టీచర్లూ.. ఆస్తుల వివరాలు వెల్లడించండి

హైదరాబాద్‌:  ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల విషయంలో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లోని టీచర్లు తమ ఆస్తుల వివరాలను వెల్లడించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు 2017 జనవరి 10వ తేదీ వరకు గడువు విధించింది. ఈ మేరకు డిసెంబరు 2వ తేదీనే జిల్లా విద్యాశాఖ అధికారులు, ఆర్జేడీలకు విద్యాశాఖ డైరెక్టర్‌ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వ టీచర్లు తమ ఆస్తులు వెల్లడించాలంటూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 1998లో జీవో (నంబరు 52)ను జారీచేసింది. అయితే దీన్ని ఎన్నడూ అమలు చేయలేదు. ఈ జీవోకు అనుగుణంగానే తెలంగాణ సర్కారు తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. కాగా నిర్ణీత గడువులోగా తమ స్థిర, చర ఆస్తుల వివరాలను ఉపాధ్యాయులు తప్పనిసరిగా వెల్లడించాలని, లేదంటే శాఖా పరంగా చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ హెచ్చరించింది. ఆస్తుల వెల్లడికి సంబంధించి మూడు పేజీలతో కూడిన నిర్దిష్టమైన ఫార్మాట్‌ను రూపొందించింది. ఫార్మాట్‌లో పొందుపరిచిన వివరాల ప్రకారం.. టీచర్లు తమ పేరిట ఉన్న ఆస్తులు సహా డిపెండెంట్స్‌ (భార్యాపిల్లలు, తల్లిదండ్రులు) తాలుకు ప్రాపర్టీ వివరాలనూ వెల్లడించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఓ ఉపాధ్యాయుడు తన పేరిట, కుటుంబ సభ్యుల పేరిట భవనాలు, ఇళ్ల స్థలాలు, వాణిజ్య స్థలాలు, వ్యవసాయ భూములు, బంగారం, వెండిని కలిగివున్నట్లయితే.. వాటి వివరాలను మార్కెట్‌ ధర ప్రకారం వెల్లడించాల్సి ఉంటుంది. ఇవే కాకుండా చేతిలో ఉన్న నగదు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, సేవింగ్స్‌, బాండ్లు, డిబెంచర్ల వివరాలు, ఐటీ రిటర్న్‌ పాన్‌ నంబరుతో సహా ఫార్మాట్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. ఈ మేరకు ఎలాంటి తప్పుడు సమాచారం ఇచ్చినా చర్య తీసుకోవచ్చు అంటూ స్వచ్ఛందంగా అంగీకరిస్తూ డిక్లరేషన్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. స్థిర, చర ఆస్తులతో కూడిన వివరాల నివేదికను ప్రైమరీ టీచర్లయితే హెడ్‌మాస్టర్లకు, హైస్కూల్‌ టీచర్లయితే ఎంఈవోలకు సమర్పించాలి. అనంతరం ఈ వివరాలన్నీ జిల్లా విద్యాధికారుల ద్వారా విద్యాశాఖకు చేరుతాయి. కాగా విద్యాశాఖ ఆదేశాలను తప్పనిసరిగా అమలు జరిగేలా చూడాలని ఇప్పటికే ఆర్జేడీలు, డీఈవోలకు పాఠశాల విద్యా డైరెక్టర్‌ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది.

*నిర్ణయం వెనుక ఉద్దేశం*?

కాగా గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యాశాఖ టీచర్ల ఆస్తులను వెల్లడించాలని సర్క్యులర్‌ జారీ చేయటంతో ఉపాధ్యాయ వర్గాల్లో కలకలం మొదలైంది. పెద్ద నోట్లను రద్దు నేపథ్యం, పన్నుల చెల్లింపులో పారదర్శకతను పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, టీచర్ల ఆస్తుల వెల్లడి నిర్ణయం వెనుక అసలు కథ వేరే ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో చాలామంది ఉద్యోగేతర కార్యక్రమాల్లో మునిగితేలుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేటుగా స్కూళ్లు, కాలేజీలను నడపడమే కాకుండా అక్కడ బోధన విధులు నిర్వహిస్తూ అసలు డ్యూటీకి ఎగనామం పెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. అలాగే ఇంకొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం, చీటీలు నడపటం వంటి వ్యాపారాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో స్కూల్‌ నడుపుతున్న ఓ ప్రభుత్వ టీచర్‌, నల్లగొండలో విద్యా సంస్థను నిర్వహిస్తున్న టీచర్‌ ఇళ్లలో ఏసీబీ దాడులు కూడా చేసింది. కాగా బోధనేతర వ్యాపకాలపై దృష్టి పెట్టకుండా, విధులు సక్రమంగా నిర్వహించే విధంగా ఉపాధ్యాయులను గాడిలో పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.

డిక్లరేషన్‌లో పొందుపరచాల్సిన ఆస్తుల వివరాలు (టీచర్లు, డిపెండెంట్స్‌ సహా)

బ్యాంకుల్లో డిపాజిట్లు, నాన్‌బ్యాంకింగ్‌ లావాదేవీలు (చీటీలు వగైరా)

వివిధ కంపెనీల్లో బాండ్లు, డిబెంచర్లు, షేర్లు

ఎన్‌ఎస్‌ఎస్‌, పోస్టల్‌ సేవింగ్స్‌, ఎల్‌ఐసీ పాలసీ తదితరాలు

వాహనాలు (టూ వీలర్‌, ఫోర్‌ వీలర్‌ తదితరాలు)

అభరణాల మొత్తం విలువ (బరువు సహా)

వ్యవసాయ భూమి వివరాలు (విస్తీర్ణం, సర్వేనంబరు సహా)

సాగేతర భూమి వివరాలు (విస్తీర్ణం, సర్వేనంబరు సహా)

నివాస, వాణిజ్య భవనాలు (విస్తీర్ణం, సర్వేనంబరు సహా)

ఇళ్లు, అపార్ట్‌మెంట్లు (విస్తీర్ణం, సర్వేనంబరు సహా)

ప్రకటించిన ఇతర ఆస్తులు, వాటిపై ఆదాయం

బ్యాంకుల లావాదేవీలు, బకాయిల వివరాలు

బ్యాంకులో లోన్లు.. ఇతర ఆర్థిక సంస్థల నుంచి లోన్లు

ప్రభుత్వశాఖలకు ఉన్న బకాయి వివరాలు(టెలిఫోన్‌, వాటర్‌, విద్యుత బిల్లులు)

ప్రభుత్వ ట్రాన్స్‌పోర్ట్‌కు సంబంధించిన బకాయిలు (విమాన, హెలికాప్టర్‌ చార్జీలు)

ఆదయపన్ను చెల్లింపు వివరాలు

(రిటర్న్స్‌ దాఖలు చేసిన నాటికి పాన్‌ నంబరుతో సహా)

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.