
దేశంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల పట్ల కేంద్ర ఉక్కు, గనుల శాఖ సహాయ మంత్రి విష్ణుదేవ్ సహాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. చత్తీస్ గఢ్ లోని దుర్గ్ నగరంలో భిలాయ్ ఇన్ స్టిట్యూట్ఆఫ్ టెక్నాలజీ ఆడిటోరియంలో అక్టోబర్ 15, 16 తేదీలలో జరుగుతున్న ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) జాతీయ కార్యవర్గ సమావేశాలను ఆయన ప్రారంభిస్తూ జర్నలిస్టుల భద్రత కోసం ప్రత్యేక చట్టం తేవాల్సిన అవసరాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెస్తానని హామీ ఇచ్చారు. దాడులలో ఇటీవల మరణించిన జర్నలిస్టులకు ఆయన ఘనంగా నివాళులర్పించారు. ఐజేయూ అధ్యక్షుడు ఎస్.ఎన్ సిన్హా మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులు జరిగినప్పుడు వాటిపై జరిపి, దోషులను శిక్షించఉన్నత స్థాయి దర్యాప్తుడం, ఆ కేసుల విచారణ నిర్ధిష్ట కాల పరిమితిలో పూర్తయ్యేలా చూడటం, మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందేలా చూడటం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. దీని కోసం ఒక ప్రత్యేక చట్టం తేవాలని ఐజేయూ దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తోందని చెప్పారు. ఐజేయూ సెక్రెటరీ జనరల్ దేవులపల్లి అమర్ మాట్లాడుతూ జర్నలిస్టులు స్వేచ్ఛగా పనిచేయాలంటే వారికి రక్షణ ఉండాలని అన్నారు. వారి భద్రత కోసం ఒక ప్రత్యేక చట్టం తెస్తామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ భువనేశ్వర్ లో ఏడాదిన్నర క్రితం జరిగిన ఐజేయూ మహాసభలో హామీ ఇచ్చినా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదని అమర్ ఆవేదన వ్యక్తం చేశారు.
చత్తీస్ గఢ్ రెవెన్యూ, ఉన్నత విద్యా శాఖ మంత్రి ప్రేమ్ ప్రకాశ్ పాండే, దుర్గ్ శాసనసభ్యుడు అరుణ్ వోరా, భిలాయ్ నగర మేయర్ దేవేంద్ర యాదవ్, దుర్గ్ నగర మేయర్ చంద్రికా చంద్రాకర్, బిజెపి భిలాయ్ జిల్లా అధ్యక్షురాలు ఉషా టావర్, ఐజేయూ సీనియర్ నాయకులు కె.శ్రీనివాస్ రెడ్డి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు కె.అమర్ నాథ్, ప్రభాత్ దాస్, ఐ.ఎఫ్.జె ఉపాధ్యక్షురాలు సబీనా ఇంద్రజిత్, ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, టీయూడబ్ల్యూజే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్.శేఖర్, కె.విరాహత్ అలీ, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు నల్లి ధర్మారావు, చత్తీస్ గఢ్ శ్రమజీవి పత్రకార్ కల్యాణ్ సంఘ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బిడి నిజామి, కెకె వాసుదేవన్, ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు, 22కు పైగా రాష్ట్రాల యూనియన్ల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు