జర్నలిస్టుల గర్జనకు దారితీసిన పరిస్థితులేమిటి

గర్జనకు దారితీసిన పరిస్థితులు
వివక్షపై పోరాటం వెనుక వాస్తవాలు
రిపోర్టింగే కాదు.. ప్రత్యక్ష పోరాటానికీ సిద్ధం :
—————————————-
జర్నలిస్టులు గర్జించేందుకు సిద్ధమయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగానే.. సొంత రాష్ట్రంలోనూ కొనసాగుతున్న వివక్షకు వ్యతిరేకంగా గళమెత్తేందుకు సంసిద్ధమంటున్నారు. ప్రభుత్వం సందేశాన్ని మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాదు.. తమకు జరుగుతున్న అన్యాయంపై ప్రత్యక్షంగా పోరాటం కూడా చేయడానికి వెనుకాడబోమంటున్నారు. ఎన్నికల యేడాదిలో అన్నివర్గాల వాళ్లనూ, అన్ని వృత్తుల వాళ్లనూ మచ్చిక చేసుకుంటున్న టీఆర్‌ఎస్‌ సర్కారు.. తమను కూడా కాస్త పట్టించుకోవాలంటూ నినదిస్తున్నారు.

దశాబ్దాల నుంచే పటిష్టమైన వ్యవస్థ :
———————————–
ఒక వ్యక్తిగా కాదు.. దశాబ్దాల కిందటినుంచే ఒక వ్యవస్థగా తయారైన జర్నలిస్టు సంఘం ఇది. రాష్ట్రంలోని జర్నలిస్టులందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి.. విధులు, బాధ్యతల గురించి వివరిస్తూనే.. హక్కుల కోసం నినదించి సాధించుకున్న ఘనత ఈ యూనియన్‌ది. విశేషానుభవం ఉన్న దేవులపల్లి అమర్‌, శ్రీనివాస్‌రెడ్డి వంటి నాయకుల మార్గదర్శకంలో కొనసాగుతోంది. క్షేత్ర స్థాయి నుంచి.. సెక్రెటేరియట్‌ దాకా… ప్రెస్‌నోట్‌ నుంచి ఇన్వెస్టిగేటివ్‌ రిపోర్టింగ్‌ వరకూ మునివేళ్లపై సుడులు తిప్పిన కాకలు తీరిన యోధులున్న సంఘం ఐజేయూ అనుబంధ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌జర్నలిస్టుల యూనియన్‌ (ఐజెయు).

50యేళ్ల పైచిలుకు చరిత్ర :
————————
50యేళ్ల పైచిలుకు చరిత్ర ఈ యూనియన్‌ది. తెలంగాణ రాష్ట్రంలో 13వేలకు పైగా సభ్యత్వాలున్న అతిపెద్ద యూనియన్‌. అయినా.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ యూనియన్‌తో చర్చలకు విముఖతను చూపిస్తోంది. నిన్నా, మొన్నా.. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కొత్తగా పెట్టుకున్న సంఘం నాయకులనే లెక్క చేస్తూ.. ఘన చరిత్ర, అపార అనుభవం ఉన్న ఐజెయు అనుబంధ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ జర్నిలిస్టుల సంఘాన్ని విస్మరించడం మేధావి వర్గాల్లోనూ చర్చకు దారితీస్తోంది. అసలు కొత్తగా పుట్టుకొచ్చిన సంఘానికి 4వేలకు మించి సభ్యత్వం లేదు. ఆ వాస్తవాన్ని టీఆర్ఎస్‌ ప్రభుత్వం గ్రహించడం లేదు.

అప్పటి మేనిఫెస్టో అంశాలే ఇప్పటి డిమాండ్లు :
—————————————-
ప్రధానంగా 2014 ఎన్నికలకు ముందు జర్నలిస్టుల సమస్యలపై టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను నెరవేర్చాలన్న డిమాండ్‌తో టీయూడబ్ల్యూజె (ఐజెయు) జర్నలిస్టుల గర్జనకు పిలుపునిచ్చింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక.. తొలి ప్రభుత్వం తెలంగాణ ప్రగతికోసం అనేక సంచలన నిర్ణయాలు తీసుకొని, అమలు చేస్తోంది. కానీ.. నాలుగేళ్లయినా.. జర్నలిస్టులకు సంబంధించి మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలపై చిన్నచూపు చూస్తోంది. జర్నలిస్టులు అందరికీ ఇళ్ల స్థలాలు, ఫీల్డ్ లో పనిచేసే వాళ్ళతో పాటు.. ఆఫీస్ లో పనిచేసే డెస్క్ స్టాఫ్ కి కూడా అక్రెడిటేషన్లు.. జర్నలిస్టులు అందరికి ఆరోగ్య భద్రత.. ఇలా అనేక హామీలను మేనిఫెస్టోలో చేర్చింది టిఆర్ఎస్. ప్రభుత్వం ఏర్పాటయ్యాక.. అవన్నీ కార్యరూపం దాలుస్తాయని జర్నలిస్టులు ఎంతగానో సంబరపడిపోయారు. కానీ.. వాటిని అమలు చేయడంలో టిఆర్ఎస్ అలసత్వం ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని కదిలించేలా.. పాత హామీలను గుర్తు చేసేలా హైదరాబాద్‌ హోరెత్తేలా జర్నలిస్టుల గర్జన సాగనుంది.

