
హైదరాబాద్ (పిఎఫ్ ప్రతినిధి): గ్రేటర్ హైదరాబాద్లో అక్రమంగా తోలగిస్తున్న ఓట్ల గురించి సీఎం కెసిఆర్ ప్రభుత్వంపై ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్ తెలిపారు. అన్ని పార్టీల నాయకులు గ్రేటర్ లో జరుగుతున్న అక్రమ ఓట్ల తొలగింపు గురించి అధికారులకు వివరించడం జరిగిందని తెలిపారు. జూబ్లి హిల్స్ కు సంబంధించి ఓటర్ల జాబితాను అధికారులకు వివరించారు. కేంద్ర ఎన్నికల అధికారులు జూబ్లిహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్ గూడ కృష్ణానగర్ బిబ్లాక్లో 182, 183, 184లలో అక్రమ ఓట్ల తొలగింపుకు సంబంధించి వెరిఫికేషన్ నిర్వహించారు. వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం సీఎం కెసిఆర్, సోమేష్ కుమార్, భన్వర్ లాల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ కుట్ర పూరితంగా లక్షల ఓట్లను తొలగించి నియంతలాగా వ్యవహరిస్తున్నాడని, వచ్చే జిహెచ్ఎంసి, వరంగల్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ది చెబుతారని వివేకానంద గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ప్రకాశ్ గౌడ్ తదితరులున్నారు.