
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో నూరుశాతం మరుగుదొడ్లు నిర్మాణం పూర్తి చేసుకొని తెలంగాణలో మొదటి స్ధానంలో నిలపాలని కరీంనగర్ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు తుల ఉమ అన్నారు. గురువారం కోరుట్లలో ఐ.ఎస్.ఎల్.ల పై అవగాహన సదస్సులో పాల్గొన్నారు. స్ధానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, యువజన నాయకులు కలిసి పనిచేసినపుడే ఈ లక్ష్యాన్ని సాధించడం సాధ్యమవుతుందని అన్నారు. ఇప్పటికే వేములవాడ, సిరిసిల్ల నియోజనవర్గ వర్గాలలో నూరుశాతం మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తిచేసినట్లు తెలిపారు. గ్రామాల అభివృద్ధే దేశాభివృద్ధి అన్నారు. నూరుశాతం అక్షరాస్యతను సాధించాలని పిలపు నిచ్చారు. అందరు చదువుకున్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ మాట్లాడుతూ, ఐ.ఎస్.ఎల్.ల నిర్మాణం చేసుకున్న లబ్ధిదారులకు చెల్లింపులు జరిగే విధంగా చూస్తామని హమీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ స్వచ్చా భారత్ పధకాన్ని అమలు చేస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరు మరుగుదొడ్లను నిర్మించు కోవాలని సూచించారు. ఎన్.ఆర్.జి.ఎస్. ద్వారా మరుగుదొడ్లను నిర్మించుకున్న వారు కంప్యూటర్ లో ఫోటో అప్ లోడ్ చేసి పంపినట్లయితే వారికి చెల్లింపులు ఆన్ లైన్ లో వస్తాయని అన్నారు. ప్రభుత్వ పధకాలు అమలు పరిచే బాధ్యత అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులకు ఉంటుందని అన్నారు. త్రాగునీటి సమస్య పరిష్కారానికి నిధుల కొరత లేదని అన్నారు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతున్న చోట చెల్లింపులు జరుపుతామని అన్నారు. స్ధానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో 2 నెలల లోపల నూరుశాతం ఐ.ఎస్.ఎల్. నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు. ఐ.ఎస్.ఎల్. నిర్మించుకున్న లబ్దిదారులకు సకాలంలో చెల్లింపులు జరపాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల సబ్ కలెక్టర్ శశాంక, జిల్లా పంచాయితీ అధికారి సూరజ్ కుమార్, కోరుట్ల మున్సిపాలిటి చైర్మన్ శీలం వేణు, జెడ్పి.టి.సి.లు, ఎం.పి.టి.సి.లు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.