
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, కార్యనిర్వాహక అధ్యక్షులు గా ఇటీవల నియమితులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలు ఆదివారం కాంగ్రెస్ కార్యకర్తలు నాయకుల సమక్షంలో హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. పీసీసీ మాజీ చీఫ్ పొన్నాలతో కలిసి వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గాంధీభవన్ లో బాధ్యతలు చేపట్టారు. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన మల్లు భట్టి విక్రమార్క సైతం పదవీ బాధ్యతలు స్వీకరించారు.
కాగా ఈ కార్యక్రమానికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వివిధ జిల్లాల డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, నాయకులు .. ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ జిల్లాల నుంచి భారీగా తరలివచ్చారు. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర, హుజూర్ నగర్ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. నాయకుల హర్షధ్వానాల మధ్య ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలు బాధ్యతలు స్వీకరించారు.
అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ కు పూర్వ వైభవమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. సీనియర్లకు, నవతరానికి ప్రాధాన్యమిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తామన్నారు. త్వరలోనే మండల, జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీలు వేస్తామని హామీ ఇచ్చారు. ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న బీజేపీ, టీఆర్ఎస్ లకు వ్యతిరేకంగా పోరుబాట సలుపుతామని పేర్కొన్నారు.