
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీలో పదవుల పండుగ కు కేసీఆర్ పచ్చజెండా ఊపారు. నిన్న తెలంగాణ భవన్ లో తెరాస శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఇందులో కేసీఆర్ ఈ మేరకు పార్టీ , నామినేటెడ్ పదవులు భర్తీ చేయడానికి ఓకే చెప్పారు. పార్టీ నామినేటెడ్ పదవులకు జాబితాలివ్వండి.. వివిధ సంస్థలు, ఆలయాలకు పాలకమండళ్లు కూడా ఏర్పాటు చేసుకుందామని తెలిపారు.
ఈ పదవుల పందేరానికి గాను మంత్రులు హరీష్, పోచారం, తుమ్మలతో కేసీఆర్ కమిటీ ఏర్పాటు చేశారు. వీరు ఎమ్మెల్యేలు , నాయకుల నుంచి పదవులకు నాయకులను సెలక్ట్ చేసి కేసీఆర్ కు ఇస్తారు. తద్వారా పదవులు భర్తీ చేస్తారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలే కీలకమని.. వారు సూచించిన వారికే పదవులిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. కార్పొరేషన్ చైర్మన్ పదవులను అసంతృప్తితో ఉన్న కొంత మంది సీనియర్ ఎమ్మెల్యేలకు ఇస్తామని కేసీఆర్ చెప్పారు.
కాగా వరంగల్, నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నికల్లో గెలుపు తమదే కావాలని కేసీఆర్ అన్నారు. దసరా రోజే రెండు పడకగదుల ఇళ్ల పథకానికి శంకుస్థాపన చేసి ప్రారంభిస్తానని కేసీఆర్ ప్రకటించారు.