
పాలకుర్తి నియజకవర్గ టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు
టీఆర్ఎస్ తోనే ముదిరాజ్ ల అభివృద్ధి జరిగిందని, గత ప్రభుత్వాలు విస్మరించాయని పాలకుర్తి నియజకవర్గ టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరు గ్రామం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఎర్రబెల్లికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదిరాజ్ ల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. కేసీఆర్ ముదిరాజ్ లకు అనేక పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. బీసీ వర్గాలకు న్యాయం చేసిన మొట్ట మొదటి సీఎం కేసీఆర్ మాత్రమేనన్నారు. గొల్ల కుర్మలు, ముదిరాజ్ ల సంక్షేమం కోసం ఎంతో చేస్తున్నామని, వారి సంక్షేమం కోసం పరితపిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే నని పేర్కొన్నారు. వేలాది కుటుంబాలు చేపల పెంపకాన్ని నమ్ముకుని బతుకుతున్నాయని, దాన్ని ఓ పరిశ్రమగా విస్తరించేలా చేస్తున్నామని తెలిపారు. చేపల పెంపకంతో అనేక మంది ఉపాధి పొందేలా ఆదాయ వనరుగా మార్చిన ఘనత సీఎం కేసీఅర్ కు దక్కిందన్నారు. మత్స్యకారుల కుటుంబాలు ఆర్థిక స్వావలంబన సాధించేదిశగా కృషి చేస్తున్నామన్నారు. సాగునీటి వనరులపైనే చేపలపెంపకం ఆధారపడి ఉంటుందన్నారు. చెరువులు, కుంటలకు మిషన్ కాకతీయ ద్వారా పునరుజ్జీవం పోసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం పరితపించే వ్యక్తి సీఎం కేసీఆర్ అని కొనియాడారు. కేసీఆర్ రెండోసారి సీఎం అయితేనే ప్రాజెక్టులు పూర్తి అవుతాయన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.