Breaking News

జూ అండ్ పార్కుల అభివృద్ధి కి ప్రణాళిక సిద్ధం

జూ అండ్ పార్కుల అభివృద్ధి కి ప్రణాళిక సిద్ధం

హైదరాబాద్: రాష్ట్ర్రంలోని జూ అండ్ పార్కుల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని జూ అండ్ పార్క్ అధారిటీ ఆఫ్ తెలంగాణ (జపాట్) ఛైర్మన్, అటవీ పర్యావరణ శాఖామంత్రి జోగు రామన్న అధికారులను ఆదేశించారు. గురువారం అరణ్య భవన్ లో జరిగిన జపాట్ సమావేశంలో మంత్రి జోగు రామన్న నేతృత్వంలో పలు నిర్ణయాలను తీసుకున్నారు. ప్రజలకు ఆహ్లదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు రాష్ట్ర్ర వ్యాప్తంగా పార్కులను ఏర్పాటు చేయాలని, ఇప్పటికే ఉన్న జంతు ప్రదర్శన శాలలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర్రంలోనే పెద్దదైన హైదరాబాద్ లోని నెహ్ర్రూ జూ పార్క్ లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేయాలని జోగు రామన్న ఆదేశించారు. జూ పార్క్ చుట్టూ హై సెక్యూరిటీ గోడను నిర్మించాలని, ఈ విషయంలో సర్వే చేసే బాధ్యతలను జేఎన్ టీయూ నిపుణులకు బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. నెహ్రూ జూ పార్కో లో మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, నిరంతరంగా వెలుగు కోసం సోలార్ కాంతులు ప్రసరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సెంట్రల్ జూ అధారిటీ (సీజెడ్ఏ) నివేదిక మేరకు నెహ్రూ జూ పార్క్ మూడవ ర్యాంక్ లో ఉందని, దీన్ని మొదటి ర్యాంక్ లో తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. సెంట్రల్ జూ అధారిటీ సిఫార్సుల మేరకు జూ పార్క్ లలో మెరుగైన సదుపాయాల ఏర్పాటు కోసం సింగపూర్ లోని జూ పార్క్ లను సందర్శించి అధ్యయనం చేసేందుకు మంత్రి జోగురామన్న నేతృత్వంలో ఉన్నతాధికారుల బృందం త్వరలోనే సింగపూర్ కు వెళ్ళాలని నిర్ణయించారు. నెహ్ర్రూ జూ పార్క్ లో అదనంగా రైల్వే ట్రాక్ ఏర్పాటు చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే సహకారాన్ని తీసుకోవాలని, టాయ్ ట్రేన్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి జోగు రామన్న తెలిపారు. అదనంగా బ్యాటరీ వాహనాలను సమకూర్చాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. జూ పార్క్ లో మరిన్ని జంతువులను ఇతర రాష్ట్ర్రాల నుంచి తరలించాలని, ఒంటరి జంతువులకు జతను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, బీ.ఆర్.మీనా, పీసీసీఎఫ్ ప్రశాంత్ కుమార్ ఝూ. వైల్డ్ లైఫ్ హెడ్ మనోరంజన్ భాంజా, జపాట్ సభ్య కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, జూ క్యూరేటర్ శివానీ డోంగ్రే, వరంగల్ అటవీ సంరక్షణాధికారి అక్బర్, డబ్ల్యూడబ్లూఎఫ్ స్వచ్చంద సంస్ధ ప్రతినిధి అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *