టీయుడబ్ల్యుజెతో నా బంధం30యేళ్లది.. -మహబూబ్ నగర్ సభలో మంత్రి శ్రీనివాస్ గౌడ్

జర్నలిస్టుల హక్కుల కోసం ఉమ్మడి రాష్ట్రంలో పోరాడిన వర్కింగ్ జర్నలిస్టుల సంఘంతో… రాష్ట్ర విభజన నేపథ్యంలో దాని నుండి విడిపోయిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘంతో, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ తో తన బంధం ఇవ్వాళ్టిది కాదని, 30 యేళ్లదని రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక, క్రీడలు, సాంస్కృతిక శాఖల మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.

సోమవారం నాడు జిల్లా కేంద్రమైన మహబూబ్ నగర్ లో జరిగిన టీయుడబ్ల్యుజె(ఐజేయూ) జిల్లా మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ఉద్యోగ సంఘ నాయకుడిగా, తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుడిగా టీయుడబ్ల్యుజె, ఐజేయూ నాయకులు తనకు అందించిన ప్రోత్సాహాన్ని మరచిపోలేనన్నారు. జర్నలిస్టులు సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఈ సంఘానికి తన సహకారం ఎల్లవేళలా ఉంటుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హామీ ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సలహాలు,సూచనలతో తమ ప్రభుత్వం చిత్తశుద్ధి, అంకితాభావంతో కృషి చేస్తుందన్నారు. జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు, కోట్లాది రూపాయల సంక్షేమనిధి, వైద్యసేవలు తదితర సంక్షేమ కార్యక్రమాల్లో తమ రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. జిల్లా కేంద్రమైన మహబూబ్ నగర్ లో వందకు పైగా జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూం ఇళ్లను మంజూరీ చేశామని, వాటి నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. ఎంతో పవిత్రమైన జర్నలిజం వృత్తిని మలినం చేసేందుకు కొన్ని శక్తులు చేస్తున్న ఆ సాంఘిక చర్యలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.

ఈ సభకు ఆత్మీయ అతిథిగా హాజరైన టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కే. విరాహత్ అలీ మాట్లాడుతూ 65 ఏండ్ల సుదీర్ఘ చరిత్ర కలిగివున్న తమ సంఘం జర్నలిస్టుల సంక్షేమం కోసం లెక్కలేనన్ని త్యాగాలు, పోరాటాలు చేసిందన్నారు. తమ సంఘానికి ఎలాంటి రాజకీయాలు లేవని, జెండా, ఎజెండా జర్నలిస్టుల సంక్షేమం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. నాటి నుండి నేటి వరకు జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వాలను తాము అభినందిస్తామని, విస్మరిస్తే ఉద్యమిస్తామని అది తమ నైజమన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను విరాహత్ అభినందించారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు దత్తాత్రేయ అధ్యక్షతన జరిగిన ఈ సభలో జిల్లా పోలీసు సూపరిండెంట్ వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ.రాజేష్, యూనియన్ జిల్లా సీనియర్ నాయకులు వెంకటేశ్వర రావు, విజయ రాజు, సాగర్ లతో పాటు జిల్లా పరిధిలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల నుండి జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.