
జయశంకర్ సర్ జీవితం స్ఫూర్తిదాయకం
జయశంకర్ సర్ జయంతి వేడుకల్లో ఎంపి కవిత
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సర్ జీవితం మనందరికీ స్పూర్తిదాయకం అన్నారు నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత. సోమవారం డిల్లీలోని తెలంగాణ భవన్‌లో జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు ఎంపిలు జయశంకర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో ఎంపి కవిత మాట్లాడుతూ జయశంకర్ సర్‌ను స్మరించుకుంటూ వారు లేని లోటును పూడ్చుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. రక రకాల పరిస్థితులను ఉద్యమ సమయొంలో ఎదుర్కోన్నామని, వాటిని అధిగమించేందుకు జయశంకర్ సర్ వద్ద అరగంట కూర్చుని డిస్కస్ చేసేదాన్నని ఆ నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిలో, మనం వేస్తున్నప్రతి ముందడుగులో వారు లేక పోవడం బాధాకరమన్నారు కవిత..తెలంగాణ రాక ముందు ముఖ్యమంత్రి కెసిఆర్, జయశంకర్ సర్ తెలంగాణ సమస్యలపై మాట్లాడుకున్నారని, దానికనుగుణంగా రూపొందించుకున్న బ్లూ ప్రింట్ ప్రకారం సిఎం కేసిఆర్ ప్రజల సహకారంతో కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నారని తెలిపారు ఎంపి కవిత. సౌ పడో..ఏక్ లిఖో..ఉర్దూ సామెత ప్రకారం..తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని జయశంకర్ సర్ రాసి పెట్టుకున్నారని తెలిపారు. ఆనాడు కమ్యూనికేషన్ తక్కువగా ఉన్నసమయంలో 1952 నుండి తెలంగాణకు జరిగిన అన్యాయాలను రాసి పెట్టుకున్న విషయాలు ఉద్యమానికి పెట్రోల్ లా ఉపయోగపడ్డాయని కవిత చెప్పారు. నిబద్ధత, సిన్సియారిటీ ఉంటే ఏదయినా సాధించవచ్చని జయశంకర్ సర్ జీవితం మనకు తెలియజేస్తుందని అన్నారు.వారి మాటలను ముందు తరాలకు తెలియజేస్తూ వారికి మార్గం చూపే బాధ్యత మనందరిపైనా ఉందన్నారు ఎంపి కవిత. ఈ కార్యక్రమంలో ఎంపిలు బోయినపల్లి వినోద్ కుమార్, కొత్త ప్రభాకర్ రెడ్డి, డిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారి, కరీంనగర్ జడ్పీ ఛైర్మన్ తుల ఉమ పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో…. ప్రొఫెసర్ జయశంకర్ సర్ జయంతి వేడుకలను తెలంగాణ జాగృతి ఘనంగా నిర్వహించింది. తెలంగాణలోని 31 జిల్లాల్లో తెలంగాణ జాగృతి కార్యకర్తలు జయశంకర్ సర్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే తెలంగాణ జాగృతి ఆవిర్భావ దినో్త్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేశారు జాగృతి కార్యకర్తలు.