
మీకు కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు ఉన్నాయా..? అయితే, జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా రూపొందించిన పంచతత్వ పార్కుకు వచ్చి వాకింగ్ చేయండి. దీంతో మీ కీళ్ల, కండరాల నొప్పులకు ఉపశమనం కలిగే అవకాశం ఏర్పడుతుంది. ఇక వివరాలకొస్తే, మానవ దేహం పంచభూతాలైన గాలీ, నీరు, ఎండ, భూమి, ఆకాశంతో ప్రభావితమవుతోంది. సమస్త విశ్వం ఈ పంచభూతాలతోనే నిండి ఉంది. అయితే ఈ పంచతత్వంతో కూడిన ప్రత్యేక వాకింగ్ ట్రాక్‌ను హయత్‌నగర్ సర్కిల్‌లోని సచివాలయం నగర్ పార్కులో జీహెచ్ఎంసీ బయోడైవర్సిటీ విభాగం ఏర్పాటు చేసింది. అత్యంత స్వల్ప వ్యయం కేవలం లక్ష రూపాయలతోనే అతితక్కువ విస్తీర్ణంలోనే ఈ అక్యుపంక్చర్ వాకింగ్ ట్రాక్‌ను రూపొందించింది. సీనియర్ సిటీజన్లకు ముఖ్యంగా కీళ్లనొప్పులతో బాధపడే వారికి అతితక్కువ విస్తీర్ణంలో ఈ పంచతత్వ అక్యుపంక్చర్ వాకింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. ఈ పంచతత్వ వాకింగ్ ట్రాక్‌లో మొదట కొద్ది దూరంలో నీటితో నింపి ఉంటుంది. నీరు అనంతరం కంకరతో కూడిన ట్రాక్, సముద్రపు సన్న ఇసుకతో కొద్ది దూరం, బటాని ఇసుకగా పిలిచే దొడ్డు ఇసుకతో మరికొద్ది దూరం, చెక్కపొట్టుతో కప్పిన మరికొంత స్థలం, మెత్తగా ఉండే బంకమట్టి లేదా ఎర్రమట్టితో నింపిన ప్రత్యేక వాకింగ్ ట్రాక్‌ను రూపొందించారు. నీరు, కంకర, దొడ్డు ఇసుక, మెత్తగా ఉండే బంకమట్టితో నడిస్తే అటు ఆక్యుపంక్చర్‌లా పనిచేయడం, పంచతత్వ పదార్థాల వల్ల సరైన రీతిలో రక్త ప్రసరణకు అవకాశం ఏర్పాడుతుందని జీహెచ్ఎంసీ అర్భన్ బయోడైవర్సిటీ అడిషనల్ కమిషనర్ వి.కృష్ణ అభిప్రాయపడ్డారు. సీనియర్ సిటీజన్ల సౌకర్యార్థం ప్రత్యేకంగా రూపొందించిన ఈ పంచతత్వ పార్కును జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డి కూడా పరిశీలించారు. చుట్టూ వాకింగ్ ట్రాక్ మధ్యలో యోగముద్రతో ఉండే గౌతమ బుద్దుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా ఈ పార్కులో నిలిచింది. ప్రయోగాత్మకంగా రూపొందించిన ఈ పంచతత్వ పార్కు మాదిరిగా నగరంలో మరిన్ని ఆక్యుపంక్చర్ వాకింగ్‌ట్రాక్‌లను ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డి తెలిపారు.