జర్నలిస్టుల మౌత్‌ పబ్లిసిటీ పవర్‌ ఫుల్‌ :
—————————————
మరో యేడాదిలో ఎన్నికలు సమీపిస్తుండటంతో.. వివిధ కుల సంఘాలు, రైతులు, వృత్తి సంఘాలను దగ్గరకు తీస్తున్న కేసీఆర్‌ సర్కారు.. వాళ్ల సమస్యలను అడిగి మరీ.. పరిష్కారానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. కానీ.. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలా పనిచేస్తోన్న జర్నలిస్టులను విస్మరిస్తోంది. యాజమాన్యాలను అడ్వర్‌టైజ్‌మెంట్ల రూపంలో ఆకట్టుకుంటే సరిపోతుందన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. కానీ.. గ్రామీణ ప్రాంతాల్లో, క్షేత్రస్థాయిలో జర్నలిస్టుల మౌత్‌ పబ్లిసిటీని కేసీఆర్‌ సర్కారు విస్మరిస్తోంది. ప్రకటనలు ఎరవేసి.. పత్రికలు, ఛానెళ్లలో ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాకుండా అడ్డుకునే అవకాశం ఉందేమో కానీ.. నిత్యం జనంలో తిరిగే, నిరంతరం సమాజాన్ని అధ్యయనం చేసే జర్నలిస్టులు.. ప్రత్యక్షంగా ఓటర్లతో సాగించే చర్చల్లో ప్రభుత్వ వ్యతిరేక పబ్లిసిటీ గనక మొదలుపెడితే.. పరిస్థితి ఎలా ఉంటుందో ప్రభుత్వం జీర్ణించుకోవడం కష్టమన్న వాస్తవాన్ని తెలుసుకోవాల్సి ఉంది.

కేసీఆర్‌కు రాంగ్‌ ఫీడింగ్‌ ! :
————————-
ఐజేయూ అనుబంధ తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘానికి ప్రతి మండలంలో నెట్‌వర్క్‌ ఉంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మనుగడ సాగిస్తున్న అన్ని పత్రికలు, టీవీ ఛానెళ్లు,( వెబ్‌) ఆన్ లైన్ మీడియాలో  పనిచేస్తున్న సీనియర్‌ జర్నలిస్టులు సభ్యులుగా ఉన్నారు. కానీ.. ప్రభుత్వం ఈ సంఘాన్ని, అపార అనుభవం ఉన్న సంఘం నాయకులను ఎందుకు దూరం చేసుకుంటుందో ఎవరికీ అంతుపట్టడం లేదు. కొత్త సంఘం నేతలనే కాకుండా.. జర్నలిస్టు సంఘం పునాదులు వేసి 50 యేళ్ల నుంచి మనుగడలో ఉన్న ఐజేయూ అనుబంధ టీయూడబ్ల్యూజేతోనూ స్నేహపూర్వకంగా మెలగాల్సిన అవసరం ఉంది. అయితే.. సీఎం కేసీఆర్‌కు కొందరు రాంగ్‌ ఫీడింగ్‌ ఇవ్వడం వల్లే ఐజేయూ సంఘంతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారన్న వాదనలు కూడా ఉన్నాయి.

అందరినీ కలుపుకుపోకుంటే నష్టమే :
———————————
ప్రజాస్వామ్యంలో ఎన్ని సంఘాలైనా ఉండొచ్చన్న సూత్రానికి కట్టుబడి ఉంది టీయూడబ్ల్యూజే. కానీ.. ప్రభుత్వానికి కొమ్ముకాసే నేతలున్న సంఘాలను మాత్రమే దగ్గరకు తీసుకొని.. అసలు జర్నలిస్టుల సమస్యలు, హక్కులకోసం పోరాడుతున్న సంఘాన్ని దూరం పెట్టడం సమంజసం కాదన్న అభిప్రాయం జర్నలిస్టు వృత్తిదారుల్లోనే కాదు.. ప్రభుత్వ వర్గాల్లోనూ వినిపిస్తోంది. రెండు సంఘాలనూ కలుపుకొని పోతే ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదు. తమ అనుభవంలో ఎన్నో ప్రభుత్వాలను, మరెన్నో పార్టీలను చూసిన.. రిపోర్టింగ్‌ చేసిన అపార అనుభవం కలిగిన దేవుల పల్లి అమర్‌, కె .శ్రీనివాస్‌రెడ్డి, నగునూరి శేఖర్, విరాహత్‌ అలీ వంటి సీనియర్లనూ పిలిచి జర్నలిస్టుల సమస్యలపై చర్చించడం వల్ల ప్రభుత్వానికే మేలు జరుగుతుంది కూడా. కేవలం మీడియా యాజమాన్యాలతోనే మంచి సంబంధాలు నెలకొల్పడం కాదు.. క్షేత్రస్థాయిలో పనిచేసే అసలైన జర్నలిస్టులను, జర్నలిస్టు సంఘాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. జర్నలిస్టుల సమస్యలపై సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉంది. పైగా.. ఎన్నికలకు ముందు తామే రూపొందించుకున్న మేనిఫెస్టోలోని జర్నలిస్టుల అంశాలపై దృష్టిపెట్టాల్సిన సమయం వచ్చింది. లేదంటే.. టీఆర్‌ఎస్‌ పార్టీయే దెబ్బతినే అవకాశాలుంటాయి.

ఈ వాస్తవాన్ని గ్రహించి ఇప్పటికే సంఘం నేతలను పిలిచి ప్రభుత్వం చర్చించి ఉంటే.. ప్రధాన డిమాండ్లపై హామీలు ఇచ్చి ఉంటే జర్నలిస్టుల గర్జనను కూడా విరమించుకునే పరిస్థితి ఉండేది. జర్నలిస్టులు స్వరాష్ట్రంలో సంబరాలు చేసుకునే అవకాశం ఉండేది. కానీ.. జర్నలిస్టు సంఘాల విషయంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒంటెత్తు పోకడ.. ఆ పార్టీకే నష్టం కలిగించడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.     – అయిలు రమేష్

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *