జాడ జెప్పరమ్మా గుట్టల జాడ జెప్పరమ్మా!

రక్షణకు గుట్టలుండయి!
గాలి నీరు ఆకాశ మేఘమా
జాడ జెప్పరమ్మా గుట్టల జాడ జెప్పరమ్మా!
కాల గమనమున కరిగిన లోహపు
కంద గడ్డలమ్మా గుట్టలు పుడమి బిడ్డలమ్మా !
పుట్టుకన్నదే లేకముందు
ఈ గుట్టలు బుట్టినయీ ప్రాణికి పుట్టుక నిచ్చినయీ !
తిండి లేక జీవ జంతు జాలము
తల్లడిల్లినపుడు గుట్టలే ఆదుకున్నాయపుడు !
చెట్టు చేమలూ పెరిగేతందుకు
మట్టిగ మారినయీ గుట్టలు పగిలి చిట్లిపోయీ !
ఆకలికన్నం అయ్యే చెట్లను
కడుపుల పెంచినయీ మనుషుల కథ నిలిపుంచుటకూ !
దిస మొలతో ఆదవ్వ తాతలు
దిగాలు పడినపుడు గుట్టలు నార చీరలిచ్చే !
వానకు చలికి వేడి తాకిడికి
వెతలు చెందినపుడు గుట్టలు దొనల దాచినాయి !
బండ బండ రాపాడి కొండలో
నిప్పు బుట్టె మొదట వెలుగుల జాడ జెప్పే గుట్ట !
గిరుల దొరలిన గుండ్రటి రాల్లే
బండి చక్రమయ్యే బతుకుల గతులు మార్చే గుట్టా !
భీకర ప్రకృతి విలయం దెబ్బకు
బిక్క జచ్చినపుడు మొక్కే బొమ్మ జెక్కనిచ్చే
బొడ్రాయి నుండి భోలా శంకర్
దేవుడెవ్వరైనా గుట్టల దేహ ఖండమేగా !
బల్లాలు గోడ్డండ్లు గదలకు
బతుకు నిచ్చే గుట్టా మనిషిని సాయుధునిగ జేసె !
గుడులు చెక్కినా కోటలు గట్టిన
గుట్ట బండే దిక్కై మనిషికి రక్షగ నిలిచింది !
ఇన్ని జేసినా ఇమాన మెరుగని
తేలు సంతతోల్లు కొండల తెగ నరికెస్తుండ్రు !
వాగు వంకలకు పుట్టినిల్లు
ఆ చెట్టు గుట్టలేగా అవి లేక చెరువు లెటుల !
వానలుండకా చెరువు నిండకా
పాడి పంట లెటుల ప్రజలకు బతుకు దెరువే కరువు !
పక్షులు పాములు ఎలుగులు కోతులు
యెగబడి తరుముతయీ గప్పుడు దిగబడి ఉరుకుతరు !

కానీ ! గుట్ట లుండ వెచటా వారికి రక్షగ నిలుచుటకూ !

– వీరగొని పెంటయ్య , విశ్రాంత విద్యా పర్యవేక్షణాధికారి

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *