Breaking News

జిల్లాల బాట పట్టిన సీఎం కేసీఆర్

KCR_AFP2

హైదరాబాద్ : మొన్న వరంగల్, నేడు మహబూబ్ నగర్.. ఇలా సీఎం కేసీఆర్ జిల్లాల బాట పట్టారు. విపక్షాల విమర్శలను ఎదుర్కొనేందుకో… లేక జిల్లాలను అభివృద్ధి చేయాలన్న కృతనిశ్చయంతోనూ ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు. ఎన్నికలున్న చోటికే సీఎం వెళుతున్నారంటూ.. ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తుండడంతో.. వాటికి పుల్‌స్టాప్‌ పెట్టేందుకు.. అన్ని జిల్లాల్లో అధికారిక పర్యటనలు ఖరారు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.

వరంగల్‌లో 4 రోజుల పర్యటన…
జిల్లాల వారిగా సమీక్షలు నిర్వహించి ఓ వైపు పాలన గాడిన పెడుతూనే మరో వైపు కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు జిల్లాల పర్యటన శ్రీకారం చుట్టారు సీఎం. కేవలం వరంగల్‌ జిల్లాలో మాత్రమే.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు రోజుల పాటు పర్యటించడం వివాదాస్పదంగా మారింది. విమర్శలను ఏమాత్రం పట్టించుకోకుండా… తనదైన పంథాలో సీఎం అధికారులను పరుగులు పెట్టిస్తూనే పార్టీపై దృష్టి సారించారు. ఆ జిల్లా శాసనసభ్యులతో భేటీ అయి జిల్లా అభివృద్ధికి అవసరమైన చర్యలు, పార్టీ పటిష్టతకోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నేతలకు దిశానిర్దేశం చేశారు.

సీఎం పర్యటనలో మహబూబ్‌నగర్‌ జిల్లా….
మరోవైపు కార్పొరేషన్ ఎన్నికలు లేని ప్రాంతాల్లో కూడా పర్యటిస్తే విపక్ష పార్టీలను కట్టడి చేయవచ్చనే అభిప్రాయంతో సీఎం పాలమూరు జిల్లాను తన పర్యటనకు ఎంచుకున్నారు. 18వ తేదీన మహబూబ్ నగర్ పట్టణంలోని మురికి వాడల్లో పర్యటించేందుకు నిర్ణయించారు. గతంలో పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన కేసీఆర్ సీఎంగా మొదటిసారి క్షేత్రస్థాయిలో మహబూబ్ నగర్‌లో పర్యటన ఖరారు కావడంతో నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పర్యటన మరోరోజు పొడిగించే అవకాశం….
అధికారికంగా ఈ పర్యటన ఒకే రోజుకు ఖరారైనా అవసరాన్ని బట్టి మరోరోజు పొడిగించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. త్వరలో అన్ని జిల్లాల్లో కూడా పర్యటించి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, పార్టీ కార్యక్రమాలపై కార్యకర్తలను సన్నద్ధం చేయడం లక్ష్యంగానే సీఎం పర్యటన సాగనుందని తెలుస్తోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *