టీఆర్ఎస్ పై కాంగ్రెస్ సీడీ అస్త్రం..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల్లో ఏం చెప్పారు ? ఎలాంటి హామీలిచ్చారు ? అధికారంలోకి వచ్చిన తరువాత ఏం చేస్తున్నారు ? ఇచ్చిన హామీలను మర్చిపోయారా ? ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారా ? అయితే కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన సీడీని చూడండి. అందులో కేసీఆర్ ఎలాంటి హామీలిచ్చారో..అధికారంలోకి వచ్చిన తరువాత ఏం చేస్తున్నారో తెలిసిపోతుందని పీసీసీ చీఫ్ పొన్నాల పేర్కొంటున్నారు. ఇదంతా ఇప్పుడే ఎందుకు చేశారని మదిలో ప్రశ్న మెదులుతోందా ? మెదక్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గట్టెక్కాలనే ప్రయత్నంలో కాంగ్రెస్ ఉంది. అందులో భాగంగా ఈ సీడీని ప్రచారంలో వాడుతోంది.

ప్రతిష్టాత్మకంగా మారిన మెదక్ ఉప ఎన్నిక..
కాంగ్రెస్‌కు మెదక్‌ ఉపఎన్నిక పోరు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. మెదక్‌ ఉప పోరులో ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో ప్రచారం చేస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చి 100 డేస్ పూర్తి చేసుకోవడాన్ని కాంగ్రెస్ మరో అవకాశంగా మలుచుకుంది. గులాబీ బాస్ తన వంద రోజుల పాలనలో అనుసరించిన విధానాలనే ప్రధానాస్త్రాలుగా సంధించింది కాంగ్రెస్. ఒక కేసీఆర్,..వంద అబద్దాల పేరుతో హైదరాబాద్‌ గాంధీభవన్‌లో సీడీని రిలీజ్ చేశారు పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య.

కేసీఆర్‌ విధానాలే ప్రధానాస్త్రాలుగా..
ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రజలకిచ్చిన ప్రతీ హమీని గుర్తు చేస్తూ.. అప్పడు, ఇప్పుడు కేసీఆర్ ఎలా వ్యవహరిస్తున్న దానిపై ప్రత్యేకంగా ఓ వీడియోను రూపొందించింది కాంగ్రెస్. వంద రోజుల్లో రోజుకో అబద్దం చెప్పి కేసీఆర్ పబ్బం గడుపుకున్నారని కాంగ్రెస్‌ తీవ్ర విమర్శలు చేసింది. ఎన్నికల ముందు హమీలతో ప్రజలకు స్వర్గం చూపి.. ఇప్పుడు నరకం చూపెడుతున్నారని మండిపడింది. అంతేకాదు..శిశుపాలుడు, తుగ్లక్, హిట్లర్, గోబల్స్ ని కేసీఆర్ మించి పోయారని కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌ అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తున్నారంటూ,.దానికి ఆధారంగా రూపొందించిన ఈ వీడియోను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని టీ కాంగ్రెస్‌ భావిస్తోంది.
రైతు రుణమాఫీ, దళిత సీఎం, ఫీజు రీయింబర్స్ మెంట్, రైతులు, ఉద్యోగ సమస్యలు, విద్యార్థుల కేసులపై రూపొందించిన వీడియోను,..ప్రజల్లోకి తీసుకెళ్లి,.ప్రజల సమక్షంలోనే కేసీఆర్‌ను నిలదీయాలని కాంగ్రెస్‌ వ్యూహ రచన చేస్తోంది. అయితే..ఈ వీడియోపై మెదక్ ప్రజలు ఏవిధంగా స్పందిస్తారనేది వేచిచూడాల్సిందే.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.