
హైదరాబాద్ : వై కా పా అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ శాసన సభా ప్రతిపక్షనేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణా ముఖ్యమంత్రి కె సి ఆర్ కు తొత్తులా వ్యవహరిస్తున్నాడని ఏపీ సమాచార శాఖామంత్రి పల్లెరఘునాద్ రెడ్డి ఆరోపించారు. ఆయన సచివాలయంలో మాట్లాడుతూ పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమ ప్రాంతంలో ఒక కోటి 20 లక్షల మంది ప్రజల తాగునీటి, సాగునీటి అవసరాలు తీరడానికి చంద్రబాబు నాయుడు తీవ్ర కృషి చేస్తుంటే, జగన్ దానిని అడ్డుకోవాలని చూస్తున్నాడని విమర్శించారు. పట్టిసీమ పేరు చెపితే జగన్ కు ఎక్కడ లేని ఆందోళన కలుగుతుందని, పట్టిసీమ ప్రాజెక్ట్ పూర్తయితే రాయలసీమలో తన ఉనికి కోల్పోతామేమోనని జగన్ కు భయం పట్టుకుందని ఆరోపించారు. జగన్ కు రాయలసీమ వాసులు సస్యశ్యామలంగా కళకళలాడుతూ సుసంపన్నమైన జీవితం గడపడం ఏమాత్రం ఇష్టం లేదని మండిపడ్డారు. సీమవాసులు పంటలు పండకుండా, దాహార్తితో అలమటిస్తూ ఇంకా వాళ్ళ చెప్పు చేతల్లో అదుపు ఆజ్ఞల్లో వుండాలని కోరుకుంటున్నాడని ధ్వజమెత్తారు. ఒక పక్క కే సి ఆర్ కూడా ఆంధ్ర ప్రాంతం వాళ్ళకు నీళ్లు ఇవ్వకుండా కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని.. కె సి ఆర్ కేవలం తెలంగాణా మాత్రమే బాగుండాలని కోరుకుంటున్నారని దీనికి జగన్ కూడా కె సి ఆర్ కు తొత్తులా వ్యవహరిస్తున్నాడని ఆయన దుయ్యబట్టారు.
తమ ప్రభుత్వం రెండు రాష్ట్రాల ప్రజలు బాగుండాలని కోరుకుంటున్నామని , రాయలసీమ ప్రజల దాహార్తిని, పంట పొలాలను కాపాడే , అత్యంత ప్రతిషాత్మకంగా చేపడుతున్న పట్టిసీమ ప్రాజెక్ట్ కు అడ్డు తగలడం మాని ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయ్యేదానికి సహకరించాలని కోరారు. లేకుంటే రాయలసీమ ప్రజలలో సీమ ద్రోహిగా ప్రజలలో చరిత్ర హీనుడిగా నిలిచిపోతావని ఆయన హితవు పలికారు .