
అధికార టీఆర్ఎస్ పార్టీకి కిందిస్థాయి ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తల వల్ల చెడ్డ పేరు దాపురిస్తోంది. ప్రభుత్వ పథకాల్లో అర్హులకు అవకాశం కల్పించకుండా తమ వారికే మేలు చేస్తుండడం ప్రభుత్వానికి మచ్చ తెస్తోంది. ఇటు వంటి సంఘటనలు పునరావృతం అవుతున్నా పట్టించుకోవడంలో అగ్రనేతలు విఫలమవుతున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇలాంటి ఘటన ఒకటి వరంగల్ లో చోటు చేసుకుంది.
వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా వరంగల్ జిల్లాలోని ఆరు మండలాల్లో ట్రాక్టర్లు గులాబీ నేతలకే దక్కాయి. పదిలక్షల విలువైన ట్రాక్టర్ ను ఐదు లక్షలకే ఇస్తారు. ఈ పథకంలో స్థానిక అధికార పార్టీ నేతలు సబ్సీడీని పండుగ చేసుకొని తమ పార్టీ నేతలకే ట్రాక్టర్లు ఇప్పించుకున్నారు. ఇది ఇప్పుడు టీఆర్ఎస్ పరువును బజారుకీడుస్తోంది.
స్థానిక నేతల అత్యుత్సాహం వల్ల ప్రభుత్వ పథకం నీరుగారిపోయింది. ఎంతో మంది అర్హులైన లబ్ధిదారులు ఈ సబ్సిడీ ట్రాక్టర్ల పథకానికి దరఖాస్తు చేసుకున్న అధికార పార్టీ నేతలు తమ వారికే ఈ ట్రాక్టర్లు ఇప్పించుకొని పథకానికి తూట్లు పొడిచారు. ఇలాంటి చర్యలే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజల్లో వ్యతిరేకత పంచుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకోకపోతే పార్టీకి మరింత నష్టం కలుగుతుంది.