
హైదరాబాద్ (పిఎఫ్ ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్షకు దిగిన జగన్ చేత ఏపి ప్రభుత్వం ఎట్టకేలకు దీక్షను భగ్నం చేసింది. ఆసుపత్రిలో చికిత్సనందిస్తూ ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారు. దీక్ష భగ్నం అయింది మరి ప్రత్యేక హోదా సంగతి ఎంత వరకు సఫలం అయింది.. జగన్ ఈ దీక్షతో సాధించిందేమిటీ… ఈ దీక్ష ఏమైనా సాధించిందా….?
జగన్ దీక్షకు క్రమక్రమంగా మద్దతు పెరుగుతుండడంతో టిడిపిలో ఆందోళన సైతం తారా స్థాయికి చేరింది. జగన్ దీక్షకు ఎలాగైనా భగ్నం చేయాలనే బాబు సర్కారు జగన్ తో బలవంతంగా ఈ దీక్షను భగ్నం చేయించదని వైఎస్ఆర్ సిపి నేతలు పలు ప్రజా సంఘాల నాయకులు బాబు సర్కారుపై మండిపడుతున్నారు. జగన్ దీక్షకు వ్యతిరేకంగా స్వయంగా మంత్రులే ప్రకటనలు చేయడం, జగన్ దీక్షపై టిడిపి మంత్రుల వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావివ్వడం కూడా ఇందుకు ఒక కారణం. ఈ దీక్షకు కాంగ్రెస్, సీపీఎం, సీపీఐలతో పాటు అనేక ప్రజా సంఘాలు జగన్ దీక్షకు మద్దతు పలికాయి. దీంతో ప్రత్యేక హోదా విషయం మరింత చర్చనీయాంశమైంది. మొత్తం మీద ఈ దీక్షతో ప్రత్యేక హోదాపై అన్ని రాజకీయ, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ఒక్క తాటిపైకి రావడంతో ఈ అంశంపై ఏదో ఒకటి తేల్చేయడం కంటే వేరే దారి లేకుండా పోయింది టిడిపి, బిజెపి పార్టీలకు. ఇప్పటికి ఈ దీక్షను భగ్నం చేసినా… భవిష్యత్తులో ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలను ఒకే తాటిపైకి తెచ్చి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే యోచనలో ఉన్నారు జగన్.