
జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించకపోతే అసెంబ్లీ ముట్టడి – టియూడబ్ల్యుజే- ఐజేయూ హెచ్చరిక
-జీవో 239ను సవరించి అందరికి అక్రిడిటేషన్లు ఇవ్వాలి
-రాంచంద్రమూర్తి కమిటీ సిఫారస్సులను అమలు చేయాలి
-చిన్న, మధ్యతరగతి పత్రికల ఉద్యమానికి మద్దతు
-ఉద్యోగులతో సమానంగా ఆరోగ్య రిఎంబర్స్మెంట్ను అమలు చేయాలి.
నూతన జీవో 239ను తక్షణమే సవరించి, వర్కింగ్ జర్నలిస్టులందరికి అక్రిడిటేషన్లు ఇవ్వాలని టియూడబ్ల్యుజే-ఐజేయూ డిమాండ్ చేసింది. సోమవారం బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారకభవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, ఐజేయూ సీనియర్ నాయకులు కె.శ్రీనివాస్‌రెడ్డి, ఐజేయూ జాతీయ కార్యదర్శి వై.నరేందర్‌రెడ్డి, టియూడబ్ల్యుజే ప్రధానకార్యదర్శి విరహత్ అలిలు మాట్లాడారు. రాష్ర్ట ప్రభుత్వం నియమించిన రాంచంద్రమూర్తి కమిటీ చేసిన సిఫారసులను పరిగణలోకి తీసుకోకపోవడం వల్లే సమస్యలు తలెత్తాయని, సమస్యలను పరిష్కరించేందుకు రాంచంద్రమూర్తి కమిటి సూచించిన సూచనలను, సిఫారసులను యధాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. చిన్న, మధ్యతరగతి పత్రికలకు తాము వ్యతిరేకంకాదని, పనిచేసే ప్రతి జర్నలిస్టు తరుపున తాము పోరాడుతామన్నారు. నియోజకవర్గం పేరుతో నూతనంగా ఇచ్చేందుకు అంగీకరించినప్పటికీ వారికి ఇచ్చే అక్రిడిటేషన్ల విషయంలో గందరగోళం నెలకొందని వాపోయారు. నియోజకవర్గ, మండల స్థాయి జర్నలిస్టులందరికి జిల్లా స్థాయి అక్రిడిటేషన్ల అందివ్వడం ద్వారా రైల్ పాసుల అంశంలో తలెత్తిన సమస్యలను పరిష్కరించవచ్చని సూచించారు. మునుపెన్నడూ లేనివిధంగా జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు జారీ చేసేందుకు విద్యార్హతలను పెట్టడం సమంజసం కాదన్నారు. విలేకరులు సమాజాన్ని అద్యాయం చేసి, వారి సాధక బాధకాలతో నేరుగా సంబంధాలను ఏర్పర్చుకొని సమస్యలను వెలుగులోకి తీసుకురావడానికి అహర్నిశలు శ్రమిస్తున్న విషయాన్ని సమాచారశాఖ మరిచిపోరాదని గుర్తుచేశారు. విద్యార్హతలను పరిగణలోకి తీసుకోవాల్సింది యాజమాన్యాలే గాని ప్రభుత్వాలు కాదన్న విషయాన్ని గుర్తించాలన్నారు. చట్టసభలోకి అడుగుపెట్టడానికి లేని విద్యార్హతలు సమస్యలను వెలుగులోకి తీసుకురావడానికి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేసే జర్నలిస్టులకు ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వం తమ జేబులోనే ఉంది, తాము చెప్పినట్లుగానే జర్నలిస్టులకు న్యాయం జరుగుతుందని చెప్పుకుంటున్న కొన్ని వర్గాల నాయకులు జీవో 239 ద్వారా తలెత్తిన సమస్యలపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కేవలం పబ్బం గడుపుకోవడం కోసం ప్రభుత్వం తమతో ఉందంటూ జర్నలిస్టులను తప్పుదారిపట్టిస్తున్నవారు ప్రతి జర్నలిస్టుకు సమాదానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మెనిఫెస్టోలో పెట్టిన విధంగా హెల్త్‌కార్డులను అక్రిడిటేషన్లతో సంబంధం లేకుండానే జారీ చేసి, జర్నలిస్టుల ఆరోగ్యాలకు భద్రత కల్పించాలన్నారు. ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు అరోగ్య కార్డులు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఉద్యోగులకు ఇప్పటికే రిఎంబర్స్మెంట్ అవకాశం కల్పిస్తున్నప్పుడు జర్నలిస్టులకు ఎందుకు వర్తింపజేయడం లేదని ప్రశ్నించారు. రెండున్నర సంవత్సరాల నుంచి ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల పక్షపాతదోరణిని అవలంభిస్తుందని వాపోయారు. ఇకనైనా జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే శీతాకాల సమావేశాల్లో జర్నలిస్టులంతా కలిసి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపడుతామని హెచ్చరించారు.