జనగామలోని కొడకండ్ల గురుకులంలో వసతిగృహాం ప్రారంభించిన మంత్రి కడియం శ్రీహరి

జనగామలోని కొడకండ్ల గురుకులంలో వసతిగృహానికి ప్రారంభోత్సవం

అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన

విద్యార్థినులకు హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ పంపిణీ పథకం ప్రారంభం

జూలై 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కేజీబీవీలలో ఇంటర్ తరగతుల ప్రారంభం

ఈ గురుకులం శాంతినికేతన్ వలె ఉందని పొగడ్త

116 కోట్ల రూపాయలతో విద్యాశాఖ గురుకులాల్లో భవనాల నిర్మాణం

ఈ ఏడాది నుంచి కొత్తగా 33 గురుకులాలు జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్

జూనియర్ విద్యార్థుల వసతి కోసం మరో 2 కోట్ల రూపాయల కేటాయింపునకు హామీ

గురుకులాల్లో విద్యార్థుల విద్య,ఆరోగ్య అభివృద్ధి కోసం పౌష్టికాహారం

100 కోట్లతో ఆరున్నర లక్షల మంది విద్యార్థినులకు హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ సరఫరా

నాణ్యమైన విద్య అందించేందుకు గత నాలుగేళ్లలో 817 గురుకులాల ప్రారంభం

గురుకులాలపై ఏటా 3500 కోట్ల రూపాయల ఖర్చు..ఒక్కో విద్యార్థికి లక్షకు పైగా వ్యయం

త్వరలోనే సిఎ కేసిఆర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆరోగ్య, కంటి పరీక్షలు

కొడకండ్ల గురుకుల విద్యాలయంలో ఉఫ ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి

గురుకుల విద్యార్థుల మధ్య జన్మదినాన్ని జరుపుకున్న స్థానిక ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు

వరంగల్, జూలై 04 : జనగామ జిల్లా కొడకండ్ల గురుకుల విద్యాలయంలో హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ ను విద్యార్థినిలకిచ్చి పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. అదేవిధంగా ఈ ఏడాది నుంచి పాఠశాలల అప్ గ్రేడ్ అయిన 33 విద్యాశాఖ గురుకులాల ఇంటర్ కాలేజీల తరగతులను కూడా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కొడకండ్ల గురుకుల కాలేజీలో 2.50 కోట్ల రూపాయలతో నిర్మించిన విద్యార్థినిల డార్మిటరీ భవనాన్ని, సీసీ రోడ్లను ప్రారంభించి, 40 లక్షల రూపాయలతో నిర్మించనున్న కాలేజీ అదనపు తరగతి గదులకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు తన జన్మదినాన్ని గురుకుల విద్యార్థినిల మధ్య జరుపుకున్నారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు కేక్ ను కట్ చేసి ఎమ్మెల్యే దయాకర్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తన పుట్టిన రోజును విద్యార్థినుల మధ్య జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గురుకుల కాలేజీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ తెలంగాణలో చదువుకున్న విద్యార్థి ప్రపంచంలో ఎవరితోనైనా పోటీ పడేవిధంగా ఉండాలన్న సిఎం కేసిఆర్ ఆదేశాల మేరకు నేడు తెలంగాణ విద్యను పటిష్టం చేస్తున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఈ నాలుగేళ్లలోనే 573 గురుకుల పాఠశాలలు, 191 గురుకుల జూనియర్ కాలేజీలు, 53 డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలు ప్రారంభించుకున్నామని చెప్పారు. తెలంగాణలో ప్రస్తుతం మొత్తం వీటి నిర్వహణ కోసం ఏటా 3500 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. గురుకుల విద్యాలయాల్లో చదివే విద్యార్థులపై ఒక్కొక్కరి మీద లక్ష రూపాయలకు పైగా వ్యయం చేస్తున్నామని చెప్పారు. గురుకుల విద్యాలయాల వ్యవస్థను ప్రారంభించిందే ఇక్కడి నుంచి అని తెలిపారు. 1972లో పీవీ నరసింహ్మరావు ఈ గురుకుల విద్యకు ఆద్యుడు కాగా, 1983లో ఎన్టీ రామారావు మరిన్ని గురుకుల విద్యాలయాలను ప్రారంభించారన్నారు. ఈ విద్యాలయాలను చూసే కేంద్ర ప్రభుత్వం జవహార్ నవోదయ విద్యాలయాలను తీసుకొచ్చిందన్నారు. మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వమే ఈ గురుకులాల సంఖ్యను పెంచి, వాటిని పటిష్టం చేస్తోందన్నారు. గురుకుల జూనియర్ కాలేజీల్లో ఇంటర్ తరగతుల ప్రారంభం విద్యాశాఖ పరిధిలో నడుస్తున్న 33 గురుకుల పాఠశాలలను ఇంటర్ కాలేజీలుగా ఈ ఏడాది అప్ గ్రేడ్ చేశామని, వీటిలో నేటి నుంచి తరగతులు ప్రారంభిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. ఈ కొత్త కాలేజీల్లో నేడు ఇంటర్ తరగతులు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. విద్యాశాఖ పరిధిలో నడుస్తున్న 35 గురుకుల పాఠశాలల్లో ఇప్పటికే రెండింటిలో ఇంటర్ తరగతులు నడుస్తున్నాయన్నారు. విద్యాశాఖ గురుకుల పాఠశాలలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఇక్కడ మౌలిక వసతుల కోసం 116 కోట్ల రూపాయలను ఖర్చుచేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వల్ల కేబ్ చైర్మన్ గా తాను కేజీబీవీలను 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పొడగించాలని కేంద్ర ప్రభుత్వానికి చేసిన ప్రతిపాదనలు అంగీకరించడం వల్లే నేడు దేశవ్యాప్తంగా కేజీబీవీలలో కూడా ఇంటర్ విద్య అందుబాటులోకి వస్తోందన్నారు. తెలంగాణలో ఈ సంవత్సరం 84 కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాలు, 17 మోడల్ స్కూళ్లు, 24 గిరిజన గురుకులాలు, 19 బీసీ గురుకులాలు, 10 మైనారిటీ గురుకులాలను ఇంటర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేశామన్నారు. కేజీబీవీలలో ఇంటర్ తరగతులు జూలై 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయని చెప్పారు. తెలంగాణలో విద్యా వ్యవస్థ గత పాలనలో భ్రస్టు పట్టిందని, దీనిని గాడిన పెట్టి ప్రమాణాలు పెంచాలని ముఖ్యమంత్రి కేసిఆర్ ఎంపీగా ఉన్న తనను తీసుకొచ్చి విద్యాశాఖ మంత్రిని చేశారని చెప్పారు. గత నాలుగేళ్ల కృషిలో భాగంగా ఈ ఏడాది పదో తరగతి, ఇంటర్ లో ప్రభుత్వ విద్యాలయాల్లో మంచి ఫలితాలు రావడం సంతోషంగా ఉందన్నారు. నేడు ప్రభుత్వ గురుకుల పాఠశాలలకు తీవ్ర డిమాండ్ ఏర్పడిందన్నారు. విద్యాశాఖ గురుకులాల్లో ఇంటర్ లో 3000 సీట్లకు నోటిఫికేషన్ ఇస్తే 80వేల దరఖాస్తులు రావడం ఈ డిమాండ్ కు నిదర్శనమన్నారు. ప్రభుత్వ విద్యను పటిష్టం చేయడంలో భాగస్వామ్యం వహించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులందరికీ ధన్యవాదాలు తెలిపారు. నేడు తెలంగాణ విద్య దేశానికే ఆదర్శంగా మారిందన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ త్వరలోనే విద్యార్థులందరికీ ఆరోగ్య పరీక్షలు, కంటి పరీక్షలు కూడా చేయించనున్నారని వెల్లడించారు. హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ పంపిణీ ప్రారంభం ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని రూపొందించిన హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ పంపిణీని నేడు కొడకండ్ల గురుకుల విద్యాలయంలో ప్రారంభించారు. విద్యార్థినుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఈ హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 100 కోట్ల రూపాయలతో జీడ్పీహెచ్ఎస్, యుపిఎస్, గురుకుల పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలలోని ఆరున్నర లక్షల మంది విద్యార్థినిలకు ఈ కిట్స్ అందించనున్నట్లు ప్రకటించారు. ఈ కిట్లలో 13 రకాల 50 వస్తువులను అందిస్తున్నామని, ఇవన్నీ బ్రాండెడ్ కంపెనీల నుంచి కొనుగోలు చేసి అందిస్తున్నట్లు వివరించారు. విద్యార్థినిలకు బ్రాండెడ్ సానిటరీ న్యాప్కిన్స్ అందిస్తున్నామని చెప్పారు. ఆరోగ్య పరిరక్షణ కోసం కిట్స్ ఇస్తున్నామని, ఆరోగ్యం కోసం పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. అన్ని గురుకులాల్లో ఒకే రకమైన మెనును అమలు చేస్తున్నామన్నారు. ఈ మెనులో నెలకు నాలుగుసార్లు చికెన్, రెండుసార్లు మటన్, వారానికి ఐదురోజులు గుడ్లు, ప్రతి రోజు రాగిమాల్ట్, పాలు, బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం మంచి కూరగాయలతో భోజనం, ప్రతి రోజు 50 గ్రాముల నెయ్యి, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం అందిస్తున్నామన్నారు. గతాన్ని నెమరువేసుకున్న ఉప ముఖ్యమంత్రి కడియం కొడకండ్లలో గురుకుల కాలేజీలో ఇంటర్ తరగతులను ప్రారంభించిన తర్వాత ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తన పాఠశాల జ్ణాపకాలను నెమరు వేసుకున్నారు. తనది, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావుది ఒకే గ్రామం పర్వతగిరి అని, తాను పదో తరగతిలో ఊరికి ఫస్ట్ రావడంతో ఆ ఊరి సర్పంచ్ గా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు తండ్రి స్వర్గియ జగన్నాథరావు తనకు ఎక్కువ మార్కులు తెచ్చుకున్నందుకు సన్మానం చేసి 116 రూపాయల నగదు పారితోషికం అందించారన్నారు. ఈ పారితోషికం నేడు 10వేలకు సమానమన్నారు. అదే సమయంలో ఇంటికెళ్లిన తర్వాత సరిగా చదవనందుకు ఎర్రబెల్లి దయాకర్ రావు కు కూడా సన్మానం చేశారన్నారు. ప్రతి విద్యార్థి కూడా పట్టుదలతో చదువుకోవాలని చెప్పారు.

kadiyam srihari new 1     kadiyam srihari new 2     kadiyam srihari new 4

విద్యార్థినిల సమక్షంలో ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదిన వేడుకలు

స్థానిక సీనియర్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదిన వేడుకలు కొడకండ్ల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో నేడు ఘనంగా జరిగాయి. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, స్థానిక అధికారులు, నేతలు, విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ…తాను సరిగా చదువుకోలేదని, తమ ఊరిలో ఎక్కువగా చదువుకున్న వ్యక్తి కడియం శ్రీహరేనని చెప్పారు. అయితే తాను లీడర్ కావాలని పట్టుపట్టి నేడు లీడర్ అయ్యానన్నారు. అందుకే తనకు చదువుకునే వారంటే చాలా ఇష్టమని విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ…ఎర్రబెల్లి దయాకర్ రావు తన నియోజక వర్గంలో విద్యాసంస్థల పటిష్టతపై ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారని చెప్పారు. తన సొంత ఖర్చుతో ఇంటర్ సెకండియర్ చదివే విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారని తెలిపారు. అంతే కాకుండా ఎస్.ఐ, కానిస్టేబుల్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు కూడా తన సొంత ఖర్చుతో శిక్షణ ఇప్పించడం అభినందనీయమన్నారు.

kadiyam srihari new 3     kadiyam srihari new 5     kadiyam srihari new 6

ఈ కార్యక్రమంలో విద్యాశాఖ గురుకులాల డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి, చీఫ్ ఇంజనీర్ మల్లేషం ఇతర అధికారులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *