
ప్రస్తుత సీజన్ లో డెంగ్యు, మలేరియా పాజిటీవ్ కేసులు వచ్చినవారి ఇళ్లతో పాటు పరిసర ప్రాంతాల్లోని ఇళ్లల్లో, జోనల్, డిప్యూటి కమిషనర్లు, మెడికల్ ఆఫీసర్లు తమ ఎంటమాలజి సిబ్బందితో వెళ్లి యాంటి లార్వా మందును పిచికారి చేయడంతో పాటు అన్ని పాఠశాలల్లో దోమల నివారణ మందును స్ర్పేయింగ్ చేయాలని జిహెచ్ఎంసి ఆదేశాలు జారీచేసింది. ఆరోగ్య శాఖ ప్రతిరోజు వివిధ ఆసుపత్రుల ద్వారా మలేరియా, డెంగ్యూ పాజిటీవ్ కేసుల జాబితాను జిహెచ్ఎంసికి అందజేస్తోంది. ఈ పాజిటీవ్ కేసుల వివరాలను డిప్యూటి కమిషనర్లకు, జోనల్ కమిషనర్లకు జిహెచ్ఎంసి శానిటేషన్ విభాగం పంపిస్తోంది. తమ పరిధిలో ఎవరైనా డెంగ్యు, మలేరియాతో ఉంటే ఆయా ఇళ్లకు ఎంటమాలజి సిబ్బందిని పంపించి ఇళ్లలో యాంటి లార్వా స్ప్రే చేయడంతో పాటు పరిసరాల్లోని ఇళ్లల్లోనూ స్ప్రేయింగ్ చేపడుతున్నారు. వీటితో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలలోనూ యాంటి లార్వా మందును స్ర్పేయింగ్ చేసే కార్యక్రమం కూడా జిహెచ్ఎంసి ప్రారంభించింది. జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న 7,600లకు పైగా పాఠశాలల్లో పది లక్షల మంది విద్యార్థినీవిద్యార్థులు అభ్యసిస్తున్నారు. ఈ పాఠశాలలోకి జోనల్, డిప్యూటి కమిషనర్లు, మెడికల్ ఆఫీసర్లు, ఎంటమాలజి అధికారులు వెళ్లి దోమల నివారణ, ప్రతి ఫ్రై డేను డ్రై డేగా నిర్వహించడం, నీటిని కాచి వడబోసి తాగడం, పరిసరాల పరిశుభ్రతతో పాటు మలేరియా, డెంగ్యూ నివారణ చర్యలు తదితర అంశాలపై చైతన్యపరుస్తున్నారు. వీటికితోడు నగరంలో ఉన్న అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో అర్బన్ హెల్త్ సెంటర్లు, బస్తీ దవాఖానాల్లో అందిస్తున్న ప్రత్యేక వైద్య సదుపాయాలు, వైద్య ఆరోగ్యశాఖ ద్వారా ఏర్పాటు చేస్తున్న ఉచిత వైద్య శిభిరాలను ఉపయోగించుకోవాలని చాటింపు నిర్వహిస్తున్నారు. గత సంవత్సరాల్లో మలేరియా, డెంగ్యూ నమోదు అయిన ప్రాంతాలపై కూడా ప్రత్యేక దృష్టి సాధించి దోమల నివారణ చరర్యలను జిహెచ్ఎంసి చేపట్టింది. నగరంలోని పలు చెరువులు, కుంటలలో డ్రోన్ ల సహాయంతో యాంటి లార్వా మందులను కూడా స్ప్రే చేస్తున్నారు.
ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించేందుకు చేయాల్సినవి ఇవే…
నగరంలో కురుస్తున్న వర్షాల వల్ల దోమల వ్యాప్తి చెందకుండా జీహెచ్ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లను చేపట్టింది. ముఖ్యంగా సెప్టిక్ లాట్రీన్‌లు, టాయిలెట్ల పై ఉండే గొట్టాలపై ప్రత్యేకంగా మెష్లను ఏర్పాటు చేయడం, ఇళ్లలో ఉన్న టైర్లు, పాత కుండలు, కూలర్లలో నీటి నిల్వలను తొలగించడం, ఇంటింటికి లార్వా నివారణ మందును పిచికారి చేయడంతో పాటు నగరంలోని అన్ని పాఠశాలలో అంటు వ్యాధులు, దోమల వ్యాప్తి నిరోధానికి చేపట్టాల్సిన చర్యలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలను జీహెచ్ఎంసీ పెద్ద ఎత్తున చేపట్టింది. నేడు హైదరాబాద్ నగరంలో ప్రధానంగా నగర శివారు ప్రాంతాల్లో డ్రైనేజీ లేని బస్తీలు, కాలనీలలో సెప్టిక్ ట్యాంక్‌లపై ఉన్న ఎయిర్ పైప్‌లపై మెష్లను ఏర్పాటుచేసే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా జీహెచ్ఎంసీ ఎంటమాలజి విభాగం చేపట్టింది.