జర్నలిస్టుల ఆశలు నెరవేరుస్తున్న కేసీఆర్

-మొన్న అక్రిడేషన్లు, హెల్త్ కార్డులు
-నిన్న వేజ్ బోర్డు కమిటీ ఏర్పాటు
-ఆనందం వ్యక్తం చేస్తున్న జర్నలిస్టులు
హైదరాబాద్, ప్రతినిధి: బండెడు చాకిరీ చేసినా పత్రికాధిపతుల కబంధ హస్తుల్లో చిక్కి శల్యమవుతున్న జర్నలిస్టులకు నవ తెలంగాణలో మంచి రోజులు రాబోతున్నాయి. సీఎం కేసీఆర్ పత్రికాధిపతుల ఒత్తిడిని అధిగమించి జర్నలిస్టులకు మేలు చేసే నిర్ణయాలు ఒక్కొక్కటిగా తీసుకుంటూ వారికి మేలు చేస్తున్నారు..మొన్నటికి మొన్న అక్రిడేషన్లు, హెల్త్ కార్డులు ప్రకటించిన కేసీఆర్ నేడు జర్నలిస్టుల వేజ్ బోర్డు ( వేతనాల స్థిరీకరణ)కు కమిటీ వేయడంతో జర్నలిస్టుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. ఇన్నాళ్లు పత్రికాధిపతుల అడుగులకు మడుగులొత్తి కనీస వేతనాలు లేక సతమతమైన జర్నలిస్టులు ఈ వేజ్ బోర్డుతోనైనా తమ కష్టాలు తీర్చాలని కేసీఆర్ ను వేనోళ్ల పొగుడుతున్నారు.

నాడు నాలుగువేలే..

సాక్షి, సూర్య వంటి దినపత్రికలు రాకముందు పత్రికారంగంలో ఈనాడుది ఏకఛత్రాదిపత్యం.. అప్పుడు రిపోర్టర్లకు 1000 లోపు వేతనాలు ఇచ్చేవారు. సబ్ ఎడిటర్లకు సరాసరి 4000 వేలు వేతనం ఉండేది. ఎంత కష్టపడ్డా అంతకు మించి వచ్చేది కాదు.. కానీ 2007లో సాక్షి, సూర్య దినపత్రికల ప్రవేశంతో జర్నలిస్టుల ముఖచిత్రమే మారిపోయింది. 15,000 సగటు జీతాలు జర్నలిస్టులకు వచ్చాయి. పత్రికల్లో పోటీ వల్ల ఈనాడు కూడా వేజ్ బోర్డు ఇంప్లీమెంటు చేసి సబ్ ఎడిటర్ల వేతనాలు ఏకంగా 40 వేలకు పెంచింది. ఈ పరిణామాలు జర్నలిస్టులకు ఎంతో మేలుచేశాయి.. ఆంధ్రజ్యోతి, వార్త దినపత్రిక లు మాత్రం వేతనాలు పెంచక చాలీచాలనీ జీతాలు ఇస్తూ నెట్టుకొచ్చాయి..

ఎన్నికల తర్వాత ‘బళ్లు ఓడలు..’
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల తర్వాత బళ్లు ఓడలు అయినట్టు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓడిపోవడంతో సీన్ రివర్స్ అయ్యింది. ఓ వైపు కేసులు.. అధికారంలో లేకపోవడం సాక్షి జర్నిలిస్టులను భారీగా తగ్గించింది. వేతనాలను తగ్గించింది. ఇప్పుడు మళ్లీ జర్నలిస్టులు రోడ్డున పడుతున్నారు. సాక్షి దెబ్బతో ఇతర పత్రికలు ఆంధ్రజ్యోతి , నమస్తే తెలంగాణలు కూడా వేతనాలు పెంచడం లేదు. సంక్షోభం అంటూ నెట్టుకొస్తున్నాయి. వీటిల్లో జీతాలు కూడా 10 వేల సగటున ఉన్నాయి. దీంతో మళ్లీ జర్నలిస్టులకు కష్టాలు ఎదురయ్యాయి… ప్రతిరోజు మెయిన్ , జిల్లా ఎడిషన్లలో కోట్లకు కోట్ల అడ్వటైజ్ మెంట్లు వేస్తున్న పత్రికా యాజమాన్యాలకు జర్నలిస్టుల జీతాలు పెంచడంలో మాత్రం ఆ ఉత్సాహం చూపడం లేదు. పనిచేస్తే చేయండి.. లేదంటి వెళ్లిపోండి అంటూ జీతాల పెంపుదలను సంవత్సరాల తరబడి వాయిదా వేస్తూనే ఉన్నాయి దీంతో జర్నలిస్టులు నానా ఇబ్బందులు పడుతున్నారు. చాలీచాలనీ జీతాలతో పస్తులుంటున్నారు.

సీఎం నిర్ణయంతో ఉత్సాహం
తరతరాలుగా యాజమాన్యాల దోపిడీ సమైక్య రాష్ట్రంలో కొనసాగుతూ వచ్చింది. నాటి ముఖ్యమంత్రులతో పత్రికాధిపతులు సన్నిహితంగా మెలిగి వేజ్ బోర్డు, జర్నలిస్టులకు సౌకర్యాలు దక్కకుండా అడుగడుగునా అడ్డుపడ్డారు. కానీ రోజులు మారాయి. సీఎంలు మారారు. తెలంగాణ ఏర్పడ్డాకా సీఎం కేసీఆర్ ధృడంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎవరి ఒత్తిడికి తలొగ్డడం లేదు. అందుకే మొన్న అక్రిడేషన్లు, హెల్త్ కార్డులు ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు జర్నలిస్టుల కష్టాల కడలిని దాటవేసేందుకు వేజ్ బోర్డుపై కమిటీ వేశారు. ఈ కమిటీ సిఫారసుల ఆధారంగా ప్రభుత్వం ఆమోదించి జర్నలిస్టుల జీతాలపై జీవో జారీ చేస్తుంది. దీనివల్ల జర్నలిస్టుల జీతాలు భారీగా పెరుగనున్నాయి. సగటు వేతనాలు కనీసం 25వేల వరకు ఉండే అవకాశం ఉంది. కేంద్రం వేసిన వేజ్ బోర్డు ప్రకారం జీతాలకు సిఫారసు చేస్తే మరింత పెరుగనుంది. ఈ వేజ్ బోర్డు ప్రకటనతో జర్నలిస్టుల్లో సంతోషం వ్యక్తం అవుతోంది. సీఎం కేసీఆర్ నిర్ణయంపై వారు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *