
నాలుగున్నరేళ్లలో పాలకుర్తి నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధిని చూసి ప్రజలు టీఆర్ఎస్ కే జై కొడుతున్నారని తాజా మాజీ ఎమ్మెల్యే, పార్టీ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ రూరల్ రాయపర్తి మండలం మైలారం, జగన్నాథ పల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనలో సంక్షేమ ఫలాలు పొందిన ప్రజలు మరోసారి ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ ను కోరుకుంటున్నారన్నారు. నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని రాష్ట్ర్రంలోనే ఆదర్శంగా తీర్చి దిద్డుతానని తెలిపారు. పాలకుర్తిలో టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటే వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మరోసారి ఆదరించాలని, అండగా ఉంటానని అన్నారు. ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కష్టాల్లో పాలు పంచుకుంటానని హామీ ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. మిషన్ భగీరథ ద్వారా గ్రామాల్లోని చెరువులకు పూర్వ వైభవం తీసుకొచ్చారని, నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు భారీ ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలోని ప్రతీ ఎకరాకు నీరదించడమే తమ లక్ష్యమన్నారు. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలతో పేద కుటుంబాల్లోని ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్పించామన్నారు. 60 ఏళ్ల పాలనలో ప్రజలకు ఏమీ చేయని కాంగ్రెస్ ఇప్పుడు కొత్తగా ఏమి చేస్తుందో నిలదీయాలన్నారు. ఓట్ల కోసం వచ్చే మహా కూటమి నాయకులను తరమి కొట్టాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్ద పీట వేసిందని, పంట పెట్టుబడి కోసం రైతుబంధు కింద ఎకరాకు రూ.8 వేలు రెండు విడతల్లో అందజేస్తోందని తెలిపారు. అనుకోకుండా రైతులు చనిపోతే వారికుటుంబాలను ఆదుకునేందుకు రైతుబీమా ద్వారా రూ.5లక్షలు అందజేస్తున్నట్లు చెప్పారు. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు అందజేస్తున్న బతుకమ్మ చీరలను కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారన్నారు. యువతను తప్పుదోవ పట్టిస్తూ వారి స్వలాభానికి వాడుకుంటున్నారని అన్నారు. అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపించిన టీఆర్ఎస్ పార్టీకే ఈ ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారు. అంతకుముందు గ్రామాల్లో ఎర్రబెల్లి దయాకర్ రావుకు మహిళలు మంగళ హారతులు, కోలాటం, ఆటపాటలు, బతుకమ్మలు, బోనాలు, డప్పుచప్పుళ్లతో ఘనస్వాగతం పలికారు. మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ నర్సింహనాయక్, మండల పార్టీ అధ్యక్షుడు అనిమిరెడ్డి, జడ్పీటీసీ, ఎంపీపీ, రంగు కుమార్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.