చైనాలో ఘనంగా ముఖ్యమంత్రి కేసిఆర్ జన్మదిన వేడుక

 

 సిఎం కేసిఆర్ పుట్టిన రోజును జరుపుకున్న అంబేద్కర్ విగ్రహ కమిటీ

 కేక్ కట్ చేసి…వేడుక చేసుకున్న ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు

 సిఎం కేసిఆర్ జన్మదిన వేడుకల్లో చైనావాసులు

 తెలంగాణ ప్రజలకు ఇది పర్వదినం..గొప్పదినం- ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి

హైదరాబాద్ 17 – తెలంగాణ జన హృదయ నేత, రాష్ట్ర ప్రదాత, బంగారు తెలంగాణ నిర్మాత, సకల జనుల ప్రియతమ నేత గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ జన్మదిన వేడుకలను అంబేద్కర్ విగ్రహ కమిటీ చైనాలో ఘనంగా జరుపుకుంది. కేక్ కట్ చేసి, క్యాండిల్స్ వెలిగించి లాంగ్ లివ్ కేసిఆర్, జై తెలంగాణ అనే నినాదాలతో సిఎం కేసిఆర్ పుట్టిన రోజును ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, విద్యుత్ శాఖ, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీలు బాల్కసుమన్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, రసమయి బాలకిషన్, అధికారులు చైనాలోని నాన్జింగ్ లో వేడుకగా చేసుకున్నారు.

బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా భారతదేశానికి దిశానిర్ధేశనం చేసే రాజ్యాంగాన్ని నిర్మించిన బాబా సాహెబ్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రకటించారు. కేవలం విగ్రహ ఏర్పాటు చేయడమే కాకుండా అక్కడ 32 ఎకరాల స్థలంలో అంబేద్కర్ స్మృతి వనాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు కూడా నిర్ణయించి గత ఏడాది అంబేద్కర్ జయంతి సందర్భంగా శంకుస్థాపన వేశారు. అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహాన్ని జీవం ఉట్టిపడేలా ఏర్పాటు చేయడానికి ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో అంబేద్కర్ విగ్రహ కమిటీని వేశారు. ఈ కమిటీ ప్రపంచంలో అత్యంత భారీ విగ్రహాలు తయారు చేసే దేశాలు, ప్రాంతాల్లో పర్యటించి వాటిని అధ్యయనం చేయాలని సూచించారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో అంబేద్కర్ కమిటీ చైనాలో గత మూడు రోజులుగా పర్యటిస్తోంది.

అంబేద్కర్ విగ్రహా ఏర్పాటు అధ్యయనం కోసం చైనాలో పర్యటిస్తున్న సందర్భంలో మన ప్రియతమ నేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ జన్మదినం ఫిబ్రవరి 17వ తేదీన రావడంతో అంబేద్కర్ కమిటీ సభ్యులు ఈ వేడుకలను చైనాలోనే కేక్ కట్ చేసి ఆనందోత్సహాలతో జరుపుకున్నారు. ముఖ్యమంత్రి తమకు అప్పగించిన పనిని చేస్తూనే సిఎం కేసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియ జేశారు.

ముఖ్యమంత్రి కేసిఆర్ పుట్టిన రోజు తెలంగాణకు పర్వదినమని, గొప్ప రోజు అని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. తెలంగాణ ప్రజల కలలు సాకారం చేసిన మహానుభావుడిగా కొనియాడారు. తెలంగాణలో ఉన్నవారికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ వాదులు, తెలంగాణ ప్రజలు జరుపుకునే పండగ రోజు సిఎం కేసిఆర్ పుట్టిన రోజన్నారు. కేసిఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్నామని, ఆయన నాయకత్వంలోనే తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చాలని, పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందజేయాలని, బంగారు తెలంగాణగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, ఆ కృషిలో తెలంగాణ ప్రజలంతా భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ కు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాన్ని ఇవ్వాలని, వారి నాయకత్వంలో తెలంగాణ మరింత అభివృద్ధి చెందే విధంగా ఆశీర్వదించాలని కోరుకున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ పుట్టిన రోజును తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరుపుకోవాలని, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని , ఆయన కల సాకారంలో అందరూ భాగస్వాములు కావాలని విద్యుత్, ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు.

కొట్లాడి సాధించుకున్న తెలంగాణకు ముఖ్యమంత్రి కేసిఆర్ కొంగుబంగారమని, బంగారు తెలంగాణ ఆయన నాయకత్వంలోనే నిజమవుతుందని ఎంపీ బాల్క సుమన్ అన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా లక్ష్యాన్ని చేరేంతవరకు విశ్రమించని పోరాటానికి కేసిఆర్ నిదర్శనమని, ఇది తెలంగాణ యువతకు ఆదర్శం కావాలని ఆకాంక్షించారు.

తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ తెలంగాణ అస్తిత్వాన్ని చరిత్రలో నిలిపేందుకు అలుపెరుగని కృషి చేస్తున్నారని తెలంగాణ సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్ అన్నారు. తెలంగాణ కళలకు, కళాకారులకు, యాసకు, భాషకు, పండుగలు, సంప్రదాయాలకు ప్రాణం పోస్తున్నారని కొనియాడారు. తెలంగాణ వస్తే ఏమొస్తది అన్న వాళ్లకు ఇది నా తెలంగాణ, కళల తెలంగాణ అని ఎలిగెత్తి చాటుతున్నారన్నారు. తెలంగాణను బంగారు తెలంగాణగా చేసేందుకు అనునిత్యం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసిఆర్ కు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని,పుట్టిన రోజు శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలకు తెలిపారు.

About The Author

Related posts