జర్నలిస్టుల హత్యలపై Iju,Tuwj,Huj ధర్నా

tuwj

మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వరుసగా జరుగుతున్న జర్నలిస్టుల హత్యలపై ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్(ఐజేయూ), తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(టీయూడబ్ల్యూజే), హైదరాబాద్ యూనియన్ ఆప్ జర్నలిస్ట్స్(హెచ్.యూ.జే)  సంఘాలు మండిపడ్డాయి. దీనికి నిరసనగా గురువారం హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ ఎదుట జర్నలిస్టు నాయకులు ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా ధర్నాలో పాల్గొన్న ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ మాట్లాడుతూ ఉత్తరాది రాష్ట్రాల్లో అన్యాయాలను వెలికితీస్తున్న జర్నలిస్టులను అమానుషంగా హతమారుస్తున్నారని.. అక్కడి ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయని.. వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్ పూర్ జిల్లా కేంద్రంలో 15ఏళ్లు జర్నలిస్టుగా సేవలందిస్తున్న జాగేంద్ర సింగ్ ను అక్కడి రాష్ట్ర మంత్రి రాంమూర్తి వర్మ పోలీసుల సహాయంతో పెట్రోల్ పోసి కిరాతకంగా హత్య చేయించారని అమర్ ఆరోపించారు. ఆ నిందితులను అరెస్ట్ చేసి మంత్రి రాంమూర్తి వర్మను భర్తరఫ్ చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. జాగేంద్ర సింగ్ తన మరణవాంగ్మూలంలో మంత్రి ప్రోద్బలంతోనే పోలీసులు తనపై పెట్రోల్ పోసి నిప్పంటించారని సాక్ష్యం ఇచ్చారని.. ఇప్పటికైనా ఆ రాష్ట్ర ప్రభుత్వంపై నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మధ్యప్రదేశ్ బాలాగాట్ జిల్లా కటంగిలో వార్తల సేకరణకు వెళ్లిన సందీప్ కొఠారి అనే విలేకరిని కూడా దుండగులు హత్య చేశారని.. వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్ లో కూడా మాఫియా ఓ జర్నలిస్టును హతమార్చడంతో దేశంలో జర్నలిస్టులకు భద్రత కరువైందని.. కేంద్ర ప్రభుత్వం స్పందించాలని కోరారు.

దేశంలో పాత్రికేయులపై జరుగుతున్నదాడులపై ప్రత్యేక కమిటీ వేయాలని అమర్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐజేయూ జాతీయ కార్యదర్శి వై నరేందర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు కే. సత్యనారాయణ, హెచ్.యూ.జే ప్రెసిడెంట్ కోటిరెడ్డి, ఐజేయూ నేషనల్ కౌన్సిల్ సభ్యులు అయిలు రమేశ్, రాష్ట్ర నాయకులు ఏ.రాజేశ్, శంకర్ గౌడ్ తో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *