
-గొల్లపల్లిలో కొప్పుల ప్రచార జోరు
-తరలి వచ్చిన టీఆర్ఎస్ శ్రేణులు
-డప్పుచప్పుళ్లు, బోనాలతో ఘన స్వాగతం
టీఆర్ఎస్ పార్టీకి అడుగడుగునా జనం నీరాజనం పడుతున్నారు. గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లి, బి.బి రాజ్ పల్లి గ్రామాల్లో కొప్పుల ఈశ్వర్ చేపట్టిన ప్రచారానికి ప్రజలు, పార్టీ శ్రేణులు తరలి వచ్చారు. బోనాలు, బతుకమ్మలు, డప్పుల చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. అనంతరం కొప్పుల ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ప్రజలు టీఆర్ఎస్ కు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. మహా కూటమి బలహీనతల నుంచి పుట్టిందని, దానికి ప్రజల మద్దతు లేదని అన్నారు. డిసెంబరు 11న ఓట్ల లెక్కింపు రోజు అన్నీ బయటపడతాయన్నారు. 38ఏళ్లు కాంగ్రెస్, 17ఏళ్లు టీడీపీ పాలనను ప్రజలు చూశారన, గతంలో ఎన్నడూ లేని అభివృద్ధి ఇప్పుడు గ్రామాల్లో కనిపిస్తోందని అన్నారు. టీఆర్ఎస్ పాలనలో స్వపక్షం, ప్రతి పక్షం అనే తేడా లేకుండా నిధులిచ్చామన్నారు. టీఆర్ఎస్ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉందని, రైతులకు 24 గంటల పాటు నాణ్యమైన కరెంట్ సరఫరా చేస్తున్న ఘనత టీఆర్ఎస్ కే దక్కిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇపుడు ఇస్తున్న పింఛన్ మొత్తాన్ని రెట్టింపు చేస్తామన్నారు. రైతు బీమా వంటి పథకాన్ని భూమి లేని కుటుంబాలకు కూడా వర్తింప జేసే ఆలోచనలో ఉన్నామన్నారు. అందరూ రైతుల గురించి మాట్లాడారు తప్ప ఏం చేయ లేకపోయారన్నారు. చిత్తశుద్ధితో రైతు లకు పెట్టుబడి ఇచ్చిన ప్రభుత్వం తమదేనన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయన్నారు. మిషన్ భగీరథ ద్వరా ప్రతీ ఇంటికి సురక్షిత నీటిని అందించనున్నామన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.