ఘనంగా బతుకమ్మ పండుగ ఏర్పాట్లు : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్

ఈ నెల 20వ తేది నుండి 28 వ తేదీ వరకు 9 రోజుల పాటు నిర్వహించే బతుకమ్మ పండుగకు ఘనంగా  ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.పి.సింగ్  అధికారులను ఆదేశించారు.

గురువారం సచివాలయం లో బతుకమ్మ పండుగ నిర్వహణపై వివిధ  శాఖల ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశములో ఆయన మాట్లాడుతూ, పండుగ నిర్వహణకు అన్ని శాఖలు సమన్వయముతో పనిచేసి, తెలంగాణా రాష్ట్ర ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పేలా ఉత్సవాలను నిర్వహించాలని అన్నారు.

ఉత్సవాలలో భాగంగా  సెప్టెంబర్  26 న దాదాపు 35వేల  మంది మహిళలతో పెద్ద ఎత్తున ఎల్.బి. స్టేడియంలో బతుకమ్మ పాటలతో, “బతుకమ్మ పండుగ ఉత్సవం” నిర్వహించడానికి చర్యలు చేపట్టాలన్నారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా, సెప్టెంబర్ 28 న  తేదిన  వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మహిళలతో బతుకమ్మలను ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. బతుకమ్మ పండుగ ఉత్సవం,  నిమజ్జనం సందర్భంగా మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా అన్ని చర్యలు చేపట్టాలన్నారు.  నిమజ్జనం సందర్భంగా తాత్కాలిక మరుగుదొడ్లు, రోడ్ల మరమ్మతులు, మంచినీటి సౌకర్యం వంటి పనులు చేపట్టాలన్నారు.  ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా సమగ్రమైన ట్రాఫిక్ ప్రణాళికలు రూపొందిoచాలని నగర పోలీసు కమిషనర్ ను ఆదేశించారు.  రాష్ట్ర్త స్థాయిలో నిర్వహించే విధంగా జిల్లాలలో కూడా బతుకమ్మ పండుగను నిర్వహించుటకు అన్ని చర్యలు  తీసుకోవాలని అయన అధికారులను ఆదేశించారు. ఇందుకుగాను జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించాలన్నారు.

తెలుగు ప్రజలు ఉండే వివిధ రాష్ట్రాలతో పాటు దేశ విదేశాలలో కూడా బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించడానికి చర్యలు చేపట్టాలని సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ.బి వెంకటేశంను సి.ఎస్ ఆదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా. రమణాచారి మాట్లాడుతూ,బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా జరుపుకోవాలని, గతంలోనే ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. గత సంవత్సరం నిర్వహించిన బతుకమ్మ పండుగ ఉత్సవాల కంటే ఈ సారి వినూత్నంగా నిర్వహించడానికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని అన్నారు.  గత సoవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా వివిధ రాష్ట్రాలలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించడానికి అన్ని చర్యలు చేపట్టాలన్నారు

రాష్ట్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ బి.వెంకటేశం మాట్లాడుతూ బతుకమ్మ పండగతో తెలంగాణ రాష్ట్రానికి మంచి గుర్తింపు వచ్చిందన్నారు. గతానికి కంటే భిన్నంగా ఈ సారి బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.వివిధ సెక్టార్లకు చెందిన మహిళలను బతుకమ్మ పండుగలో భాగస్వాములను చేసి ఒక్కొక్కరోజు ఒకరు పాల్గొనే విధంగా  కార్యక్రమాలు రూపొందించడం జరుగుతుందన్నారు. ఈ నెల 26న ఎల్.బి.స్టేడియంలో దాదాపు 35 వేల మంది మహిళలతో మహాబతుకమ్మ పండుగ ఆడటం జరుగుతుందన్నారు. ఈనెల 28 న సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా పీపుల్స్ ప్లాజా నుండి బతుకమ్మ ఘాట్ వరకు మహిళలతో ర్యాలీ నిర్వహించి ట్యాంక్ బండ్ లో బతుకమ్మలను నిమజ్జనం చేయడం జరుగుతుందన్నారు.

ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ అజయ్ మిశ్రా,  ముఖ్యకార్యదర్శి           శ్రీ సునీల్ శర్మ, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ బి. వెంకటేశం,   ఆర్ధిక శాఖ కార్యదర్శి శ్రీ శివశంకర్, సి.ఎం.ఓ అదనపు కార్యదర్శి శ్రీమతి స్మితా సబర్వాల్,  హైదరాబాదు జిల్లా కలెక్టర్ శ్రీమతి యోగితా రాణా, హెచ్.ఎం.డి.ఏ. కమిషనర్ శ్రీ చిరంజీవులు,  నగర పోలీసు కమీషనర్  శ్రీ మహేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అధారిటి మేనేజింగ్ డైరెక్టర్  శ్రీ దినకర్ బాబు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ శ్రీ హరిక్రిష్ణ, జి.హెచ్.ఎం.సి. మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *