చైనా పర్యటన ముగించుకుని నేటి రాత్రి హైదరాబాద్ వస్తున్న కడియం టీం !

·

· తొమ్మిది రోజుల పాటు చైనాలో భారీ విగ్రహాల తయారీపై అధ్యయనం చేసిన కమిటీ

· షాంఘై, నాన్జింగ్, లింగ్ షాన్, వుక్సి, హాంకాంగ్ ప్రాంతాల్లో పర్యటించిన కమిటీ సభ్యులు

· షాంఘై ఎలక్ట్రికల్ మరియు ఇంజనీరింగ్ కంపెనీ, ఏరోసన్ వంటి ప్రఖ్యాత కంపెనీలతో చర్చలు

· హైదరాబాద్ రాగానే భారీ విగ్రహాలపై సిఎం కేసిఆర్ కు నివేదిక అందిస్తాం- ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 125 అడుగుల అంబేద్కర్ భారీ విగ్రహాన్ని హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. అక్కడే 32 ఎకరాల స్థలంలో అద్భుతంగా అంబేద్కర్ స్మృతి వనాన్ని ఏర్పాటు చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామి ఇచ్చారు. అయితే ఇంతటి భారీ విగ్రహాన్ని, స్మృతి వనాన్ని ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో అంబేద్కర్ విగ్రహ కమిటీ వేశారు. ఈ కమిటీ వివిధ దేశాలు, ప్రాంతాల్లోని భారీ విగ్రహాల ఏర్పాటు, నిర్వహణపై అధ్యయనం చేస్తుందని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ నెల 14 నుంచి ఉప ముఖ్యమంత్రి కడియం నేతృత్వంలో విద్యుత్ శాఖ, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీలు బాల్క సుమన్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, ఆరూరి రమేష్, అధికారులు తొమ్మిది రోజుల పాటు చైనాలోని వివిధ ప్రాంతాల్లో భారీ విగ్రహాలను సందర్శించారు. వాటిని తయారు చేసిన కంపెనీలు, నిర్వహణ చేస్తున్న కమిటీలతో చర్చించారు. తొమ్మిది రోజుల పాటు జరిపిన చైనా పర్యటన ముగించుకుని బుధవారం(22.02.2017) రాత్రి హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటున్నారు.

చైనాలో ఈ నెల 14 నుంచి 22వ తేదీ వరకు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో పర్యటన చేసిన అంబేద్కర్ విగ్రహ కమిటీ పలు ప్రాంతాలు పర్యటించి, వివిధ కంపెనీలతో భారీ విగ్రహాల తయారీ, నిర్వహణ వంటి అంశాలపై అధ్యయనం చేసింది. కమిటీ పర్యటించిన ప్రాంతాల్లో షాంఘై, నాన్జింగ్, వుక్సి, లింగ్ షాన్, హాంకాంగ్ వంటి ప్రసిద్ధ నగరాలున్నాయి. ఇందులో వుక్సిలో 88 మీటర్ల (289 అడుగుల) ఎత్తైన విగ్రహం ప్రపంచంలోనే అతి ఎత్తైన విగ్రహంగా రికార్డుకెక్కింది. ఇక్కడ దాదాపు 72 ఎకరాల పార్కును ఏర్పాటు చేసి గొప్ప పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేశారు. అదేవిధంగా హాంకాంగ్ లో 70 మీటర్ల(220 అడుగుల) ఎత్తైన జ్ణాన బుద్ధుని విగ్రహాన్ని ఈ కమిటీ సందర్శించింది. ఈ విగ్రహం ఏర్పాటు, నిర్వహణ అంశాలపై కంపెనీతో చర్చించింది.

హైదరాబాద్ నగరంలో 125 అడుగుల అంబేద్కర్ భారీ విగ్రహ ఏర్పాటు కోసం చైనాలోని వివిధ కంపెనీలతో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో అంబేద్కర్ విగ్రహ కమిటీ సమావేశమైంది. ఇందులో షాంఘై ఎలక్ట్రికల్ మరియు ఇంజనీరింగ్ కంపెనీ, ఏరోసన్ ఇంజనీరింగ్ కంపెనీలు భారీ విగ్రహాలు రూపొందించడంలో ప్రఖ్యాతిగాంచినవి. అంబేద్కర్ విగ్రహ కమిటీ సభ్యులు ఈ రెండు కంపెనీల ప్రతినిధులతో చర్చించి, కంపెనీలలోని తయారీ విభాగాలను కూడా సందర్శించారు. హైదరాబాద్ లో ఎన్టీఆర్ ఘాట్ వద్ద 125 అడుగుల అంబేద్కర్ భారీ విగ్రహ ఏర్పాటు, స్మృతి వనం రూపకల్పనపై ఆయా కంపెనీల ఆసక్తి, భాగస్వామ్యంపై చర్చించారు.
చైనాలో తొమ్మిది రోజుల పాటు పర్యటన ముగించుకుని నేడు (22.02.2017) హైదరాబాద్ కు చేరుకుంటున్న అంబేద్కర్ విగ్రహ కమిటీ త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకు నివేదిక సమర్పిస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు వీలైనంత తొందరగా 125 అడుగుల అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *