జూన్ 7న తెలంగాణ పారిశ్రామిక విధానం ప్రకటన

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానాన్ని జూన్‌ 7న ప్రకటించాలని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్‌ రావు నిర్ణయించారు. దేశ వ్యాప్తంగా ఉన్న పలువురు పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు, బహుళ జాతి కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామిక రంగానికి సంబంధించిన ప్రముఖులందరి సమక్షంలో పారిశ్రామిక విధానాన్ని ప్రకటించాలని సిఎం నిశ్చయించారు. పారిశ్రామిక విధానానికి తుది రూపు ఇచ్చేందుకు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు. పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, వాణిజ్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌, ప్రభుత్వ సలహాదారు బివి. పాపారావు, పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్‌ కుమార్‌, టిఎస్‌ఐఐసి ఎండి నర్సింహరెడ్డి, జీహెచ్‌ఎంసి కమిషనర్‌ సోమేష్‌కుమార్‌, హెచ్‌ఎండిఎ కమిషనర్‌ శాలినిమిశ్రా, జెన్కో చైర్మన్‌ ప్రభాకర్‌రావు, వివిధ శాఖల కార్యదర్శులు ఎస్‌కె. జోషి, రేమాండ్‌ పీటర్‌, జయేష్‌ రంజన్‌, మీనా, వెంకటేశం, గోపాల్‌, రామకృష్ణారావు, అజయ్‌మిశ్రా, నదీమ్‌, సిఎంఓ ముఖ్య కార్యదర్శి శాంతకుమారి, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులు, ఫ్యాక్టరీస్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానం కోసం చేసిన కసరత్తు తుది రూపం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి పారిశ్రామిక విధానం రూపకల్పన కోసం అనేక మందితో చర్చించామని, అధికారులతో కూడా అనేక సార్లు సమావేశాలు నిర్వహించామని, అత్యున్నత పారిశ్రామిక విధానం అమలు చేస్తున్న దేశాల్లో పరిస్థితిని అధ్యయనం చేశామని సిఎం అన్నారు. మొత్తం మీద అత్యుత్తమ పారిశ్రామిక విధానం తయారయ్యిందన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం 15 రోజుల్లోనే అనుమతులు ఇవ్వడం ఈ విధానంలోని ప్రధాన ఉద్దేశ్యమన్నారు. పరిశ్రమల స్థాపనకు భూమి, నీరు, విద్యుత్‌ అవసరమయినందున ఈ మూడు విషయాల్లో ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. టిఎస్‌ఐఐసికి ఇప్పటికే 1,60,000 ఎకరాల భూమిని అప్పగించామని, పరిశ్రమలకు టిఎస్‌ఐఐసి ద్వారానే భూమిని బదలాయిస్తామని చెప్పారు. టిఎస్‌ఐఐసి ఆధీనంలోని భూమిని పారిశ్రామిక వాడలుగా అభివృద్ది చేసే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంటుందని చెప్పారు. పారిశ్రామిక వాడలకు కావలసిన కరెంట్‌, నీరు, రహదారుల లాంటి మౌలిక వసతులు కూడా సిద్దం చేసి పెడతామన్నారు. పరిశ్రమలకు కేటాయించిన భూమిని మరో అవసరానికి బదలాయించకుండా షరతు కూడా పెట్టాలన్నారు. పరిశ్రమలకు కావలసిన నీటికి కొరత లేదని, నీటి పారుదల ప్రాజెక్టు నుండి 10 శాతం నీటిని కేటాయిస్తూ విధానపర నిర్ణయం కూడా తీసుకున్నామన్నారు. వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు పైపు లైన్ల ద్వారానే పరిశ్రమలకు కూడా నీటి సరఫరా చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రం విద్యుత్‌ సమస్యను విజయవంతంగా అధిగమిస్తున్నదని, ఈ పరిణామం పరిశ్రమలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ ఏడాది ఏలాంటి విద్యుత్‌ కొరత లేకుండా చూడగలిగామని, వచ్చే ఏడాది మార్చి నాటికి మొత్తం ఏడు వేల మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులోకి వస్తుందన్నారు. 2017 మార్చి నాటికే తెలంగాణ రాష్ట్రం విద్యుత్‌ మిగులు రాష్ట్రంగా ఉంటుందన్నారు. అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తామని వెల్లడించారు.

తెలంగాణలో పరిశ్రమలు పెట్టే వారికి అనుకూలంగా పారిశ్రామిక విధానం ఉంటుందని సిఎం చెప్పారు. అనుమతుల పేర, తనిఖీల పేర, విచారణల పేర కాలయాపన చేసే పాత పద్దతులకు స్వస్తి చెబుతున్నట్లు ప్రకటించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని, ఎవరైనా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. వచ్చిన దరఖాస్తులను ముఖ్యమంత్రి కార్యాలయంలోని చేజింగ్‌ సెల్‌ పరిశీలించి నాలుగైదు రోజుల్లోనే దరఖాస్తు దారుడిని ఆహ్వానిస్తామని చెప్పారు. దరఖాస్తు దారునితో ముఖాముఖి సమావేశమయి ఏ పరిశ్రమ స్థాపించాలనుకుంటున్నారు? ఎంత స్థలం అవసరం? ఎంత నీరు, ఎంత విద్యుత్‌ అవసరం లాంటి వివరాలు తీసుకుంటామన్నారు. ఆ తరువాత పరిశ్రమ ఏర్పాటుకు కావలసిన అనుమతులన్నీ ప్రభుత్వమే సమకూరుస్తుందని సిఎం చెప్పారు. పరిశ్రమలను ప్రమాద భరిత, ప్రమాద రహిత పరిశ్రమలుగా విభజించాలన్నారు. ఫార్మా లాంటి పరిశ్రమలు ఖచ్చితంగా ప్రభుత్వం నిర్దేశించిన ప్రాంతంలోనే ఉండే విధంగా నిబంధన ఉంటుందన్నారు. పారిశ్రామిక వాడల్లో లేని పరిశ్రమలకు కూడా అనుమతులు సరళంగా ఉండాలని చెప్పారు. కేవలం 15 రోజుల్లోనే అన్ని రకాల ప్రక్రియలు పూర్తి చేసి అనుమతి ఇస్తామన్నారు. పారిశ్రామిక వాడలను ప్లగ్‌ అండ్‌ ప్లే పద్దతిన సిద్ధం చేసి ఉంచుతామన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *