
ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్లో ఐసియు, సిటి స్కాన్ ఏర్పాటు
లంచాలిచ్చినా, తీసుకున్నా ఉపేక్షించం… శిక్షిస్తాం
సాధ్యమైనంత వేగంగా సమస్యల పరిష్కారం
తల్లీ బిడ్డల సంక్షేమానికే అమ్మ ఒడి–కెసిఆర్ కిట్లు
ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ఎవరైనా లంచాలు తీసుకున్నా, ఇచ్చినా వారిని ఉపేక్షించబోమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి హెచ్చరించారు. తగు రీతిలో క్రిమినల్ కేసులు పెట్టి శిక్షిస్తామన్నారు. ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్‌కి వెంటనే ఐసియు ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. ఛాతీ దవాఖానాను మంత్రి శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు.
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఛాతీ దవాఖానాను ఆసాంతం పరిశీలించారు. ఓపీ విభాగం, ఇంటెన్సివ్ కేర్ యూనిట్, ఐసియు, పేషంట్ల వార్డులు, హెచ్ ఐ వి యూనిట్ వంటి అన్ని విభాగాలను మంత్రి పరిశీలించారు. అలాగే మంచాలను, ఇతర సదుపాయాలను చూశారు. హాజరు పట్టికను పరిశీలించారు. ఒక్కో విభాగంలో లోపాలను గుర్తించి వాటిని వెంటనే పరిష్కరించాలని సూపరింటెండెంట్‌కి సూచించారు. ఇటీవల ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వెంటిలేటర్ దొరకక ఒక వ్యక్తి మృతి చెందారన్న విషయమై ఆరా తీశారు. వెంటిలేటర్లు ఎందుకు లేవని సంబంధిత అధికారులను ప్రశ్నించారు. దవాఖానాల్లో ఎవరు లంచాలు అడిగినా వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. లంచాలు తీసుకోవడంపై సీరియస్‌గా ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. లంచాలు తీసుకోవడమేగాక, ఇచ్చే వాళ్ళ మీద కూడా నిఘా పెట్టాలని సూచించారు. లంచాలు తీసుకోవడమేగాక, ఇవ్వడం కూడా నేరమేనని, అలా ఇచ్చి, పుచ్చుకునే వాళ్ళని క్రిమినల్ కేసులు పెట్టి శిక్షిస్తామని మంత్రి హెచ్చరించారు.
పేషంట్ల కేర్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ఛాతీ దవాఖానా అధికారులను ఆదేశించారు. వైద్యం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సహించేది లేదన్నారు. ఉద్యోగులు విధుల్లో అలసత్వం వహించకుండా సమయపాలన పాటించాలని సూచించారు. రోగుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని, వైద్యం కూడా అలాగే అందించాలని మంత్రి చెప్పారు.
ఆతర్వాత మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్పిటల్స్ని బలోపేతం చేశామని, ఆధునిక వైద్య పరికరాలు, రోగ నిర్ధరాణ పరీక్షల పరికరాలు, రసాయనాలు, బెడ్లు, చెద్దర్లు వంటివన్నీ అందించామన్నారు. అలాగే ఆధునీకరణ చేపట్టామన్నారు. వీటిలో భాగంగా ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్లో కూడా ఐసియు ఏర్పాటుకు నిర్ణయించామన్నారు. అలాగే సిటి స్కాన్ సెంటర్‌ని కూడా పెడతామని మంత్రి తెలిపారు. చాతీ దవాఖానాలో నెలకొన్న సమస్యలు తమ దృష్టికి వచ్చాయని వాటిని సాధ్యమైనంత వేగంగా పరిష్కరిస్తామని మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు.
అమ్మలు–బిడ్డల కోసమే అమ్మ ఒడి–కెసిఆర్ కిట్లు
తల్లీ బిడ్డల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని వైద్య మంత్రి లక్ష్మారెడ్డి వివరించారు. గర్భవతులను గుర్తించడం, పౌష్టికాహారం అందించడం, నెలల వారీగా వైద్య పరీక్షలు చేయించడం, ప్రసూతికి ప్రభుత్వ దవాఖానాకు తీసుకెళ్ళడం, దవాఖానాల్లో సుఖ ప్రసవాలకు ప్రాధాన్యతనిస్తూ, తర్వాత తల్లీ బిడ్డలను వారి ఇండ్లకు క్షేమంగా చేర్చడం వరకు పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటున్నదన్నారు. ప్రసవాలకు వచ్చే మహిళలకు మూడు విడతలుగా రూ.12వేలు ఇవ్వడం, ఆడ పిల్ల పుడితే మరో వేయి అదనంగా రూ.13 వేలు ఇవ్వడం కూడా జరుగుతుందన్నారు. ఇక పిల్లకు టీకాలు వంటివి ఇస్తూనే, ఎక్కడా లేని విధంగా 15 రకాల పిల్లల, 6 రకాల తల్లుల వస్తువులతో కూడిన కిట్లను సీఎం కెసిఆర్ పేరిట, కేసిఆర్ కిట్లుగా అందించనున్నామని మంత్రి లక్ష్మారెడ్డి వివరించారు. ఈ అంశమై ఇప్పటికే సీఎం కెసిఆర్ ప్రత్యేక శ్రద్ధతో పరిశీలిస్తున్నారని చెప్పారు.
ఇక ప్రభుత్వ హాస్పిటల్స్‌పై నమ్మకం ఉంచాలని, గతంలో నిర్లక్ష్యం చేయబడిన ఈ రంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తూ, ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. ఎక్కడైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని వాటిని వెంట వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు.