జిల్లా విద్యాధికారుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి

·ప్రతి పాఠశాలను డీఈవోలు తనిఖీ చేసి ఏప్రిల్ 20లోపు నివేదిక ఇవ్వాలి

·ఈ ఏడాది హైస్కూల్స్ తో పాటు కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో డిజిటల్ క్లాస్ రూమ్ లు

·ఇక ప్రతి నెల 10వ తేదీలోపు మధ్యాహ్న భోజన బిల్లులు, వంటవాళ్ల వేతనాల చెల్లింపు

·కొత్త టీచర్ల వచ్చే వరకు విద్యావాలంటీర్లను నియమించుకోవాలి..జూన్ లోపు ప్రక్రియ పూర్తి కావాలి

·ఏకీకృత సర్వీసులు వచ్చిన వెంటనే పదోన్నతులు

.ఏప్రిల్ 15లోపు ప్రతి పాఠశాలలో పుస్తకాలు అందించాలి

·జూన్ 15లోపు ప్రతి విద్యార్థికి యూనిఫాం ఇవ్వాలి

·బడిబాట కోసం బాగా పనిచేసిన వారికి రివార్టులిస్తాను..పనిచేయకపోతే చర్యలు

·బడిబాటలో ప్రజాప్రతినిధులను, అధికారులను అందరిని భాగస్వామ్యం చేయించాలి

.జిల్లా విద్యాధికారుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి

హైదరాబాద్- వచ్చే విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు అమలు చేయాల్సిన కార్యక్రమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి జిల్లా విద్యాధికారులకు మార్గనిర్ధేశనం చేశారు. ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు, విద్యార్థులకు నమ్మకం పెరిగేలా, నాణ్యమైన విద్య అందించేలా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. బాగా పనిచేసే అధికారులకు రివార్డులు తానే స్వయంగా ఇస్తానని, పనిచేయని వారిపై చర్యలుంటాయని హెచ్చరించారు.

వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి రేపటి నుంచి(సోమవారం-03.04.2017) ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి డీఈవోలతో సర్వ శిక్ష అభియాన్ సమావేశ మందిరంలో మీటింగ్ ఏర్పాటు చేశారు. బడిబాట కార్యక్రమం ఈ నెల 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు పదిరోజుల పాటు జరుగుతుందని, ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేసేందుకు ఈ గవర్నమెంట్ చేపడుతున్న పనుల గురించి వివరించి ఎక్కువ మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా పనిచేయాలన్నారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో సరైన వసతులు లేవని, ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్న తీరును వివరించాలన్నారు. ప్రతి పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్ లు, డిజిటల్ క్లాస్ రూమ్ లు, టాయిలెట్లు, ఉచిత పుస్తకాలు, ఉచిత యూనిఫామ్ లు, మంచి ఫర్నిచర్ అందిస్తున్నామని, ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం పెంచాలని కోరారు. బడిబాట కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులను, అధికారులను భాగస్వామ్యం చేయాలన్నారు.

పాఠశాలల్లో ఉన్న సమస్యలు తెలుసుకునేందుకు డీఈవోలందరూ వారి పరిధుల్లోని పాఠశాలలను స్వయంగా తనిఖీ చేసి ఏఫ్రిల్ 20వ తేదీలోపు తనకు నివేదిక సమర్పించాలన్నారు. ఏప్రిల్ 15లోపు ప్రతి పాఠశాలకు ఉచిత పుస్తకాలు అందించాలని ఆదేశించారు. అదేవిధంగా గతంలో మాదిరిగా కాకుండా ఈ ఏడాది జూన్ 15వ తేదీలోపు విద్యార్థులందరికీ యూనిఫాంలు అందించాల్సిందేనన్నారు. దీనికోసం సంబంధిత అధికారులకు బాధ్యులను చేసి పనులు అప్పగించారు. పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి అన్ని చోట్ల పనిచేసే టాయిలెట్స్ ఉండాలని, వాటికి రన్నింగ్ వాటర్ ఉండాలని, బాలురు, బాలికలకు వేర్వేరు టాయిలెట్లు కల్పించాలని, విద్యార్థుల సంఖ్యకనుగుణంగా ఈ టాయిలెట్ల సంఖ్య ఉండాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

వచ్చే విద్యా సంవత్సరంలో హైస్కూళ్లతో పాటు అన్ని కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో కూడా డిజిటల్ క్లాసులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఎక్విప్ మెంట్, కంటెంట్ బాగుండేలా సంబంధిత అధికారులు ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించుకుని పనిచేయాలన్నారు.

మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన బిల్లులను ఈ విద్యా సంవత్సరం నుంచి ఇక ప్రతి నెల 10వ తేదీలోపు ఇవ్వాల్సిందేనన్నారు. గతంలో ఐదారు నెలలు బిల్లుల చెల్లింపు పెండింగ్ లో ఉండేదని, తాము తీసుకున్న చర్యల వల్ల ఫిబ్రవరి, మార్చి బిల్లులు కూడా ఇప్పటికే చెల్లించినట్లు ప్రకటించారు. మధ్యాహ్న భోజన బిల్లులతో పాటు వంటవాళ్ల వేతనాలు కూడా ప్రతి నెల 10వ తేదీలోపు చెల్లించాలన్నారు.

ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించి 8792 పోస్టులకు గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ అంగీకరించారని, దీనికి సంబంధించి టిఎస్ పిఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇచ్చిందన్నారు. అయితే నిబంధనల విషయంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉన్నందున నియామకాలు ఆలస్యమవుతున్నాయన్నారు. ఈ రెగ్యులర్ టీచర్లు వచ్చే వరకు వేచి చూడకుండా వెంటనే విద్యావాలంటీర్లను నియమించుకోవాలని డీఈవోలకు సూచించారు. ఇక ఉపాధ్యాయుల బదిలీలను 2015లో కౌన్సిలింగ్ పెట్టి చేశామన్నారు. త్వరలోనే ఏకీకృత సర్వీసు నిబంధనలు రానున్నాయని, ఇవి రాగానే పదోన్నతులు కల్పిస్తామన్నారు.

ఇటీవల కాగ్ ఇచ్చిన నివేదిక మేరకు ఐదు సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలలోపు వయస్సున్న వారి అక్షరాస్యతలో జాతీయ సగటు కంటే తెలంగాణ సగటు ఎక్కువగా ఉందని పేర్కొన్నారని, ఇది సంతోషకర విషయమన్నారు. అదేవిధంగా విద్యార్థుల నమోదు, కొనసాగింపులో కూడా తెలంగాణ మంచి స్థానంలో ఉందని, ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగవుతున్నాయని కూడా కాగ్ నివేదికలో పేర్కొన్నట్లు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో పరిస్థితులు ఇంకా మెరుగు కావల్సిన అంశాన్ని కాగ్ గుర్తు చేసిందన్నారు.

ప్రస్తుతం నిర్ధేశించిన కార్యక్రమాల పురోగతికి సంబంధించి మే నెలలో మరోసారి డీఈవోలతో సమావేశం నిర్వహిస్తానని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఎప్పటికప్పుడు సమీక్షలు, సమావేశాలు నిర్వహించుకుని ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేసుకుంటున్నామన్నారు. ఇందుకోసం మీడియా కూడా సహకరించాలని కోరారు. డీఈవోలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు చేసే మంచి పనులు కూడా మీడియా చూపించాలని, దీనివల్ల ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందన్నారు.

kadiyam srihari.     kadiyam

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *