
జిల్లా పంచాయతీ అధికారులు, గ్రామీణాభివృద్ధి అధికారులు, జెడ్పీ సీఈఓలు, ఏపీఓలు, ఎంపీడీఓలతో పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్
వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో అంటువ్యాధులు ప్రభలకుండా పారిశుద్ధ్య చర్యలు తీసుకోవాలని ఆదేశం
గ్రామాల్లో వీధులను శుభ్రంగా ఉంచడంతో పాటు, నీరు నిలువ ఉండే ప్రదేశాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడం లాంటివి చేయాలని సూచన
వర్షపు నీరు నిలిచి వ్యాధులు ప్రభలకుండా చర్యలు తీసుకోవాలని, గ్రామాల్లో పారిశుద్ధ్యలోపం లేకుండా చూడాలని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. జిల్లా పంచాయతీ అధికారులు, గ్రామీణాభివృద్ధి అధికారులు, జెడ్పీ సీఈఓలు, ఏపీఓలు, ఎంపీడీఓలతో గురువారం మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గద్వాల కలెక్టరేట్ నుండి మంత్రి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని..పారిశుద్ధ్య చర్యలతో పాటు పలు అంశాలపై సూచనలు చేశారు. వర్షపు నీరు నిలువ ఉంటే వ్యాధులు ప్రభలే అవకాశం ఉంటుందని… ముందుజాగ్రత్తగా పారిశుద్ధ్యలోపం లేకుండా చూసుకోవాలన్నారు. దోమల నిర్మూలనకు ఫాగింగ్ చేయడంతో పాటు, చెత్త సేకరణ కోసం పంచాయతీలకు ఇచ్చిన రిక్షాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రధానంగా డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా ఉండేలా చూడాలని..నీరు నిలువ ఉండే ప్రదేశాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడం లాంటి చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో చెత్త సేకరణ కోసం ఇప్పటికే రిక్షాలను పంపిణీ చేయడం జరిగిందని…వాటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. రిక్షాలు ఉన్నఅన్ని పంచాయతీల్లోనూ తడి, పొడి చెత్త సేకరణకు ప్లాస్టిక్ డబ్బాలను ఇవ్వాలన్నారు. రిక్షాల వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని వారం రోజుల్లో అందజేయాలని ఆదేశించారు.
జాబ్ కార్డులు పొందిన కూలీల్లో 60 శాతం మందికి వందరోజుల పని కల్పించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలన్నారు. ప్రధానంగా డంపింగ్ యార్డులు, వైకుంఠధామాల నిర్మాణంలో ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని…ఈ విషయంలో జనగామ జిల్లాను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఒకట్రెండు నెలల్లో పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణాలు అన్నీ పూర్తి చేయాలి, గ్రామ సర్పంచ్‌తో పాటు ప్రజాప్రతినిధులందరినీ భాగస్వామ్యం చేయాలన్నారు. ఫాం పాండ్స్ నిర్మాణాలు అనుకున్నంత వేగంగా జరుగడం లేదని… ఆ దిశగా రైతుల్లో చైతన్యం తేవాల్సిన అవసరం ఉందన్నారు. వర్షాలు కురుస్తున్నన్ని రోజులు హరితహారాన్ని కొనసాగించాలని, నర్సరీల్లో అందుబాటులో ఉన్న ప్రతి మొక్కను నాటేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే హరితహారం మొక్కలకు సంబంధించిన జియో ట్యాగింగ్ను మరింత వేగవంతం చేయాలని, ప్రతి మొక్కను జియో ట్యాగ్ చేయాలన్నారు. సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్య కార్యదర్శి వికాస్రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్, అధికారులు రామారావు, సైదులు, ఆశా తదితరులు పాల్గొన్నారు.