ఇటు ప్రసారం, అటు ఆదాయం పెరుగుతూ వచ్చాయి.
1990లో ప్రసార భారతి చట్టానికి పార్లమెంటు ఆమోదం తెలిపింది. అప్పటి నుంచి మీడియా రంగంలోకి ప్రవేటు చానల్స్ తొంగి చూశాయి.
భారత రాజ్యంగంలోని ఆర్టికల్ 19 (1) ఎ వ్యక్తిగత వాక్ స్వాతంత్ర్యం, పత్రికా స్వేచ్ఛను ప్రసాదించింది. శాసన నిర్మాణం, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయశాఖలు ప్రజా స్వామ్యానికి పట్టుగొమ్మలు. వాటి పని తీరు పై నిఘా పెట్టే పాత్ర మీడియాది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే పటిష్టమైన మీడియా వ్యవస్థ అవసరమని రాజ్యంగ నిపుణుల అభిప్రాయం. అందుకే మీడియాను నాలుగో స్తంభంగా అభివర్ణించారు మేధావులు. ఇప్పుడా వ్యవస్థ పనితీరే వివాదాల మయమైంది.
భారత మీడియా వ్యవస్థ రాజకీయ రంగు పులుముకుంటోంది. ఏదో ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తోంది. ఎటువైపు మొగ్గు చూపని సంస్థలను వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. సామాజిక చైతన్యం, ప్రజా సమస్యల ప్రస్తావనకు ఇప్పుడు చోటు తక్కువే. సంచలన వార్తలకు ప్రాధాన్యత పెరిగింది. అటు సొంత మీడియా సంస్థల కోసం రాజకీయ పార్టీలు ఆరాటపడపడుతున్నాయి. పెరిగిన వ్యాపార ధోరణి విలువలకు తిలోదకాలిస్తున్నాయి. పార్టీల ప్రచార వేదికలుగా మీడియా రంగం మారింది. ఎవరికి వారే రోజు మీడియా ముందుకు వచ్చి మరీ తమ అభిప్రాయాలను వెల్లడించడం మాములైంది. ఎవరిరి గోల వారిదే. వార్తా సంస్థల నిర్వహణలో రాజకీయ జోక్యం పెరుగుతోంది. ఈ విపరీత ధోరణి ఎటువైపు దారి తీస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
తొలి తెలుగు శాటిలైట్ చానల్ జెమినిటీవీ. 1994లో జెమినీ మొదలైన కొద్ది రోజులకే ఈటీవీ ప్రారంభమైంది. జెమినీ సింగపూర్ నుండి, ఈటీవీ కొలంబో నుంచి ప్రసారాలు గాలిలోకి పంపేవి. చైన్నె, హైదరాబాద్ కేంద్రాలుగా కార్యక్రమాలను నిర్వహించి తమ క్యాసెట్లను విమానాల ద్వారా విదేశాలకు పంపాల్సి వచ్చేది. వార్తలను ప్రత్యక్ష ప్రసారం చేయడం 1996లో ప్రారంభమైంది. తెలుగులో ఈటీవీ వార్తలు మొదటగా ప్రత్యక్ష ప్రసారమయ్యాయి. అసెంబ్లీలో జరిగే చర్చలను తేజ టీవీ ప్రత్యక్ష ప్రసారం చేయడం ఆసక్తిని పెంచింది. నేతలు చట్ట సభల్లో ఏం మాట్లాడుతున్నారో ప్రజలు ప్రత్యక్షంగా చూసి తెలుసుకునే అవకాశం వచ్చింది.
1995లో జీన్యూస్ ప్రారంభమైంది. అప్పటి వరకు బీబీసీ, సిఎన్ఎన్ లకే పరిమితమైన 24 గంటల వార్తల ప్రసారాలు భారత దేశమంతటా విస్తరించాయి. తర్వాత ఇండియాటుడే ప్రచురణ సంస్థ ప్రారంభించిన ఆజ్ తక్ భారత్ లోనే అతి పెద్ద హిందీ న్యూస్ చానల్ గా అవతరించింది. అదే సమయంలో రంగంలోకి వచ్చిన ఎన్డీటీవీ, ఆజ్ తక్ క్ పోటీగా మారింది. ఈ కోవలో వచ్చిన సహారా గ్రూపు సహారా రంగంలోకి తెచ్చింది.
2003 డిసెంబర్ లో ఈటీవీ-2 పేరుతో చెరుకూరి రామోజీరావు చానల్ ప్రారంభించగా, నెల తిరక్క ముందే టీవీ-9 రంగంలోకి దిగింది.. వేగం, కచ్చితత్వం మధ సమన్వయం అటుంచి పోటీలో విశ్వసనీయత ప్రశ్నార్థకమైంది అప్పటి నుంచే. తెలుగులో మూడో న్యూస్ చానల్ గా అవతరించిన తేజ న్యూస్ టీవీ పరిణామ క్రమంలో జెమినీ న్యూస్ గా మారింది.
మీడియా స్వేచ్ఛ పూర్తిగా నైతిక నిబద్దత, సేవా దక్పదంగా సాగాలి. మీడియా రంగంలోకి వ్యాపార సంస్థలు ప్రవేశించాక మేలు కంటే కీడు పాళ్లే ఎక్కువని జర్నలిజం పితామహుడు జోసెఫ్ పులిత్జర్ ముందే హెచ్చరించారు. ఆయన చెప్పినట్లై మీడియాలో పెడధోరణులు పెరుగుతున్నాయి. రాజకీయ పార్టీల కన్ను మీడియా పై పడింది. ఫలితంగా పుట్టగొడుగుల్లా న్యూస్ చానల్స్ పెరుగుతున్నాయి. మరో వంద న్యూస్ చానల్స్ కేంద్ర ప్రసారాల శాఖ వద్ద అనుమతి కోసం నిరీక్షిస్తున్నాయి. వీటిలో రాజకీయ పక్షాలవే 40 వరకు ఉన్నాయంటేనే ఎంతగా టీవీల మీద ఎంతగా ఆధారపడుతున్నాయో తెలుస్తోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *